‘విద్యార్థి సేవా సమితి ట్రస్ట్’ ఆధ్వర్యంలో ‘స్ఫూర్తి ఛాత్రా శక్తి భవనం’ నిర్మితమైంది. ఇది ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేతుల మీదగా రేపు విద్యార్థి లోకానికి అంకితం కాబోతోంది. 1949 జూలై 9న దేశవ్యాప్తంగా ఏబీవీపీ పనిని ప్రారంభిస్తే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1964లో పనిలోకి దిగింది. అప్పట్లో విద్యానగర్‌లో ఏబీవీపీ కార్యాలయం కోసం ఒక అద్దె భవనాన్ని తీసుకున్నారు. ఆ కార్యాలయం అనేక విద్యార్థి ఉద్యమాలకు వేదిక అయ్యింది. తెలంగాణ ఉద్యమంలో ఈ కార్యాలయం కేంద్ర బిందువయ్యింది, అనేక మంది నాయకులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఇక్కడ తయారయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యాలయమూ దీనిలోనే ఉంది.
ఏబీవీపీ ‘సర్వవ్యాప్త– సర్వ స్పర్శి’ అనే నినాదంతో అన్ని విభాగాల విద్యార్థులకు చేరువ కావడంతో సభ్యుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కార్యాలయం విద్యార్థుల అవసరాలను తీర్చలేకపోతున్నందున ఆధునిక కార్యాలయం ఏబీవీపీకి తక్షణ అవసరంగా మారింది. అందుకే కొత్త కార్యాలయం కోసం హైదరాబాద్ తార్నాకలో వేయి గజాల విస్తీర్ణం గల భూమిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ సంగతి తెలిసి వేయిమంది పూర్వ కార్యకర్తలు ఒక్కొక్కరూ ఒక గజాన్ని కొనడానికయ్యే ఖర్చు భరించారు.
2017 ఏప్రిల్‌లో భూమి పూజ జరిగింది. ఈ ఐదేళ్లలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, కరోనా కష్టాలను దాటుకుంటూ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా పదిహేను వేలకు పైగా పూర్వ కార్యకర్తలు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వారి నుండి ప్రేరణ పొంది లక్షలాది మంది విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. స్థానిక, అలాగే ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల ఎదుగుదలకు కావలసిన స్ఫూర్తినీ, సదుపాయాలనూ ఈ కార్యాలయం అందించాలనేది లక్ష్యం!
– చింత ఎల్లస్వామి
ఏబీవీపీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ, తెలంగాణ
(జూన్ 16న ‘స్ఫూర్తి ఛాత్రా శక్తి నిలయం’ ప్రారంభం సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment