భారతదేశంలో కోటానుకోట్ల ప్రజల మనసులను వశం చేసుకున్న మహనీయుడు గాంధీ. అవధిలేని హింసాద్వేషాలకు, అణ్వస్త్రాలకు నెలవైన ప్రపంచంలో వాటికి భిన్నంగా శాంతి సౌహార్ద్రాలను వెలయిస్తూ మహోన్నతంగా నిలిచాడాయన. గాంధీజీ జీవితాన్ని, భావాలను, కృషిని, సాధించిన విజయాలను తలచుకుంటే ఆయన మానవజాతి భవితవ్యాన్ని కమ్ముకున్న కారుమబ్బుల మధ్య మెరసిన కాంతికిరణం వంటి వాడనిపిస్తుంది. పేదలకు సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకుని, దారిద్య్రం, దైన్యం, రోగాలు, అజ్ఞానం ప్రబలి ఉన్న సమాజంలో తోటి మానవుల స్థితిగతులను బాగు చెయ్యడానికి విశ్రాంతి లేకుండా, నిస్పృహ చెందకుండా, ఓటమిని అంగీకరించకుండా గాంధీజీ బద్ధకంకణుడై కృషి చేశాడు. వస్తువ్యామోహం తగదన్నాడు. ఆడంబరాలు వద్దన్నాడు. కేవలం చెప్పడానికే పరిమితం కాలేదు. ఆచరించి చూపాడు. గాంధీజీ కృషి భారతదేశానికి మాత్రమే పరిమితమైనట్టు కనిపిస్తుంది. కానీ, ఆయన ఊహలూ, మాటలూ, చేతలూ వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ మానవులందరికీ సమానంగా వర్తిస్తాయి. ఆయన బోధ విశ్వజనీనమైంది. విలువలకు ప్రాణమిచ్చిన నీతిమంతుడాయన.అసత్యానికి సత్యంతో పొత్తు కుదరదు. ద్వేషం ప్రేమలో చేరలేదు.
చెడుగు మంచితో సఖ్యం చేయలేదు. అహింసకు ఏ విధంగానూ హింసతో జత కుదరదు. కనుకనే అహింసాయుతమైన ప్రేమమార్గంలో పయనిస్తూ, సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలనుకున్నారు గాంధీజీ. సాధారణ ప్రజలతో అసాధారణ ఉద్యమాలు నడిపాడు. పదవులకన్నా ప్రజల్నే మిన్నగా ప్రేమించాడు. స్వాతంత్య్రానికి పూర్వమే సంపూర్ణ మద్యనిషేధాన్ని కోరుతూ తెల్లదొరల మీద ఒత్తిడి తెచ్చాడు. స్వతంత్రభారతానికి పల్లెసీమలే పునాదులు కావాలన్నాడు. గాంధీజీ డెబ్భై అయిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని 1944లో ఆయనను అభినందిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ‘ఎట్టి ప్రభుత్వాధికారమూ లేకుండానే తన ప్రజలకు అధినేత అయిన గాంధీజీ, యూరప్ ఖండపు పశుత్వాన్ని సరళ మానవ సహజమైన గాంభీర్యంతో ఎదిరించి, సనాతన ఔన్నత్యాన్ని నిలబెట్టుకున్నారు’ అని ప్రశంసించాడు. శాస్త్రీయ దృక్పథం కలిగి చారిత్రక తత్వాన్ని అర్థం చేసుకున్న జవహర్‌లాల్ నెహ్రూ, భవిష్యత్తులో మానవాళిపై గాంధీజీ ప్రభావాన్ని గురించి ఉద్ఘాటిస్తూ- ‘మనదేశం ప్రకాశించిన వెలుగు సామాన్యమైన వెలుగు కాదు. వెయ్యేళ్లు గడిచిన తర్వాత కూడా ఈ దేశంలో ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. ప్రపంచానికది కనిపిస్తూనే ఉంటుంది. చిరంతన సత్యాన్ని బోధించిన వెలుగది’ అన్నాడు.
గాంధీజీలో గోచరించే అనిర్వచనీయమైన మానవతాపూర్ణమైన లక్షణాలను చూసి, అశేష జనంపై ఆయనకు గల ప్రభావానికి విస్మయం చెంది, కొందరు గాంధీజీ అవతార పురుషుడని విశ్వసించారు. స్వాతంత్య్రప్రియులు అసాధారణ దేశభక్తుడని కొనియాడారు. సంఘసేవా పరాయణులు, సాటిలేని సంఘ సంస్కర్త అని కీర్తించారు. బహుముఖమైన గాంధీజీ భావాలను గ్రహించలేక తికమకపడ్డ జాన్ గంధర్ వంటి కొంతమంది వ్యక్తులు, ఆయనలో క్రీస్తు, చాణుక్యుడు, కృష్ణభగవానుడు విడదీయలేని విధంగా కలిసిపోయారని అభివర్ణించారు. ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నా, ఏ రోజూ దైవప్రార్థన మానలేదాయన. ‘ప్రార్థన అంటే కోరికలు కోరడం కాదు. అది భగవంతునిపై ఆత్మకు ఉండే గాఢమైన అనురక్తి. మన బలహీనతలను ప్రతిరోజూ అంగీకరించడం. ప్రార్థనకు హృదయం లేని పదాలకంటే పదాలు లేని హృదయం ముఖ్యం అని చెప్పే గాంధీజీ దైవమే సర్వ సంకల్పాలకు ఆధారమని ప్రగాఢంగా నమ్మారు. తన సమస్తమూ దైవానివేనని భావించి, ఆ భావం మీదనే మనస్సును కేంద్రీకరించి, క్రమంగా దైవానికీ, మానవరూపంలో కనిపించే మాధవునికీ సేవచేయడానికే తన జీవితాన్ని అంకితం చేసిన దివ్యశక్తిమయుడు గాంధీజీ. నేడు భారతీయులందరూ ఆయన అడుగుజాడలనుసరించి పయనించడం par తప్పనిసరి.ఙ- చోడిశెట్టి శ్రీనివాసరావు
గాంధీ - రామభక్తుడు
తన పినతండ్రి కొడుకు ప్రేరణతో బాల్యం నుంచి రామరక్షాస్తోత్ర పారాయణం చేసేవారు గాంధీజీ బాల్యంలో వారి కుటుంబ ఆచారం ప్రకారం ప్రతి ఏకాదశి నాడూ భాగవత గాథలు వినేవారు రామకథ వినడం, హరిశ్చంద్ర నాటకం చూడటం వల్ల రాముడు, హరిశ్చంద్రుడు లాగ జీవితమంతా సత్యవ్రతాన్ని ఆచరించారు గాంధీ చిన్నప్పుడు గాంధీజీకి చీకటిలోకి వెళ్లాలన్నా, భూతప్రేతాలన్నా భయం ఉండేది. ఆ భయం పోగొట్టుకోవడానికి రామనామం జపించడమే మార్గం అని వారి కుటుంబ దాసి చెప్పిన మాటలు ఆయన మనసులో బలంగా ముద్రించుకుపోయాయి. గాడ్సే తూటా దెబ్బకు నేలపై ఒరిగిపోయే సమయంలో కూడా ఆయన ‘రామ నామ స్మరణ మరువలేదు. తన మనస్సును ఎప్పుడైనా నిరాశనిస్పృహలు ఆవరించినప్పుడు గీతా పారాయణం చేసేవాడినని, ఫలితంగా ఎంతో మనశ్శాంతి లభించేదని గాంధీజీ చెప్పేవారు.