ఈ ఎత్తుగడ కోటా ఎత్తివేతకేనా? | R Krishnaiah Article On Reservations | Sakshi
Sakshi News home page

ఈ ఎత్తుగడ కోటా ఎత్తివేతకేనా?

Published Fri, Dec 11 2020 1:01 AM | Last Updated on Fri, Dec 11 2020 4:47 AM

R Krishnaiah Article On Reservations - Sakshi

కేంద్ర ప్రభుత్వం తన పరిధి తగ్గించుకుంటూ క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అవి బడా కార్పొరేట్ల అధీనంలోకి వెళ్లిపోతాయి. అలా జరిగితే వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. అంటే చట్టబద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇది. దీని మూలంగా వందల సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న కులాలకు అధికారంలో వాటా దక్కకుండా అన్యాయం చేయడమే అవుతుంది. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే రాజ్యాంగ లక్ష్యాలను ఇది విస్మరించడమే. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగని పని.

కేంద్ర ప్రభుత్వం దశలవారీగా రైల్వే, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, బీహెచ్‌ఈఎల్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బడా కార్పొరేట్‌ దిగ్గజాల అధీనంలోకి వెళ్లిపోతాయి. ప్రభుత్వ రంగ సంస్థల వాటా 51 శాతం అమ్మిన, యాజమాన్య హక్కులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పిన వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. దీని మూలంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన రిజర్వేషన్లకు తిలోదకాలు ఇచ్చినట్లు అవుతుంది. చట్ట బద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేయడం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో రెండు కోణాలున్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా తన పరిధిని తగ్గించుకొని బలహీన పరుచుకోవడం. తద్వారా ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. రెండవది, సామాజిక న్యాయా నికి గండికొట్టడం. దీని మూలంగా వందల సంవత్సరాలుగా వివక్ష, అణచివేతల వల్ల అధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు అధికారంలో ఇప్పటికీ వాటా దక్కకుండా అన్యాయం చేయడం. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే లక్ష్యా లను ఇది విస్మరించడమే. చట్ట ప్రకారం రిజర్వేష న్లను రద్దు చేయ కుండా, దొడ్డి దారిన ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 245 సంస్థలు ఉన్నాయి. ఇందులో దాదాపు 26 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రైల్వేలో 13 లక్షలు, ఎల్‌ఐసీలో 2 లక్షలు, బీఎస్‌ఎన్‌ఎల్‌లో  3 లక్షలు, బీహెచ్‌ఈఎల్‌లో లక్షా 90 వేలు– ఇలా మొత్తం 26 లక్షల ఉద్యోగాలు పోతాయి. 51 శాతం వాటాలను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మితే ప్రభుత్వం యాజమాన్య హక్కును కోల్పోతుంది. దీనితో ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నియంత్రణ ఉండదు. రిజర్వేషన్ల అమలు ఉండదు. ఇది ఇలా ఉండగా మరోవైపు జాతీయ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టారు. దీనితో బ్యాంకింగ్‌ రంగంలో కూడా ఉద్యో గాల సంఖ్య తగ్గి రిజర్వేషన్ల కోటా తగ్గిపోతుంది.

ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌ చాలాకాలంగా బలంగా ముందుకు వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను పక్కన పెట్టి, ఉన్న రిజర్వేషన్లకే గండికొట్టే కుట్రకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రంగాల్లో– విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, న్యాయ రంగాల్లో జనాభా ప్రకారం కోటా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కోటా కల్పించారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో, రాజ్యసభ, కౌన్సిల్, నామినేటెడ్‌ పోస్టుల్లో మాత్రం కోటా కల్పిం చలేదు. ఇక బీసీలకు స్వాతంత్య్రం వచ్చిన 36 ఏళ్ల తర్వాత మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ  తర్వాత కేంద్ర విద్యా సంస్థలలో 27 శాతం రిజర్వే షన్లు పాక్షికంగా ప్రవేశ పెట్టారు. జాతీయ స్థాయిలో బీసీల జనాభా 56 శాతం ఉంటే 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టడం లేదు. అనేక సాకులు చూపుతూ దాటవేస్తున్నారు. కానీ రాజ్యాంగంలో లేని అగ్ర కులాల్లోని పేదలకు మాత్రం ఆగమేఘాల మీద రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే ఆటోమేటిగ్గా రిజ ర్వేషన్లు పోతాయి. దీనివల్ల 17 నుంచి 20 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యోగాలు కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 14 లక్షల ఉద్యోగాలను కొన్నేళ్లుగా భర్తీ చేయకుండా పెండింగులో పెట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యో గాల్లో 1993 నుంచి మండల్‌ కమిషన్‌ ప్రకారం రిజర్వేషన్ల కోటా ప్రారంభించిన తర్వాత ఉద్యోగాల భర్తీ ఆపేశారు. దీంతో రిజర్వేషన్లు ఉన్నా ఆయా వర్గాలకు ఉపయోగం లేకుండా పోయింది. మండల కమిషన్‌ అమలు తర్వాత ఈ 37 సంవత్సరాల కాలంలో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగాల్లో 2016 నాటికి ఓబీసీ ఉద్యోగులు 14 శాతం దాటలేదు. ప్రత్యేకంగా క్లాస్‌–1 ఉద్యోగుల్లో ఓబీసీలు 9 శాతం దాటలేదు. సివిల్‌ సర్వీసులో పూర్తిస్థాయి ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఐఏఎస్‌లో 1657 ఖాళీలు, ఐపీఎస్‌లో 1420 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది.

ఇన్ని ఖాళీలున్నా నాణ్యత తగ్గుతుందనే సాకుతో ఏటా ఐఏఎస్‌లో 100 లోపు, ఐపీఎస్‌లో 120 లోపు ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తున్నారు. రక్షణ, బ్యాంకింగ్‌ రంగాల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. దీని మూలంగా రిజర్వేషన్‌ కోటా భర్తీ కాక ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నా మొత్తం ఉద్యోగాల్లో ఇప్పటి వరకూ 12 శాతం దాటలేదు. ఎస్టీలకు 7.5 శాతం అమలు చేస్తున్నా జాతీయ స్థాయిలో 5 శాతం దాటడం లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కేంద్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 56 లక్షలు కాగా ఇందులో 26 లక్షల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు పోతే, మిగిలేది 30 లక్షల ఉద్యో గాలు మాత్రమే. పెరుగుతున్న జనాభా, బడ్జెట్, సంక్షేమ అభివృద్ధి పథకాలకు తగ్గట్లుగా ఉద్యోగాల సంఖ్య పెరగాలి. ప్రభుత్వరంగ వ్యవ స్థను విస్తరించడం, బలోపేతం చేయడం ప్రజాస్వామ్య లక్షణం. కుదిం చడం, ప్రైవేటీకరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగదు. ఒకవైపు అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుండగా మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ’ సామెతను గుర్తుతెస్తోంది.

ఆర్థికమాంద్యంతో దెబ్బతిన్నందువల్లే ఆర్థిక వనరులు పెంచు కోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు విక్రయిస్తున్నామనే కేంద్ర ప్రభుత్వ వాదన సరికాదు. బడ్జెట్‌ పెంచుకోవడానికి అనేక మార్గాలు న్నాయి. నగదు ముద్రించడం, డిపాజిట్లు సేకరించడం, విదేశీ రుణాలు తేవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. ఎన్నికలకు ముందు బీజేపీ దేశ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెస్తామని ప్రకటించింది. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు దేశంలో ఉన్న నల«్లధనాన్ని వెలికితీయడానికి అవరోధాలు ఏమిటి? నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. 50 శాతం కేంద్రానికీ, మిగతాది ఆయా వర్గాలకూ ప్రోత్సాహకాల కింద క్రమబద్ధీకరణ చేసుకొమ్మని పిలుపునిస్తే దేశంలోని పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టు రంగాల నుంచి 60 లక్షల కోట్ల నల్ల ధనం ప్రభుత్వ ఖాతాలో చేరుతుంది. దీనిపై ఎందుకు  చర్యలు తీసుకోవడంలేదు. ఇలాంటి పథకాలు పెట్టడానికి అవరోధాలు ఏమిటి? ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకోవడం కంటే ప్రభుత్వరంగ ఆస్తులను చౌకగా కార్పొరేటు వర్గాలకు ధారాదత్తం చేయడమే లక్ష్యంగా కనబడుతోంది.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికార చట్రంలోకి వస్తున్న సమయంలోనే ఈ సంస్థలను ప్రైవేటీకరించడం, పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవడం జరుగుతోంది. 2014లో తాము అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. కోటి ఉద్యోగాలు దేవుడెరుగు! ఖాళీ ఉద్యోగాల భర్తీయే లేదు. ప్రభుత్వరంగ సంస్థలను కొనసాగించడం, కొత్తవి ప్రారంభించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. అలా చేయకుండా రైల్వేను కూడా ప్రైవేటీకరిం చడం విచిత్రమైన విషయం. రైల్వేకు లక్షల కోట్ల భూములు, భవ నాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటిని చౌక ధరలకు కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పడం న్యాయమా? ఏటా వేల కోట్ల లాభాలు ఆర్జించే సంస్థ, ఏటా కోట్లమంది పేద ప్రజలకు తక్కువ చార్జీలకు సేవలందిస్తున్న సంస్థను ప్రైవేటీకరించడంలో హేతుబద్ధత ఉందా? 40 కోట్ల మంది పాలసీదారులకు అండగా నిలిచే ఎల్‌ఐసీని ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఉందా?  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్ల అప్పులు ఆపత్కాలంలో ఇచ్చి ఆదుకున్న సంస్థ అది. లాభాల్లో నడిచేవాటిని ప్రైవేటీకరణ చేయడంలో ఉన్న రహస్య మేమిటో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు మరిన్ని సేవలు అందించే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడం న్యాయమా? అధికారంతో ఏది చేసినా చెల్లు తుందని అనుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.

వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
ఆర్‌. కృష్ణయ్య

మొబైల్‌: 90000 09164

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement