ఈయూ అనుభవం నేర్పే పాఠాలు | Lessons from the EU experience | Sakshi
Sakshi News home page

ఈయూ అనుభవం నేర్పే పాఠాలు

Published Sat, Aug 31 2024 3:39 AM | Last Updated on Sat, Aug 31 2024 3:39 AM

Lessons from the EU experience

జన్యుమార్పిడి(జీఎం) పంటలపై కేంద్రప్రభుత్వం ఆమోదయోగ్యమైన విధానాన్ని తేవాలని సుప్రీంకోర్టు కోరింది. జీఎం పంటలను చాలా రాష్ట్రాల వ్యవ సాయ సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మనుషులు, జంతువులు, మొక్కల మీద వీటి ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం, జీఎం జనరే టర్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ పంటలను సులభంగా ఆమోదించడానికి దూరంగా ఉన్నాయి. ఒకనాటి హరిత విప్లవం ఫలితంగా ఉత్పాదకత పెరిగింది. కానీ ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే జీఎం సాంకేతికతకు సంబంధించిన ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.

జన్యుమార్పిడి పంటలపై ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను ఇటీవల సుప్రీంకోర్టు కోరింది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో జన్యుమార్పిడి పంటల ప్రవేశాన్ని సంశయవాదులు అడ్డుకోగలిగారు. పర్యావరణం, వ్యవ సాయ వైవిధ్యం, మానవులు, జంతువుల ఆరోగ్యంపై జన్యుమార్పిడి పంటల ప్రభావాలపై 18 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ సంఘాల నాయకులు గత వారం ఒక జాతీయ సదస్సును నిర్వహించారు. జన్యుమార్పిడి పంటలను వారు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారు.

జన్యుమార్పిడి జీవులకు సంబంధించి తగిన ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించడానికి భారతదేశం పోరాడుతోంది. యూరో పియన్‌ యూనియన్‌(ఈయూ) తన సభ్య దేశాలలో జన్యుమార్పిడి ఉత్పత్తులు, విత్తనాల ప్రవేశాన్ని నియంత్రించడానికి చాలా కాలం కుస్తీ పట్టింది. సమగ్రమైనది కానప్పటికీ, మంచి విధానాన్నిరూపొందించగలిగింది. ఇది భారత్‌కు పాఠాలను అందిస్తుంది.

ప్రపంచం ఇప్పటివరకు మూడు ‘హరిత విప్లవాలను’ చూసిందని వ్యవసాయ వృద్ధి చరిత్ర చెబుతోంది. మొదటిది 1930లలో యూరప్, ఉత్తర అమెరికాలో ప్రారంభమైంది. ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, వ్యవసాయ నిర్వహణను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఇది మొక్కజొన్న, ఇతర సమశీతోష్ణ వాతా వరణ పంటలలో త్వరిత దిగుబడిని పెంచింది. రెండో హరిత విప్లవం కొన్ని భారతీయ రాష్ట్రాలతోపాటు 1960లు, 1970లలో చోటు చేసు కుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఉష్ణమండలంలోపండించే పంటలకు అదే విధమైన సాంకేతికతను బదలాయించింది. స్థానిక పరిశోధనలను ఉపయోగించడం ద్వారా ఈ సాంకేతికతలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి.

జన్యుమార్పిడి ఉత్పత్తులు, ముఖ్యంగా వ్యవసాయంలో జన్యు ఇంజినీరింగ్‌ ఉపయోగించి ఉత్పత్తి చేసిన విత్తనాలు 1970లలో కని పించాయి. వీటిని 1990లలో ప్రధానంగా ఉత్తర అమెరికాలో వాణిజ్యీ కరించారు. ఈ సాంకేతికతను ప్రబోధించినవారు వ్యవసాయ ఉత్పాద కతలో ఇది మరొక అపారమైన పెరుగుదలకు దారితీస్తుందనీ, ఆహార సరఫరాలో గుణాత్మక మెరుగుదలను అందజేస్తుందనీ పేర్కొన్నారు. మొదటి రెండు హరిత విప్లవాలకూ, మూడవ దానికీ మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, నిశ్చయాత్మకమైన కుతూహలంతో దీనిని ప్రపంచం స్వీకరించలేదు. మానవులు, జంతువులు, మొక్కల ఆరోగ్యంపై ఈ సాంకేతికతలోని ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి.

అందుకే వీటి ఉత్పత్తులపై యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. అయితే అమెరికా, కెనడా, అర్జెంటీనా, బ్రెజిల్‌ చాలా వరకు వ్యవసాయ బయోటెక్‌ అను వర్తనాలను అనుమతించాయి. భారత్‌తో సహా చాలా ఇతర దేశాలు ఈ విషయంలో సరైన మార్గం కోసం పోరాడుతున్నాయి.యూరోపియన్‌ దేశాలు ఈ సాంకేతికతను మొట్టమొదట గట్టిగా వ్యతిరేకించి, తర్వాత తీవ్రమైన నియంత్రణ విధానాన్ని అనుసరించాయి. చాలా యూరోపియన్‌ ప్రభుత్వాలు, యూరోపియన్‌ యూని యన్‌ కూడా జన్యుమార్పిడి జీవులతో ముడిపడి ఉన్న ప్రమాదాల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడా నికి బదులుగా ముందు జాగ్రత్త విధానాన్ని స్వీకరించాయి.

ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం, ‘అదే’ తరహా ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయాలంటే, బలమైన శాస్త్రీయ సాక్ష్యం అవసరమని అమెరికా వాదిస్తోంది (అదే తరహా ఉత్పత్తిఅంటే నేరుగా పోటీ పడే లేదా ప్రత్యామ్నాయ ఉత్పత్తి). దిగుమతి దారులు లేదా దిగుమతి చేసుకునే దేశాలు తప్పనిసరిగా జీఎం విత్తనం లేదా ఉత్పత్తి మానవ లేదా జంతువు లేదా మొక్కల ఆరోగ్యానికి సుర క్షితం కాదని తిరస్కరించలేని శాస్త్రీయ ఆధారాలను అందించాలి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విత్తనం లేదా ఉత్పత్తి ‘సురక్షి తమైనది’ అని రుజువు చేయాల్సిన బాధ్యత జీఎం విత్తన ఉత్పత్తిదారు లపై లేదా దాని ఎగుమతిదారులపై లేదు; అది ‘సురక్షితం కానిది’ అని నిరూపించాల్సిన బాధ్యత దిగుమతిదారులపై ఉంది. 

మరో మాటలో చెప్పాలంటే, సురక్షితమని నిరూపించడం విక్రేత బాధ్యత కాదు, అది కొనుగోలుదారు బాధ్యత. కాబట్టి, హానికారకం అని రుజువయ్యేంత వరకూ అది సరైనదే అని అన్ని దేశాలూ భావించాల్సి ఉంటుంది. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదించిన స్వేచ్ఛా వాణిజ్య విధానంలో, బలమైన శాస్త్రీయ సాక్ష్యం లేనప్పుడు అమెరికా నుండి జన్యుమార్పిడి దిగుమతులను ఈయూ నియంత్రించలేదు. అయితే అమెరికా దృక్పథంతో విభేదిస్తూ, ఈయూ తన సభ్య దేశాలచే జన్యుమార్పిడి  విత్తనాలు/ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించింది. ఈ పంట రకాల ఆమోదాన్ని తాత్కాలికంగా నిలుపుదల (1998–2004) చేస్తూ దాని చర్యలను ప్రారంభించింది.

ఈ నిలుపుదలను ఆగ్రహించిన అమెరికా, అర్జెంటీనా, కెనడా దేశాలు ఈయూ నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా 2003లో
ప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక దావాను ప్రారంభించాయి. ఈయూ విధానం చట్టవిరుద్ధమైన వాణిజ్య పరిమితులను సృష్టిస్తోందని పేర్కొ న్నాయి. దాంతో డబ్ల్యూటీవో వివాద పరిష్కార ప్యానెల్‌ 2006 సెప్టెంబరులో ఫిర్యాదు చేసిన దేశాలకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా తన ఆమోద ప్రక్రియను తేవాలని యూరోపియన్‌ యూనియన్‌ను కోరింది.డబ్ల్యూటీవో నిర్ణయానికి ముందే యూరోపియన్‌ యూనియన్‌ తన విధాన ప్రక్రియను మార్చుకుంది. అయితే అది ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉంది. 

సభ్య దేశాల శాస్త్రీయ సంస్థలతో సన్నిహిత సంప్రదింపుల ద్వారా నష్టంపై అంచనా వేయడం జరిగింది. ఈ అభిప్రాయాన్ని బహిరంగ సంప్రదింపుల కోసం ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈయూ నిబంధనల ప్రకారం, అనేక రకాల కారణాల ఆధారంగాపంట సాగును నిలిపివేయడానికీ, నిషేధించడానికీ లేదా పరిమితం చేయడానికీ సభ్య దేశాలకు హక్కు ఉంటుంది. పర్యావరణం, వ్యవ సాయ విధాన లక్ష్యాలు, సామాజిక–ఆర్థిక ప్రభావం వంటివి కారణా లుగా చూపొచ్చు. ఫలితంగా, ఐరోపాలో వాణిజ్యీకరణ కోసం చాలా తక్కువ వ్యవసాయ బయోటెక్‌ అప్లికేషన్లను ఆమోదించారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం నుండి స్థిరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈయూ సభ్యదేశాలు, ఇతర యూరప్‌ దేశాలు జన్యుమార్పిడి పంటలను, ముఖ్యంగా ఆహార గొలుసులో భాగమైన వాటిని సులభంగా ఆమోదించడానికి నిరంతరం దూరంగా ఉన్నాయి. ఈయూ, ఇతర దేశాల విముఖత అనేది ప్రభుత్వాలపై డబ్ల్యూటీవో, జన్యుమార్పిడీ టెక్నాలజీ జనరేటర్ల ఒత్తిడిని బలహీనపరిచింది. ఇది భారతదేశం తన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకోవడానికి ఎంతో సాయపడుతుంది.

జన్యుమార్పిడి జీవులపై సముచితమైన, ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యతను సుప్రీంకోర్టు సరిగ్గానేకేంద్రానికి అప్పగించింది. భారతీయ విధాన రూపకర్తలు తప్పనిస రిగా యూరోపియన్‌ అనుభవాన్ని పరిశీలించాలి. ఇంతకుముందు మనం హరిత విప్లవ సాంకేతికతను అంగీకరించాం. దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది; కానీ కొన్ని దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే ఈసారి, జన్యుమార్పిడిసాంకేతికతకు సంబంధించిన సానుకూల, ప్రతికూల ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.

- వ్యాసకర్త నార్తర్న్‌ బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీమాజీ ప్రొఫెసర్‌ (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
- అమర్‌జీత్‌ భుల్లర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement