
పుత్లీభాయి కరంచంద్ గాంధీలకు 1869 అక్టోబర్ 2న జన్మించిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడై మనదేశానికి ఖ్యాతి తెచ్చినవారిలో అగ్రగణ్యుడుగా నిలిచాడు. మానవాళికి ఎన్నో క్రొత్త మార్గాలతో తనదైన సరళిలో వెలుగు చూపిన ఆ మహా త్ముని జీవితం నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో వున్నాయి. వారు ప్రవేశపెట్టిన సంఘసంస్కరణల గురించి పరిశీలిద్దాం. రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారు మనపై అధికారం చెలాయించడానికి రెండు కారణాలు ప్రధానమైనవిగా గమనించారు గాంధీజీ. వారి ఆధునిక సాంకేతిక ఆయుధబలం మొదటి కారణమైతే భారతీయులలో నాడు లోపించిన ఐకమత్యం రెండోది. బ్రిటిష్ వారి ఆయుధబలానికి ప్రతిగా మన సంఖ్యాబలాన్ని ఒడ్డడానికి అనుకూలమైన అహింసామార్గాన్ని అవలంబించారు.
ఇటీవలకాలంలో దేశవిదేశాలలోని పెక్కు విశ్వవిద్యాలయాలు అహింసామార్గాన్ని పరిశోధించి అవిష్కరించిన రెండు సత్యాలు– (1) సామాన్యమానవునికి సాయుధపోరాటంలో కన్నా అహింసామార్గంతోకూడిన పోరాటంలో పాల్గొనడానికి పదకొండు రెట్లు అవకాశముంటుంది. (2) గత శతాబ్ద కాలంలో జరిపిన సాయుధపోరాటాలు 27% విజయం సాధించగా అహింసామార్గంతోకూడిన పోరాటాలు 51% విజయం సాధించినవి. మనలో ఐకమత్య లేమికి ప్రధాన కారణాలు కులమత భేదాలన్న విషయం గమనించిన బాపూజీ వాటిని రూపుమాపడానికి ఎన్నో సంఘసంస్కరణలు ప్రవేశపెట్టారు.
తండ్రి పోర్బందర్ సంస్థానంలో దీవాన్ కావడంతో వారిం టికి అన్యమతస్తుల బడుగువర్గాలవారి రాకపోకలు మెండుగా వుండేవి. దాంతో గాంధీజీకి సహజంగానే విశాల దృక్పథం వుండేది. మార్గాలు వేరైనా అన్నిమతాల గమ్యం ఒకటేనన్నారు. అనామధేయుడైన భగవంతునికి సహస్రనామాలన్న సత్యాన్ని నొక్కి వక్కాణించారు. ఎవరేపేరుతో పిలిచినా పలికే భగవంతుడొక్కడేనన్నారు. గాంధీజీ ప్రవేశపెట్టిన సంఘసంస్కరణలన్నిటికీ మూలం తాను నమ్మిన ఈ అద్వైతంలో దొరుకుతుంది. స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ మొదటి అధ్యాయం చంపారణ్ రైతుసమస్య పరిష్కారం. ఆనాటి జమీందారి వ్యవస్థ బ్రిటిష్ వారి పరిపాలనలో ప్రథమాంకం. శిస్తువసూలులో వారిది ప్రముఖపాత్ర. నూటికి తొంభైఐదుమంది రైతులు జమిందారులవద్ద పొలం కౌలుకి తీసుకొనేవారు.
కౌలుకి తీసుకొన్న పొలంలో కొంతభాగం నాటి ప్రముఖ వాణిజ్య పంట అయిన ఇండిగోను పండించి మొత్తం ఇండిగో పంటని జమీందారుకివ్వాలన్నది నియమం. గత్యంతరంలేని రైతులు ఆ నియమాన్ని ఏనాడూ ఉల్లంఘించలేదు. అద్దకంలో ఇండిగో ప్రముఖపాత్ర వహించినంతకాలం జమీందారులు తృప్తిగావున్నారు. జర్మనీవారు ఇండిగోకి ప్రత్యామ్నాయంగా కృత్రిమ డై కనిపెట్టడంతో ఇండిగో ధరలు గణనీయంగా పడిపోయాయి. దానితో రైతులపై జమీందారుల దౌర్జన్యం మితిమీరింది. ఇండిగోతోపాటూ రైతుల పంటధాన్యాలను కూడా చెల్లించుకోవల్సివచ్చింది.
గాంధీజీ రైతులను, జమీందారులను విస్తృతంగా కలిసి పరిష్కారాన్వేషణలో నిమగ్నమైనారు. దక్షిణాఫ్రికాలో సాధించిన విజయాలు తెలుసుకొన్న కలెక్టరు ఆ ప్రాంతం నుంచి తక్షణమే గాంధీని వెళ్లిపోవాలని ఆదేశించారు. గాంధీజీ సహజంగానే ఆ ఆదేశాన్ని ఉల్లంఘించారు. అంతే సహజంగా గాంధీజీని బోనెక్కించారు కలెక్టరు. సమస్యా పరిష్కారం నేరమైతే నిస్సందేహంగా నేరస్తుడనని ఒప్పుకొంటానన్నారు గాంధీజీ. చట్టప్రకారం శిక్షార్హుడనని అందుకు తను సిద్ధంగా వున్నానని చెప్పారు. విషయం తెలిసిన గవర్నర్ హుటాహుటిన కలెక్టరు చేత కేసు విరమణ చేయించారు.
పత్రికలద్వారా విపులంగా తెలుసుకొన్న ప్రజానీకానికి అసలుసిసలు శాసనోల్లంఘన అంటే ఏమిటో తెలి సింది. గాంధీగారు నాటినుంచి బాపూజీ ఐనారు. చంపారణ్‌లో రైతులపై జమిందారుల దోపిడీని కట్టడంచేయడంతో గాంధీజీ సరిపెట్టుకోలేదు. పొట్టకోస్తే అక్షరం ముక్క రాని రైతులు దోపిడీకి గురికావడంలో ఆశ్చర్యంలేదని గమనించిన గాంధీజీ పాఠశాలల్ని ఏర్పరచారు. స్త్రీపురుషుల అసమానతలను అంటరానితనాన్ని ఖండించారు. పరిసర పరిశుభ్రతను ప్రోత్సహించారు. సంఘసంస్కరణ బాధ్యతను కూడా చంపారణ్‌లోనే తన భుజాలపై వేసుకొన్నారు. స్వాతంత్య్ర సమరానికి తిరుగులేని నాయకుడైనాడు.
అలనాడు బడుగువర్గాలకు ఆలయప్రవేశంలేదు వారిని మతం మార్పించడంలో మిషనరీలు అంతగా కృతకృత్యులవడానికి ముఖ్యకారణమిదే కావచ్చు. నలుగురు మంచినీళ్ళు తెచ్చుకొనే బావి దగ్గరకొచ్చే ఆస్కారం లేదు. వారి పిల్లలు పాఠశాలకెళ్లే అవకాశాలు తక్కువ. ఒకవేళ వెళ్లగలిగినా అక్కడ వారెదుర్కొనే అవమానాలు అన్నీఇన్నీకావు. అందుకు బీఆర్ అంబేడ్కర్ పడ్డ అగచాట్లే తార్కాణం. పైగా వారికి చతుర్వర్ణాలలో తావివ్వక పంచములన్నారు. అంటరానివారని ఊరివెలుపల బ్రతకమన్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు గురై అవమానాలకు గురైన గాంధీజీ అంటరానితనం అమానుషం అని ఎలుగెత్తిచాటడంలో ఆశ్చర్యమేముంది? నేటికి స్వాతంత్య్రభారతం సాధించిన ఘనవిజయాలలో అతిముఖ్యమైనది అంటరానితనాన్ని దాదాపుగా రూపుమాపడమని చెప్పవచ్చు. వారికి నేడున్న విద్యావుద్యోగావకాశాలు బ్రిటిష్ పాలనలో కలలోకూడా ఊహించుకోలేము.
అలనాడు స్త్రీల పరిస్థితి కూడా దారుణంగా వుండేది. వారికి చదువుకొనే అవకాశాలు బహుతక్కువ. ఇంతెందుకు కస్తూరి గాంధీనే పెద్దగా చదువుకోలేదంటే సామాన్య వనితల విషయం చెప్పపనిలేదు. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో వుంటుందని గాంధీజీ చెప్పేవారు. వేదకాలంలో స్త్రీలు విద్యావంతులుగా ఉండేవారని చెప్పటానికి వేదోత్తములైన గార్గివాచక్నవి సులభ మైత్రేయి గురించి ఉదహరించేవారు. జనక మహారాజు రాజసూయ యాగసమయంలో జరిగిన చర్చలో యాజ్ఞవల్క్యుడు గార్గివాచక్నవి పోటీపడ్డ కథను బృహదారణ్యకోపనిషత్‌లో ప్రస్తావించిన విషయం గుర్తుచేసేవారు. శారీరకంగా పురుషులది పైచేయి అయినా మానసికంగా స్త్రీలది పైచేయి అన్న నిజం గాంధీ ఆనాడే గ్రహించారు. స్వాతంత్య్రపోరాటంలో సైతం వారిని ప్రోత్సహించారు. అరుణా అసఫ్ ఆలీ సరోజినీ నాయుడు వంటి వారికి నాయకత్వపు అవకాశాలు కల్పించారు.
కులమతభేదం వలదని నినాదాలివ్వడమే కాకుండా ఆచరణలో కూడా చూపించారు. ప్రేమవివాహాలపై కూడా గాంధీగారిది విశాలదృక్పథమే. కులాలు వేరైనా రాజాజీ కుమార్తెతో తన తనయుడికి వివాహం జరిపించారు. మతాలు వేరైనా ఇందిరానెహ్రూకి ఫిరోజ్ గాంధీతో దగ్గరుండి వివాహం జరిపించారు. గాంధీజీకే కాదు ఆయన శిష్యులకి కూడా కులమత భేదాలు లేవు. హిందూ కుటుంబంలో పుట్టిన అరుణా గంగూలీ ఒక ముస్లింని ప్రేమించి పెండ్లి చేసుకొని అరుణా అసఫాలీ అయినారు. అగ్రవర్ణాలకి చెందిన సరోజినీ రైతు కుటుంబానికి చెందిన వారిని పెండ్లాడారు.
గాంధీజీ వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించారు. ప్రముఖ గాంధేయవాది కమలాదేవి ఛటోపాధ్యాయ గారి ద్వితీయ వివాహం ఇందుకు నిదర్శనం. స్త్రీల అభ్యున్నతికి ఎంతో కృషిచేసిన గాంధీగారి గురించి రాజ కుమారి అమృత కౌర్ చెప్పిన నాలుగు మాటలతో ఈ వ్యాసాన్ని ముగిద్దాం. ‘గాంధీగారిలో మేము జ్ఞానసంపన్నులైన తండ్రినేకాదు అమృతతుల్యమైన తల్లినికూడా చూశాము. మా కష్టసుఖాలను ఆయనతో అరమరికలు లేకుండా పంచుకొనేవారిమి. అహింసామార్గం పుణ్యమా అని స్వాతంత్య్ర పోరాటంలో స్త్రీలు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం దొరికింది’.
(నేడు గాంధీజీ 151వ జయంతి సందర్భంగా)
ఎంఆర్‌కే కృష్ణారావు, రిటైర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్, బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
Comments
Please login to add a commentAdd a comment