పశ్చిమాసియా ప్రభావం పడనుందా? | Sakshi Guest Column On War Between Israel And Hamas Impact On The Global Economy In Telugu - Sakshi
Sakshi News home page

Israel War Impact On Global Economy: పశ్చిమాసియా ప్రభావం పడనుందా?

Published Sat, Oct 14 2023 12:31 AM | Last Updated on Sat, Oct 14 2023 10:36 AM

Sakshi Guast Column War Between Israel and Hamas Impact On The Global Economy

ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య మొదలైన యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఉండనుంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉండగా, ఈ పరిస్థితులను ఈ సంక్షోభం మరింత దిగజార్చనుంది. రానున్న రోజుల్లో ఈ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ముడిచమురు ధరలు పైకి ఎగబాకడం మొదలైంది. సంక్షోభం తొందరగా ముగియకపోతే సప్లై చెయిన్  మేనేజ్‌మెంట్‌ అంశాలపై ప్రభావం తప్పదు. భారత్‌ విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లు బాహ్య ఘటనల ఒత్తిడిని తట్టుకుని నిలిచాయని ప్రపంచబ్యాంకు లాంటివి ప్రశంసించాయి. కానీ, ఈ ధోరణి ఎంత కాలం కొనసాగుతుందనేది వేచి చూడాల్సిన అంశం.

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా అమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితి కొంచెం సర్దుకున్న నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ మధ్యే వరుస వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌ వేసింది. ఈ పరిణామాల ప్రభావానికి భారత్‌ అతీతంగా ఉండే అవకాశం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ గత వారమే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడాన్ని ప్రస్తావిస్తూ భౌగోళిక, రాజకీయ పరమైన ఉద్రిక్తతలు దేశీయ అంచనాలను తల్లకిందులు చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దహనకాండ ఈ ఏడాదిఅంచనాలను, వృద్ధిపై ఉన్న సానుకూల దృక్పథాన్ని కచ్చితంగా దెబ్బ తీయనుంది. అంతేకాదు... రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పెద్దగా సోకని దేశంగా భారత్‌కు ఉన్న మంచిపేరు కూడా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. 

రెండవ అంతర్జాతీయ స్థాయి ఘర్షణ...
2023–24 సంవత్సరానికిగాను రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌... భారత్‌పై ఎక్కువ అంచనాలే పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ప్రపంచానికి గ్రోత్‌ ఇంజిన్ గా భారత్‌ను అభివర్ణించారు ఆయన. అంతర్జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకున్నా, ఈ ఏడాది జీడీపీ వృద్ధి 6.5 శాతం ఉంటుందని పునరుద్ఘాటించారు. కానీ, అతితక్కువ కాలంలో ప్రపంచం రెండో యుద్ధాన్ని చూస్తోంది. ఈ ఘటన పర్యవసానాలు కచ్చితంగా ఎదుర్కోక తప్పదు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే ఉన్న పలు లోపాలు పరిస్థితిని అధ్వాన్నం చేయనున్నాయి. ఈ క్రమంలో మొదటగా మర్చండైజ్‌ (వస్తువులు) ఎగుమతులు తగ్గిపోనున్నాయి. తొమ్మిది నెలలుగా ఇవి దిగజారిపోతున్న విషయం ఇక్కడ  చెప్పుకోవాల్సిన విషయం.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్‌–ఆగస్టు) మర్చండైజ్‌ ఎగుమతుల విలువ 172.95 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలానికి ఎగుమతుల విలువ 196.33 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. యూరప్, యూఎస్‌లలో మాంద్యపు ధోరణలు కనిపిస్తున్నాయనేందుకు మర్చండైజ్‌ ఎగుమతులు తగ్గిపోవడం ఒక నిదర్శనం. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, వడ్డీ రేట్లు వేగంగా పెరగడం కూడా ఎగుమతుల మందగమనానికి కారణాలుగా చెబుతున్నారు. 

మర్చండైజ్‌ ఎగుమతుల్లో జరిగిన నష్టాన్ని సేవల రంగం ఎగుమతులు కొంత వరకూ భర్తీ చేసిప్పటికీ ఇప్పుడు ఇవి కూడా తగ్గి పోతున్నాయి. గత ఏడాది 26.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్న సర్వీసెస్‌ ఎగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 26.3 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. అమెరికా తదితర దేశాల్లోని అధిక వడ్డీల కారణంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం దీనికి కారణమని ఒక అంచనా. కానీ, తాజాగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య మొదలైన ఘర్షణ పరి స్థితిని మరింత దిగజార్చడం ఖాయం.

భారత ఆర్థిక వ్యవస్థ మరో బలహీనత...
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మరో బలహీనత ముడిచమురు. దేశీయ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే పూరించుకుంటున్నాం. గత ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్లు అతలా కుతలమయ్యాయి. ముందుగా బాగా పైకి ఎగబాకిన ధరలు కొన్ని నెలల తరువాత స్థిమితపడ్డాయి. ఈ ఏడాది మొదట్లో తగ్గుముఖం పట్టే ధోరణి మొదలై జూన్  నెలలో బ్యారెల్‌కు 75 – 80 డాలర్ల స్థాయికి చేరింది. మన ఖజానా తట్టుకోగల స్థాయి ఇది. అయితే సౌదీ అరే బియా, రష్యా దేశాలు జూలైలో ముడిచమురు కార్టెల్‌ ‘ఓపెక్‌+’ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ)ను ఉత్పత్తిని మరింత తగ్గించాలని ఒత్తిడి చేశాయి. సెప్టెంబరు వరకూ ఈ కోత కొనసాగడంతో చమురు ధరలు పెరగడం మొదలైంది. గత వారం కొంచెం తగ్గినా పశ్చిమాసియా సంక్షోభం పుణ్యమా అని మళ్లీ ఇప్పుడు ఎక్కువ కావడం మొదలైంది. 

జాగరూకత అవసరం...
ఒకవైపు ముడి చమురు ఎగుమతుల బిల్లులు పెరిగి పోతూండటం, ఇంకోవైపు ఎగుమతులు మందగిస్తున్న నేపథ్యంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ అకౌంట్‌ లోటు 2022–23లో జీడీపీలో 2.1 శాతం వరకూ ఎగబాకినా... ఈ ఆర్థికసంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌ –జూన్) 1.1 శాతానికి పరి మితం కావడం కొంత ఊరటనిచ్చే అంశం. కానీ ముడిచమురు ధరలు నియంత్రణలో లేకపోయినా, ఎగుమతులు పుంజుకోకపోయినా లోటు మళ్లీ పెరగడం ఖాయం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఎక్కువయ్యేందుకు ఉన్న మరో అవరోధం ద్రవ్యోల్బణం. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య యుద్ధం తొందరగా ముగియకపోతే సప్లై చెయిన్  మేనేజ్‌మెంట్‌ అంశాలపై ప్రభావం తప్పదు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది ఈ అంశాలు పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.

ఎల్పీజీ గ్యాస్‌ ధరలు తగ్గడం, కాయగూరల ధరలు కూడా సర్దుకుంటున్న నేపథ్యంలో సమీప కాలంలో ద్రవ్యోల్బణం కొంచెం నియంత్రణలోకి వస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చాలా ధీమాగా ఉంది. కానీ భవిష్యత్తు అంచనాల విషయానికి వస్తే మాత్రం పప్పుదినుసులు, కాయగూరలు, మసాలాలపై ఆర్‌బీఐ తన దృష్టిని కేంద్రీకరించింది. ఇదే సమయంలో ఎల్‌నినో పరిస్థితులపై ఆర్‌బీఐ కొంత ఆతురతను వ్యక్తం చేస్తోంది. అయితే, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు ద్రవ్యోల్బణం విషయంలో ఊహించినదాని కన్నా ఎక్కువ ఒత్తిడి చూపే అవకాశం ఉంది.

ఎల్లప్పుడూ అంతర్జాతీయ సంక్షోభాలకు సున్నితంగా ఉండే దేశీయ స్టాక్‌ మార్కెట్ల మీద పశ్చిమాసియా ఘర్షణ తక్షణ ప్రభావం చూపింది. కాకపోతే వర్షాకాలం నిలకడగా లేకపోయినా, అంతర్గత డిమాండ్లు పెరిగితే ఈ మార్కెట్లు కోలుకోగలవు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమ పండగ సీజన్ పైనే ఆశలన్నీ పెట్టుకుంది. కార్లు, ఎఫ్‌ఎంసీజీ(వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువులు) రంగాల్లో అమ్మకాలు ఇప్పటికే వారికి శుభ సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో ప్రపంచ మార్కెట్లు డీలా పడిపోతూంటే... దేశీ మార్కెట్లు మాత్రం హడావుడిగా ఉండటం ఒక ధోరణిగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా ఏళ్లుగా ఒడిదుడుకులకు లోనవుతూండగా కోవిడ్, ఉక్రెయిన్  యుద్ధాలు వాటిని తీవ్రతరం చేశాయి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్‌) ఇప్పటికే ప్రపంచ వృద్ధి రేటును తగ్గించేసింది. 2022లో ఇది 3.5 శాతంగా ఉంటే, ఈ ఏడాది 3 శాతా నికి పరిమితం కావచ్చునని అంటోంది. 2024లో ఇది మరి కొంచెం తగ్గి 2.9 శాతానికి చేరుతుందని చెబుతోంది. 

భారత్‌ విషయానికి వస్తే ప్రపంచబ్యాంకు లాంటివి భారతీయ మార్కెట్లు బాహ్య ఘటనల ఒత్తిడిని తట్టుకుని నిలిచాయని ప్రశంసించాయి. కానీ, ఈ ధోరణి ఎంత కాలం కొనసాగుతుందనేదివేచి చూడాల్సిన అంశం. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య యుద్ధం తొంద రగా ముగుస్తుందా? లేక మరింత వ్యాపిస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానాల్లో భారతీయ మార్కెట్ల నిలకడతనం పరీక్ష కూడా ఉందని చెప్పాలి.

సుష్మా రామచంద్రన్‌ - వ్యాసకర్త సీనియర్‌ ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌ (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement