‘‘స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధితుడై ఉన్నాడు’’ అన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త రూసో తన ‘సోషల్ కాంట్రాక్ట్’ గ్రంథంలో. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ఉక్రెయినియన్లకు జీవన్మరణ పోరాటం అయింది. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శరణార్థులుగా ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. శరణార్థులుగా వారు అప్పటి వరకు అనుభవించిన స్వేచ్ఛ, అస్తిత్వాలను కోల్పోవడం కనిపిస్తోంది.
లక్షల సంవత్సరాల మానవపరిణామ క్రమంలో మనిషి నేర్చుకున్నదేంటి? ఒక మనిషి మరొక మనిషిపై ఏదో ఒక రూపంలో అజమాయిషీ లేదా ఆధిపత్యం చలాయించటం దేనికి? తాజాగా మితిమీరిన రష్యా రాజ్యకాంక్ష వల్లనే లక్షలాది మంది జన్మభూమిని వదిలి విదేశాలకు వెళ్లవలసి వచ్చింది. యుద్ధం వల్ల బాల్యం ప్రశ్నార్థకం అవుతోంది.
లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులు నేడు సరిహద్దు దేశాలకు వెళ్తున్న దృశ్యాలు చూస్తుంటే కన్నీరు రాక మానదు. పదకొండు సంవత్సరాల ‘హసన్ అక్లాఫ్’ అనే పిల్లవాడు చేతిపై తన బంధువుల ఫోన్ నంబర్ రాసుకొని ఏడువందల యాభై మైళ్ళ దూరంలో ఉన్న స్లొవేకియాలోని బంధువుల దగ్గరికి రైలు ప్రయాణం చేసి వెళ్ళడం బాధకల్గించే విషయం కాకపోతే ఏమిటి? అదే విధంగా అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించినప్పుడు కాబూల్ విమానాశ్రయంలో జరిగిన సన్నివేశాలు ఎందరినో కంట తడి పెట్టించాయి. పాలకులు యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేయకపోతే ఏం జరుగుతుందో ఇవన్నీ సజీవ ఉదాహరణలు.
మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల వల్ల మానవాళి సాధించిందేమిటి? ఇరాక్‌పై అమెరికా చేసిన యుద్ధం ఫలితం ఏమిటి? అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను వేటాడటం కోసం వెళ్లిన అమెరికా సైన్యం ఆదేశానికి చేసింది మేలా, కీడా? మనుషులు అనుభవించే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆయా ప్రభుత్వాలు తమ అనాలోచిత నిర్ణయాలతో హరించి వేస్తున్నాయి. యుద్ధం వల్ల జరిగిన మానవ విధ్వంసాన్ని చూసి వగచే కన్నా... అసలు యుద్ధమే రాకుండా నివారించడం పాలకుల కర్తవ్యం. సంధి ప్రయత్నాలు ఎప్పటికీ స్వాగతించాల్సినవే. (క్లిక్: జూలియన్ అసాంజే అప్పగింత తప్పదా?)
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అణ్వస్త్ర దాడికి గురైన హిరోషిమా, నాగసాకి పట్టణాలలోని ప్రజలు నేటికీ పర్యవసానాలు ఎదుర్కుంటూనే ఉన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విషయంలో రెండు దేశాలూ తప్పుడు విధా నాలు అవలంబించాయనేది అందరికీ తెలిసిన విషయమే. నాటో దేశాల ద్వారా ఉక్రెయిన్‌కి అగ్ర రాజ్యమైన అమెరికా ఆయుధాలు సరఫరా చేసి యుద్ధాన్ని ప్రోత్సహించడం కన్నా, పెద్దన్న పాత్ర పోషించి యుద్ధాన్ని నివారించి ఉంటే బాగుండేది. అలా కాక యుద్ధం చేయడానికి ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా ద్వారా సొమ్ము చేసుకోవడం... ‘శవాలపై పేలాలు ఏరు కోవడం’ లాంటిదే.
ఉక్రెయిన్ పునర్నిర్మాణం తిరిగి ఎన్నటికి సాధ్యమవుతుందో ఓసారి కూలిన శిథిలాల మధ్య నిలబడి అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఆలోచించుకోవడం ఉత్తమం. రష్యా కోరినట్టుగా నాటోలో చేరబోమని హామీ ఇస్తే ఉక్రెయిన్‌కు వచ్చిన నష్టమేమిటి? ఫలితంగా యుద్ధం నివారింపబడేది. లక్షలమంది నిరాశ్రయులు కాకుండా, కష్టపడి నిర్మించుకున్న ఆశలసౌధాలు కళ్లముందు నేలమట్టం కాకుండా ఉండేవి. (క్లిక్: అంతర్జాతీయ సంఘీభావమే ఆయుధం)
- డా. మహ్మద్ హసేన్
వ్యాసకర్త రాజనీతి విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment