సామాన్యులను వేధించే ప్రశ్నలెన్నో! | Sakshi Guest Column On General election 2024 | Sakshi
Sakshi News home page

సామాన్యులను వేధించే ప్రశ్నలెన్నో!

Published Wed, Dec 27 2023 12:01 AM | Last Updated on Wed, Dec 27 2023 3:56 AM

Sakshi Guest Column On General election 2024

ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు అలా ముగిశాయో లేదో... 2024 సాధారణ ఎన్నికల ఫలితాల గురించిన ఊహాగానాలు అప్పుడే మొదలైనాయి.ఈ ఫలితాల ఊపుతో బీజేపీనే తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతున్న విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ముస్లింలకు సీట్లు ఇవ్వని బీజేపీ మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తుందనే ప్రశ్న వేధిస్తోంది. అంకెలకు ఉద్వేగాలు ఉండవు. నిరావేశంగా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, వాస్తవాలు నిగ్గుదేలుతాయి. అధికార పక్షానికీ, ప్రతిపక్షానికీ ఓట్ల శాతంలో తేడా అతి తక్కువ. ఆ ఎన్నికల ఫలితాలకు ముందూ, తరువాతా ఆయా పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పు లేదు. మరి 2024లో ప్రతిపక్షాల విజయం ఒక ఎండమావి అని ఎలా నిర్ణయిస్తారు?

ఈనాడు భారతదేశం మొత్తం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికల గురించే ఆలోచిస్తోంది. అయితే ఈ ఎన్నికల కంటే కూడా 2024 సాధారణ ఎన్నికలలో బీజేపీ మళ్లీ గెలుస్తుందా లేక కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండియా’ కూటమి వస్తుందా అనే దాని గురించి ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ‘ఇండియా’ కూటమికి సంబంధించి ఈ నాలుగు రాష్ట్రాల సీట్ల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ అలసత్వం చేసింది. ఈ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్‌కూ వచ్చిన ఉన్న ఓట్ల శాతంలో తేడా అతి తక్కువ. అసలు ముస్లివ్‌ులకు సీట్లు ఇవ్వని బీజేపీ, మళ్ళీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తుంది అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది.

మొన్న తెలంగాణ ఎన్నికలలో గెలిచాక ప్రోటెవ్‌ు స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను కాంగ్రెస్‌ నియమించినందుకు అసెంబ్లీలో ఆయన సార థ్యంలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయకుండా బీజేపీ బాయ్‌ కాట్‌ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య. ఎందుకంటే ముస్లివ్‌ుల పాత్ర లేకుండా హైదరాబాద్‌ జీవితమే లేదు. ప్రపంచ మొత్తం పర్యాటకులు హైదరాబాద్‌ బిర్యానీని ఇష్టపడతారు. చార్మినార్‌ దగ్గర సెంటు, గాజులు కొనుక్కొనని హిందూ స్త్రీలు లేరు. వారి ఉత్పత్తులను అనుభవిస్తూనే వారిని శత్రువులుగా చూడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి సంగీతాన్ని ఆస్వాదిస్తూ, వారి హీరోలతో సినిమాలు నిర్మించి వందల కోట్లు సంపాదిస్తూ, రాజకీయంగా వచ్చేటప్పటికి మాత్రం వారిని నిరోధించడం అప్రజాస్వామికం కాదా! 

మరో పక్క సామాజిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు ఏంటంటే, ఈ ఎన్నికలలో వచ్చిన సీట్ల సంఖ్య మనకు అంత ప్రధానం కాదు. ఓట్ల శాతమే మనకు నమూనా. మూడు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బేననడం సందేహం లేదు. అంతేకాదు 2024లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్న వారికి ఆ ఫలితాలు తీవ్ర ఆశాభంగం కలిగించాయని కూడా చెప్పొచ్చు.

తెలంగాణలో కాంగ్రెస్‌ చరిత్రాత్మక పునరాగమనంతో నెల కొన్న ఉత్సాహాన్ని ఉత్తరాది అపజయాలు ఒక విధంగా తగ్గించి వేశాయి. తదుపరి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి అవి అనేక అను కూల తలను సృష్టించాయని కూడా అంటున్నారు. కానీ ఇదెంతవరకు నిజం? అంకెలకు ఉద్వేగాలుండవు. నిరావేశంగా ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించండి, వాస్తవాలు నిగ్గు దేలుతాయి. ఆ ఎన్నికల ఫలితాలకు ముందూ, తరువాతా ఆ యా పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పు లేదని స్పష్టమవుతుంది. మరి 2024లో ప్రతిపక్షాల విజయం ఒక ఎండమావి అని ఎలా నిర్ణయిస్తారు?

మూడు రాష్ట్రాలలో బీజేపీకి తిరుగులేని విజయం లభించడంతో, కేంద్రంలో ఆ పార్టీని మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ప్రధాన రాజ కీయ పక్షాలకు లభించిన ఓట్ల గణాంకాలను చూద్దాం. మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మొత్తం 12.29 కోట్ల ఓట్లు పోల్‌ అయ్యాయి.

ఇందులో బీజేపీకి 4.82 కోట్లు, కాంగ్రె స్‌కు 4.92 కోట్లు (‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొంటే 5.06 కోట్లు) లభించాయి. మధ్యప్రదేశ్‌లో మినహా, ఓట్ల పరంగా బీజేపీకి లభించిన ఆధిక్యత స్వల్ప స్థాయిలో మాత్రమే ఉంది. తెలంగాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు లభించాయి. మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఓట్ల లోటును తెలంగాణ గణ నీయంగా భర్తీ చేసింది. మీడియా ఊదరకు విరుద్ధంగా తాజా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ప్రజల మద్దతు మరీ విశేషంగా ఏమీ లభించలేదని చెప్పొచ్చు.

అసలు బీజేపీ ప్రాతినిధ్యం వహించే హిందూ ధార్మిక వ్యవస్థ గురించి అంబేడ్కర్‌ విశ్లేషించారు. హిందూమతం ధర్మవ్యాపక సంస్థ (మిషనరీ మతం) అవునా, కాదా అనేది చర్చనీయాంశం. హిందూ మతం ఏనాడూ ప్రచారక మతంగా లేదని కొందరంటారు. ఒకానొక కాలంలో హిందూ మతం ప్రచారక మతంగా ఉన్నదనడమే సరిౖయెన వాదంగా కన్పిస్తుంది. అది ప్రచారక మతం కాకపోతే భారత భూభాగంలో ఇంతగా వ్యాపించి ఉండేది కాదు. ఈనాడు అది ప్రచారక మతం కాదనేది కూడా సత్యమే.

ఒకప్పుడు ప్రచారక మతంగా ఉన్న హిందూమతం ఇప్పుడెందుకు దానికి వ్యతిరేకంగా మారింది? ఈ ప్రశ్నకు నా జవాబు ఇది: హిందూమతం ప్రచారక మతంగా ఎప్పుడాగి పోయిందంటే, హిందువులలో కులవ్యవస్థ ఏర్ప డినప్పుడు! కుల వ్యవస్థకూ, మతం మార్పునకూ పొసగదు. మతం మార్పునకు కావలసింది విశ్వాసాలూ ,సిద్ధాంతాలూ స్వీకరించడం మాత్రమే కాదు; ఈ మతం మార్పులో అంతకంటే ముఖ్యమైన మరొక విషయం ఉంది. అది – మతం మార్చుకొన్న వారికి సంఘ జీవనంలో లభించే స్థానం.

ఈనాడు ఇతరుడెవరైనా హిందూ మతాన్ని స్వీకరించదలిస్తే, హిందూ మతంలో అతని స్థానమెక్కడ? ఏ కులంలో చేర్చుకోవడం? అన్యులైన వారిని తన మతంలో చేర్చుకోవాలనుకునే ప్రతీ హిందువునీ తికమకపరిచే సమస్య ఇది. ఏదో ఒక క్లబ్బులో చేరినట్టు ఒక కులంలో అందరూ చేరడానికి వీలు లేదు. క్లబ్బు సభ్యత్వం వలే కుల సభ్యత్వం స్వేచ్ఛాయుతమైంది కాదు.

ఆ కులంలో పుట్టిన వారికే ఆ కులంలో సభ్యత్వం. అది కుల న్యాయం. ఈ న్యాయం కింద ఏ కులానికి ఆ కులమే స్వయం స్వతంత్రం. ఎవరైనా కొత్త వారిని ఏ కులంలోనైనా చేర్పించే అధికారం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. నిజానికి అంబేడ్కర్‌ హిందూ భారతాన్ని ఆశించ లేదు. లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద భారతాన్ని ఆశించాడు. ఆయన మార్గంలో నడవకపోతే భారతదేశం ఆర్థిక, సాంఘిక,సాంస్కృతిక, విద్య, తాత్విక రంగాలలో అణగారిపోతుంది.
డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement