ముందు ఇంటిని చక్కదిద్దాలి! | International Womens Day Article By Vasireddy Padma | Sakshi
Sakshi News home page

ముందు ఇంటిని చక్కదిద్దాలి!

Published Tue, Mar 8 2022 12:47 AM | Last Updated on Tue, Mar 8 2022 12:47 AM

International Womens Day Article By Vasireddy Padma  - Sakshi

మానవ పరిణామక్రమం, అభి వృద్ధిలో పడుతూ, లేస్తూ చేసిన  ప్రయాణంలో స్త్రీపురుషులిద్దరూ భాగస్వాములే! కానీ మనిషి చరిత్ర అంటే... మగవారి చరిత్రే అన్న అభి ప్రాయం చలామణి అవు తోంది. గడచిన చరిత్రలో వాటా కావాలని మహిళలేమీ ఇప్పుడు అడగడం లేదు. కానీ, వర్తమానం కూడా ఎందుకు ఊపిరి ఆడనివ్వడంలేదని అడుగుతున్నారు. ఒక్క మార్పునకు యుగాలకాలం మా విషయంలోనే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 50 ఏళ్లనాటి బాలికావిద్య, బాల్యవివాహం వంటివి... సమస్యల జాబితా నుండి ఇప్పటికీ తొలగి పోలేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్‌షిప్‌ల బ్లాక్‌ మెయిల్, మార్ఫింగ్‌లతో సమస్యల చిట్టా చాంతాడంత పెరిగింది. ఆకాశమే హద్దుగా ఆమెకు అవకాశాలు అంటున్నాం. ఏ స్థానంలో ఉన్నా ఆడతనమే కొలమాన మని ఆంక్షలు పెడుతున్నాం.

ఆధునిక మహిళగా మారాలని అంటున్నాం. మల్టీ టాస్క్‌ ఉమెన్‌ అని బరువులు మోపుతున్నాం. ఏదయినా సాధించు... వంటిల్లు, పిల్లల విషయంలో మాత్రం సక్సెస్‌ సర్టిఫికేట్‌ ఉందా అని దబాయిస్తున్నాం. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని ఊరిస్తున్నాం. కానీ, పనిచేసే చోట... కీచకులను కట్టడి చేయలేకపోతున్నాం. ఆమె ఉద్యోగం చేయాలి, జీతంపై హక్కు మాత్రం లేదంటారు. స్వేచ్ఛ ఇస్తున్నాం... కానీ, రిమోట్‌ కంట్రోల్‌ మాత్రం తమ చేతిలోనే అంటారు. సృష్టికి మూలం స్త్రీ అంటారు. ప్రాణం తీయడానికి మాత్రం వెనుకాడరు. ఎంతటి ధైర్యలక్ష్మి తల్లులైనా విరక్తితో ముగింపు వాక్యం రాసేలా లొంగదీసి, కృంగదీసి ఆడుకుంది సమాజం, కుటుంబం. తనను తాను మార్చుకుంటూ... తనలో తాను పోటీ పడుతూ... కొత్త మనిషిలా ఆమె... మహిళ విషయంలో రోజురోజుకూ పతన మవుతూ... అనాగరికంగా అతను – కుటుంబాలు ఎందుకు అలజడులతో నిండుతున్నాయో అర్థమవుతోందా?

తాకితే నేరం.., కనుసైగ చేసినా నేరమే. అశ్లీల పదం వాడితే శిక్ష... గృహ హింస నుండి రక్షణ. లైంగిక వేధింపు లకు పాల్పడితే ఖేల్‌ ఖతం. ఇలా ఎన్నెన్నో చట్టాలు... అయినా ఇవన్నీ ఎందుకు మహిళకు భరోసా ఇవ్వలేక పోతున్నాయి? చట్టం ఉన్నది శిక్షించడానికి! మరి, జీవించ డానికీ? సమాజం ఒక జీవనదిలా ప్రవహించాలి. కొన్నింటిని కలుపుకొంటూ... అడ్డుగా ఉన్న వాటిని పడ దోసుకుంటూ... కొన్నిసార్లు తానే ఒంపులు తిరిగి తప్పు కుంటూ బతకాలి, బతికించాలి... ప్రవహించాలి. చట్టం చేశాం కదా చప్పట్లు కొట్టండి అంటాయి చట్టసభలు. ఆ చట్టం జీవనదిలా కుటుంబాన్ని తాకక పోతే అందులో ఉన్న మహిళకు రక్షణ ఎలా సాధ్యం? ఇదే మనం ఎదుర్కొం టున్న అతి పెద్ద వైఫల్యం. 

మన దేశంలో మహిళలపై జరిగే నేరాల్లో దాదాపు 90 శాతం గృహ హింసకు సంబంధించినవి. క్రూరంగా, నిర్దాక్షి ణ్యంగా వ్యవహరించే కుటుంబాన్ని నేటి మహిళ నిల దీస్తోంది. తాను గెలవాలని, కుటుంబాన్ని గెలుచుకోవాలని ఆరాటపడుతుంది. ఇల్లే ఇంత విష వలయంగా ఉంటే ప్రతి మహిళ బయట ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో ఊహిం చగలమా! ప్రతిరంగంలో దూసుకుపోతున్న అమ్మాయిలు చేస్తున్న అస్తిత్వ పోరాటం ఇప్పుడున్న చట్టాలకు అర్థమవు తోందా? తమను సమాన భాగస్వామిగా గుర్తించమని నిగ్గదీసి అడుగుతున్న నేటితరం అమ్మాయిలకు సూటిగా సమాధానం చెప్పే దమ్ము సమాజంలోని మిగతా సగానికి ఉందా?

ఎదురవుతున్న సమస్యలపై పోరాటంలో పడుతూ... లేస్తూ...  కెరటమై గెలుస్తూ సాగుతున్నారు. ఈ ప్రయా ణంలో వారికి ఒక దన్ను కావాలి. ఆ అండగా ప్రభుత్వం నిలిస్తే గుణాత్మక మార్పును కళ్లతో చూడగలం. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టం అటువంటి మార్పును మనకు చూపిస్తుంది. పాలకులుగా పెద్ద ఎత్తున మహిళలు ఇప్పుడు ఏపీలో ఉన్నారు. మహిళల అధికారాన్ని అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అందివచ్చిన ఈ అవకాశం ఆసరాగా మహిళా సాధికారతను విస్తరించాలి. ప్రభుత్వం, చట్టం, కుటుంబం... ఈ మూడింటినీ బలంగా అనుసంధానం చేయాలి. ఇందుకోసం ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏడాది పాటూ కార్యాచరణలో ఉండే ‘సబల’ కార్య క్రమాన్ని రూపొందించింది. ఈ రోజు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘సబల’ కార్యాచరణ ప్రారంభిస్తారు. 


వాసిరెడ్డి పద్మ 
వ్యాసకర్త చైర్‌పర్సన్, రాష్ట్ర మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement