ఒక దశాబ్దం పాటు రెజ్లింగ్‌లో ఆధిపత్యం చలాయించిన రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా మహిళా మల్లయోధులు పోరాడుతున్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు కొత్తవి కావు. 2016లోనే అలాంటి కథనం పత్రికలో వచ్చింది. కానీ దాన్ని సద్దుమణిగేలా చేశారు. క్రీడలలో మహిళలపై లైంగిక వేధింపులు ‘అసాధారణం కాదు’ అనేది కలవరపరిచే వాస్తవం. భారతీయ క్రీడలను ఎంత బలహీనంగా మేనేజ్ చేస్తున్నారో దేశానికి తెలిసేలా చేయగలిగారు మన రెజ్లర్లు.
ఇది బీజేపీతో ప్రారంభం కాలేదు, దీనితో ముగిసిపోదు. క్రీడా సమాఖ్యల నుండి రాజకీయ నాయకులను బయటకు పంపిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. కేసును పోలీసులు ఎలా నిర్వహిస్తారు, బ్రిజ్‌భూషణ్‌కు ఏమవుతుంది అనేది క్రీడల్లోకి అడుగుపెడుతున్న అమ్మాయిలకు ఒక సంకేతంగా ఉంటుంది.
ఇలా చెప్పడం నాకు బాధగా ఉంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటేరియన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిరసన తెలుపుతున్న భారతదేశపు ప్రముఖ రెజ్లర్లు, ఇప్పుడు వెనుకకు నెట్టబడి ఉండవచ్చు.
వేధింపులు, అధికార దుర్వినియోగ ఆరోపణలతో ప్రజల్లోకి వెళ్లే మహిళలకు తరచుగా జరిగే విధంగానే వ్యవస్థ సంపూర్ణ శక్తి సాధారణంగా వారికి వ్యతిరేకంగా ప్రబలంగా ఉంటుంది. అది ఫిర్యాదుదారుల శక్తిని మించిపోతుంది.
దీనిపై స్పందించిన రెజ్లర్లు తాము తిరిగి ప్రాక్టీసుకు రావడాన్ని తమ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గినట్లు చూడకూడదని చెప్పారు. వారు నిరంతర నిబద్ధతతో బలంగా నిలబడిన కారణంగానే వారికీ, ప్రభుత్వానికీ మధ్య ఇటీవలి రౌండ్ చర్చలకు దారితీసింది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఛార్జిషీట్ దాఖలుకు జూన్ 15ను డెడ్‌లైన్ గా విధించారు. అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్లు్యఎఫ్‌ఐ) నిర్వహణ కోసం జూన్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించారు. ఈ నిర్దిష్ట ప్రతిపాదనలను స్వాగతించాలి.
జంతర్ మంతర్‌లో నిరసన కార్యక్రమం జరిగినప్పుడు వారిని లాగిపడేయడం, దూరంగా తీసుకుపోవడానికి ప్రయత్నించడానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయిన తర్వాత, మల్లయోధుల పట్ల ప్రజల్లో ఏర్పడిన విస్తృత సానుభూతిని ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది.
అయితే మరి తర్వాత ఏమి జరుగుతుందనే విషయంలో నేను ఎందుకు సంశయంగా ఉన్నాను? ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇందులో ‘లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం’ (పోక్సో)కి చెందిన దరఖాస్తు ఉన్నందున ఆయన్ని వెంటనే అరెస్టు చేయడానికి బలమైన చట్టపరమైన ఆధారం ఉంది. వేధింపులు, దుర్వినియోగంతోపాటు వేధింపులకు సంబంధించిన 12 విభిన్న సందర్భాలను వారి ప్రథమ సమాచార నివేదికల (ఎఫ్‌ఐఆర్‌లు)లో పేర్కొన్న ఏడుగురు ఫిర్యాదుదారులలో ఒకరు మైనర్.అయితే గత వారం రోజులుగా మైనర్ తండ్రి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు.
తన కుమార్తె పట్ల చెడుగా ప్రవర్తించాడని అనుకున్నందున తాను సింగ్ మీద తప్పుడు వేధింపు ఆరోపణలు చేసినట్లుగా ఆయన ఇప్పుడు చెబుతున్నారు. ఒత్తిడి, బెదిరింపుల పర్యవసానంలా కనిపిస్తున్న ఈ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల (తన కుటుంబం భయంతో కొట్టుమిట్టాడుతోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు), కేవలం తన కుమార్తె కేసును మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి కేసునూ బలహీనపరిచే అవకాశం ఉంది. తన తొలి ఫిర్యాదులో, తన కూతురును ముందుకు రాకుండా చేసిన భయాన్ని తండ్రి ప్రస్తావించాడు. మరి ఈ రోజు కూడా అదే భయం ఆయన్ని ఆడిస్తోందా?
కలవరపరిచే వాస్తవాలు
వాస్తవం ఏమిటంటే, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ చందర్ శేఖర్ లూథ్రా ఎత్తి చూపినట్లుగా, సింగ్‌పై దుర్వినియోగ ఆరోపణలు కొత్తవి కావు. అవి అంతకు ముందూ నమోదయ్యాయి. లూథ్రా నాతో మాట్లాడుతూ, 2016లో లక్నోలోని మహిళా శిబిరానికి హాజరైన ముగ్గురు యువ క్రీడాకారిణులు తమను బ్రిజ్‌భూషణ్ హోటల్ రూముకు రమ్మని పిలిచారని ఫిజియో థెరపిస్టుతో చెప్పినప్పుడు అలాంటి సంఘటన మొదటిసారి బయటపడిందని చెప్పారు.
‘‘మేము నివేదించిన కథనాన్ని ఒక హిందీ వార్తాపత్రిక వాస్తవంగా ప్రచురించింది; కానీ అంతా సద్దుమణిగిపోయేలా చేశారు’’ అని లూథ్రా చెప్పారు. మహిళా క్రీడాకారిణులకు బ్రిజ్ భూషణ్ వల్ల కలుగుతున్న వ్యథల గురించి ప్రభుత్వంలోని అధికారులకు కూడా తెలుసునని ఎఫ్‌ఐఆర్ ఆరోపించింది. ఆసియా ఛాంపియన్ షిప్‌లో ఫొటో అవకాశం సందర్భంగా సింగ్ ‘‘నా పిరుదులపై చేయి వేయడానికి ప్రయత్నించారు’ అని ఒక ఫిర్యాదుదారు చేసిన ప్రకటనను అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్ సింగ్ కూడా ధ్రువీకరించారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్తాపత్రిక నివేదించింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాల గురించి, ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్లకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ సింగ్‌ను తాను విచారించినట్లు ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ నాతో చెప్పారు. చివరికి కోర్టులో కేసు వీగిపోయినప్పటికీ, సింగ్ నిర్దోషిగా విడుదలైనప్పటికీ, ‘‘భూషణ్ ప్రమాదకరమైన వ్యక్తి’’ అని నీరజ్ కుమార్ నాతో అన్నారు.
ఒకప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు సలహాదారుగా ఉన్న కుమార్, క్రీడలలో మహిళలపై లైంగిక వేధింపులు ‘‘అసాధారణం కాదు’’ అనే వాస్తవాన్ని నొక్కిచెప్పారు. యువ మహిళా క్రికెటర్లు, క్రికెటర్ల తల్లుల నుంచి లైంగిక అనుకూలతను ఆశించిన సెలెక్టర్లు, కోచ్‌ల గురించిన ఆరోపణలు కూడా తనకు తెలుసుననేంత వరకూ నీరజ్ వెళ్లిపోయారు. ఆయన మాటలు వింటున్నప్పుడు నాకు ఒళ్లు జలదరించింది.
భారతీయ క్రీడలను ఎంత బలహీనంగా మేనేజ్ చేస్తున్నారో తెలిసేలా రెజ్లర్లు దేశం దృష్టిని అటువైపుగా మళ్లించారు. ఇది బీజేపీతో ప్రారంభం కాలేదు, దీనితో ముగిసిపోదు. క్రీడా సమాఖ్యల నుండి రాజకీయ నాయకులను బయటకు పంపిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. లేదంటే, రాజకీయ అధికారం, ఫెడరేషన్ల నియంత్రణ మధ్య ఉన్న దుష్ట సంబంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు.
మౌనమే నయమా?
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇండియా రెజ్లింగ్ ఫెడరేషన్‌ను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇదంత సులభం కాదు. రెజ్లర్లు ఎత్తి చూపినట్లుగా, బ్రిజ్ భూషణ్‌కు ఫెడరేషన్ పై గట్టి పట్టు ఉంది. ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ దాని ఉపాధ్యక్షుడు; ఆయన అల్లుడు ఆదిత్య ప్రతాప్ సింగ్ సంయుక్త కార్యదర్శి. రెజ్లింగ్ ఫెడరేషన్ మీద బ్రిజ్ భూషణ్ సింగ్ పరివార్ నిర్బంధం సమగ్రంలా కనబడుతోంది. గత వారాంతంలో ఆయన చేపట్టిన అయోధ్య ర్యాలీని రద్దు చేసినప్పటికీ, భారీగా జనానికి చేరువయ్యేలా తన ఉత్తరప్రదేశ్ నియోజకవర్గంలో పర్యటిస్తానని సింగ్ ప్రకటించారు.
అధికారానికి సంబంధించిన ఇలాంటి సంకేతాల మధ్య, మీరు ఫిర్యాదుదారుని కుటుంబం భయపడిందని నిందించగలరా? ప్రత్యేకించి బ్రిజ్ భూషణ్ సింగ్ లేదా ఆయనతో సంబంధం ఉన్నవారు... మిమ్మల్ని మీ కెరియర్‌లో పైకి తేగలిగి, అవసరమైతే తొక్కేయగలిగిన పక్షంలో. ఒక దశాబ్దం పాటు రెజ్లింగ్‌లో ఆధిపత్యం చలాయించిన రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా మహిళా క్రీడాకారులు పోరాడుతున్నారు.
పోలీసులు ఈ కేసును ఎలా నిర్వహిస్తారు, బ్రిజ్ భూషణ్‌కు ఏమి జరుగుతుంది అనేది మనందరికీ ఒక సంకేతం; ముఖ్యంగా భారతీయ మహిళలు, అది పెద్దవాళ్లయినా, చిన్నవాళ్లయినా, ఇంకా ముఖ్యంగా ఇప్పుడే క్రీడల్లోకి అడుగుపెట్టిన బాలికలకు ఇది సూచనగా ఉంటుంది. ఈ విషయం గురించి మాట్లాడినందుకు ఇది వారు చెల్లించాల్సిన మూల్యం అని వాళ్ళు నమ్మాలని మనం కోరుకుందామా? మౌనం సురక్షితమని వారు భావించాలని మనం కోరుకుందామా?
బర్ఖా దత్
వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయురాలు
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment