ప్రాణదాత, విజయ ప్రదాత జమ్మి వృక్షం | MP Joginapally Santosh Guest Column On Shami Tree | Sakshi
Sakshi News home page

ప్రాణదాత, విజయ ప్రదాత జమ్మి వృక్షం

Published Fri, Oct 15 2021 12:51 AM | Last Updated on Fri, Oct 15 2021 12:56 AM

MP Joginapally Santosh Guest Column On Shami Tree - Sakshi

శమీ శమయతే పాపమ్‌ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!!

తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పుకోవచ్చు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు ఎంతో ప్రాధాన్యం గలది. తెలంగాణలో దసరా పండుగ నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. ఆ రోజు సాయంత్రం పక్షులను చూడటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వెళతారు. ఇదే సందర్భంలో జమ్మి పూజ చేస్తారు. ‘‘శమీ శమయతే పాపమ్‌ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!!’’ అని చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. ఆ తరువాత బంధు మిత్రులకు జమ్మి ఆకులు చేతిలో పెట్టి నమస్కరిస్తుంటారు. కొందరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. ఒకరినొకరు పలుకరించుకోని వారు కూడా దసరానాడు ఈ పచ్చని ఆకులను చేతిలో పెట్టి నమస్కరించుకొని విభేదాలు మరిచి పోతారు. 

జమ్మి తెలంగాణ ప్రజల్లో వెల్లివిరిసే సౌహార్ద్రతకు ప్రతీక. రాముడు లంకపై యుద్ధానికి వెళ్ళే ముందు శమీ వృక్షాన్ని పూజించాడని చెబుతారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి పెడతారు. తమకు విజయం సిద్ధించాలని జమ్మి చెట్టును పూజించే సంప్రదాయం ఉన్నది. పలు రాష్ట్రాలలో జమ్మిని దసరానాడు పూజిస్తుంటారు. జమ్మిని పూజిస్తే శని పీడ విరగడవుతుందనే నమ్మకం కూడా ఉన్నది. నిప్పును పుట్టించడానికి శ్రేష్టమైనది కనుక దీనిని అగ్నిగర్భ అని కూడా అనేవారు. 

జమ్మి చెట్టు భారత ఉపఖండంలో, పశ్చిమాసియాలో పెరుగుతుంది. ఎంతటి కరువు కాలంలో అయినా తట్టుకొని నిలువడం ఈ చెట్టు ప్రత్యేకత. అందువల్ల ఈ చెట్లు ఉంటే కరువు కాలంలో కనీస హామీ ఉన్నట్టుగా భావిస్తారు. దుర్భిక్షంలో నెలకొన్నప్పుడు పశువులకే కాకుండా, మనుషులకూ ఆహారంగా ఉపయోగపడుతుంది. జమ్మి నుంచి వివిధ రకాల ఔషధాలు తయారు చేస్తారు. ఈ చెట్టు నీడన గిరిజన పెద్దలు సమావేశాలు జరుపుకునే అలవాటు కొన్ని ప్రాంతాలలో ఉన్నది. జమ్మి చెట్టు సగటు ఆయుర్దాయం 120 ఏండ్లు. వేర్లు ముప్ఫై మీటర్ల లోతు వరకు పోతాయి. ఏ మాత్రం తేమ లేని ఎడారి ప్రాంతాలలో కూడా ఈ చెట్టు తట్టుకుని నిలుస్తుంది. ఎడారుల్లో పెనుగాలులను నిలువరిస్తుంది. అరేబియా ఎడారిలో ఏ మాత్రం తేమ లేని నేలలో ఇది వేళ్ళూనుకొని పెరగడమే పెద్ద వింత. చుట్టూరా ఒక నీటి చుక్క ఉండదు, ఒక్క గడ్డి పరక కూడా మొలవదు. అయినా ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ చెట్టుకు నీరు ఎలా లభిస్తున్నదనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయం. జమ్మిచెట్టు విశిష్టతకు ఈ జీవ వృక్షమే ప్రత్యక్ష ఉదాహరణ. 

ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి నాంది పలికిన ఘనత జమ్మి చెట్టుకు ఉన్నది. 1730లో మార్వాడ (రాజ స్తాన్‌) రాజు తన రాజభవనం నిర్మాణంలో రాళ్ళ మధ్య బంక వాడటం కోసం చెట్లు కొట్టుకు రమ్మని ఆదేశించారు. ఎడారిలో దట్టంగా ఉన్న జమ్మి చెట్లు ఉన్న ఖేజాడ్లీ గ్రామం దగ్గరికి రాజభటులు వచ్చారు. ఇక్కడి బిష్ణోయి తెగ వారు చెట్లను నరకడాన్ని, జంతువులను చంపడాన్ని వ్యతిరేకిస్తారు. రాజభటులు చెట్లు నరుకుతున్నారని తెలిసిన అమృతాదేవి అనే మహిళ అక్కడకు వెళ్ళి అడ్డుకున్నది. జమ్మి చెట్టును కావలించుకొని ‘సర్‌ సాంటే రుఖ్‌ రహో తో భీ సస్తో జాణ్‌’ (చెట్టును కాపాడటానికి తలనైనా పణంగా పెట్టవచ్చు) అని నినదించింది. రాజభటుల గొడ్డలి దెబ్బకు ఆమె తల తెగిపడింది. ఆమె ముగ్గురు బిడ్డలు ఆసు, రత్ని, భాగుబాయి కూడా చెట్లను అలుముకున్నారు. వారి ముగ్గురి తలలు తెగిపడ్డాయి. 

ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాలలోని బిష్ణోయి తెగవారంతా దండులా కదిలివచ్చారు. జమ్మి చెట్ల రక్షణకు పూనుకున్నారు. వృద్ధులు, మహిళలు, నవ దంపతులు, పిల్లలు అనే తేడా లేకుండా చెట్లను హత్తుకున్నారు. 363 తలలు తెగిపడ్డాయి. కర్కశ రాజభటుల హృదయం చలించింది. వారికి ఇక తలలు నరకడానికి చేతులాడలేదు. వెనుదిరిగిపోయి రాజుకు వివరించారు. వెంటనే రాజు చెట్లను నరకడాన్ని నిలిపివేయించాడు.

పర్యావరణ పరిరక్షణ బిష్ణోయి సంప్రదాయం
జంతువులను, మొక్కలను పరిరక్షించే బిష్ణోయి తెగ గురించి తరచు వార్తలలో చూస్తుంటాం. వైష్ణవ సంప్రదాయానికి చెందిన గురు జంభేశ్వర్‌ (1451– 1536) ఈ బోధనల మేరకు ఈ బిష్ణోయి శాఖ ఏర్పడింది. రాజస్తాన్‌లో 1485లో తీవ్ర కరువు ఏర్పడిన నేపథ్యంలో గురు జంభేశ్వర్‌ పర్యావరణ హితమైన జీవన విధానాన్ని నిర్దేశించారు. అతడు బోధించిన ఈ 29 సూత్రాలలో ఎనిమిది పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు తోడ్పడేవి కూడా ఉన్నాయి. ప్రకృతితో సహజీవనానికి వీలుగా వృక్ష జంతుజాలాన్ని కాపాడాలని ఆయన బోధించారు. బిష్ణోయి తెగవారు జమ్మిచెట్టును పవిత్రమైనదిగా పూజిస్తారు.

చిప్కో అంటే హత్తుకోవడం. చెట్లను హత్తుకోవడమనే ఈ ఉద్యమం 1973లో ఉత్తరాఖండ్‌లో సాగింది. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో మహిళలే ప్రధాన పాత్ర వహించారు. ఈ ఉద్యమం ప్రపంచ పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైంది. ఇప్పటికీ రాజ స్తాన్‌లో జమ్మి చెట్టుకు ప్రాధాన్యం ఉన్నది. జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని కేసీఆర్‌ బోధిస్తున్నారు. ఈ మేరకు ఉద్యమ స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ.. హరిత తెలంగాణగా మారుతోంది. కేసీఆర్‌ పిలుపునందుకుని పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వాములం అవుదాం. మొక్కలను నాటుదాం. మన పిల్లలకు నివాసయోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అందిద్దాం.


జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ 
వ్యాసకర్త ఎంపీ, రాజ్యసభ
(దసరా పండుగ సందర్భంగా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement