రాజ్‌పుత్ (క్షత్రియ) ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య ఛైర్మన్ అయిన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా రెజ్లర్‌లు ఫిర్యాదు చేశారు. అయితే బ్రిజ్‌భూషణ్ మాత్రం కేంద్ర ప్రభుత్వం తనపై చర్య తీసుకుంటుందేమోనన్న చీకూచింతా లేకుండా, నేటికీ ఎంపీగా కొనసాగుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన శూద్ర (జాట్) మహిళా రెజ్లర్‌లు వేసవి గాడ్పుల మధ్య ఢిల్లీ వీధులలో పోరాడుతూ ఉంటే వారిని పట్టించుకోవడం లేదు. రైతుల ఉద్యమ సమయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనతను చూపింది. అదే విధమైన ఉదాసీనతను ఇప్పుడు మహిళా రెజ్లర్‌ల విషయంలో చూపిస్తోంది. రెజ్లర్‌లకు దేశవ్యాప్త మద్దతు లభించడం ఎంతైనా అవసరం.
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2017 మార్చి నుండి ఆ రాష్ట్రంలో 186 ఎన్‌కౌంటర్లు జరిగాయని ‘ది ఇండి యన్ ఎక్స్‌ప్రెస్’ జరిపిన పోలీసుల రికార్డుల పరిశీలనలో వెల్లడైంది. అంటే ప్రతి 15 రోజులకు ఒకరికి పైగా! అయితే బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ మాత్రం కేంద్ర ప్రభుత్వం తనపై చర్య తీసుకుంటుదేమోనన్న చీకూచింతా లేకుండా, తన సామాజిక వర్గానికే చెందిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి మద్దతుతో నేటికీ ఎంపీగా కొనసాగుతూనే ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన శూద్ర (జాట్) మహిళా రెజ్లర్‌లు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా అసాధార ణమైన వేసవి గాడ్పుల మధ్య ఢిల్లీ వీధులలో న్యాయం కోసం పోరా డుతూ ఉంటే పట్టించుకోకుండా బ్రిజ్‌భూషణ్‌కే తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
రాజ్‌పుత్ (క్షత్రియ) ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లు్యఎఫ్‌ఐ) ఛైర్మన్ బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్ నెలన్నర క్రితమే ఫిర్యాదు చేశారు. ఆయన్ని ఆరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దేహదార్డ్యం కలిగిన భారతీయ క్రీడాకారిణులలో ఎక్కువ మంది శూద్ర, దళిత, ఆదివాసీ కుటుంబాల నుంచి వచ్చినవారే. హరియాణా, ఉత్తరప్రదేశ్ లలోని జాట్ కులం తమ పిల్లలకు కుస్తీలో శిక్షణ ఇప్పించడంలో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత ఉదంతంలో బాధితులైన మహిళా రెజ్లర్‌ల గోడును ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అగ్రవర్ణ నిందితుడు బ్రిజ్‌భూష ణ్‌ను కాపాడేందుకు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, కేంద్ర
మంత్రి అనురాగ్ ఠాకూర్ గట్టి సంకల్పంతో ఉన్నట్లుగా భావించవలసి వస్తోంది.
‘వికీపీడియా’లోని బ్రిజ్‌భూషణ్ జీవిత చరిత్రను బట్టి చూస్తే – పోలీసు రికార్డుల ప్రకారం ఆయనపై 1974–2007 మధ్య 38 క్రిమి నల్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చాలా కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదల అయినప్పటికీ... అంతకుముందు వరకు ఆయనపై దొంగతనం, దోపిడి, హత్య, హత్యాయత్నం, బెది రింపులు, అపహరణలు వంటి పలు ఆరోపణలతో గ్యాంగ్‌స్టర్స్, గూండాల వ్యతిరేక చట్టాల కింద ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి.
తన రాష్ట్రంలోని నేరస్థులందరినీ అంతమొందిస్తానని ప్రకటించిన యోగి, బ్రిజ్ భూషణ్‌ని కనీసం అరెస్ట్ చేయించేందుకైనా ఇష్టపడటం లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం... గత కొన్ని రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్న మహిళా రెజ్లర్ల మొర ఆలకించడానికి ముందుకు రాలేదు. దీంతో హరియాణా, ఉత్తర ప్రదేశ్‌లలోని జాట్‌లు ధీశాలురైన తమ ఆడబిడ్డల పోరాటానికి మద్దతుగా నిలబడేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై వివిధ ప్రాంతాలలోని ఖాప్ పంచాయితీలను ఆశ్రయించనున్నట్లు వారు ప్రకటించారు. నెమ్మదిగా ఈ ఉద్యమం 2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శూద్ర వ్యవసాయ సంఘాలు జరిపిన రైతు ఉద్యమ రూపాన్ని సంతరించుకోనుంది. ఢిల్లీ అంతర్‌మార్గాలలోని ఇండియా గేట్, జంతర్ మంతర్ వగైరాలు ఇప్పటికే ఈ విధమైన ఘర్షణ ధోరణులకు సాక్షులుగా ఉన్నాయి. ఇప్పుడిక జాట్ రైతులకు, యూపీ క్షత్రియ పాలక దళాల మధ్య యుద్ధ వాతా వరణాన్ని ఆ మార్గాలు వీక్షించబోతున్నాయి.
తులసీదాసు రచించిన ‘రామచరితమానస్’లో శూద్రులను అవ మాన పరిచేలా ఉన్న భాషను, భావాన్ని ఖండిస్తూ ఉత్తరప్రదేశ్‌లో ‘గర్వ్ సే కహో హమ్ శూద్రా హై’ ఉద్యమం జరిగింది. ఇప్పుడేమిటంటే... శూద్ర మహిళలు, అధికారంలో ఉన్న క్షత్రియ పురుషుల మధ్య యుద్ధం మొదలైంది. యూపీ ముఖ్యమంత్రి రాజ్‌పుత్‌యేతర నేరస్థులను హతమార్చమని ఆదేశాలు ఇవ్వడం లేదనీ, ఓబీసీ/ఎస్సీ నేరస్థులను చంపమని ఆదేశిస్తున్నారనీ ఆఖిలేష్ యాదవ్ చెబు తున్నారు. ఏమైనా దేశం ఇప్పుడు చూస్తున్నటువంటి గొప్ప మహిళా క్రీడాకారుల ఉద్యమాన్ని మునుపెన్నడూ చూడలేదు. నిందితుడిపై చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించినప్పటికీ నిష్క్రియగా ఉండి పోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కంగనా రనౌత్, మధు కిష్వార్ వంటి వారైనా కనీసం నోరు మెదపలేదు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలను సమర్థిస్తుండే; ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై మాటలతో దాడి చేస్తుండే ఈ మహిళలు... మహిళా రెజ్లర్‌లపై జరిగిన లైంగిక వేధింపుల విషయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు.
జాతీయ మహిళా కమిషన్ కూడా పూర్తిగా మౌనం దాల్చింది.
ఎందుకు? ఎందుకంటే వీళ్లంతా తాము అభిమానించే ఆకర్షణీయమైన స్త్రీల దేహాల మాదిరిగా మహిళా మల్లయోధుల శరీరాలు ఉండవని భావిస్తారు. కానీ ఈ రెజ్లర్‌లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చివారు. వారి రెజ్లింగ్ జీవితం ఖరీదైన శిక్షణా సంస్థలలో రూపుదిద్దుకోలేదు. విశ్వ విద్యాలయాలలోని హిందుత్వ మహిళా మేధావులు, లేదా సినీ నటీమణుల మాదిరిగా కారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినప్ప టికీ వారి ఆర్థిక జీవనం మధ్యతరగతి పరిధిని దాటి పోలేదు. వీళ్లపై లైంగిక వేధింపులు జరిగినట్లే... ఆర్థిక స్థోమత, అగ్రకుల మహిళా సినీ నటులపై సాధారణ శ్రామిక వర్గానికి చెందిన పురుషులు వేధింపులు జరిపితే వారిని వెంటనే జైలుకు పంపేవారు. హిందూత్వ జాతీయవాద న్యాయ వ్యవస్థ అన్నది మతం ఆధా రంగా కూడా పని చేయదు.
ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఆవిర్భావం ఉండీ భారతీయ ముస్లిములు, క్రైస్తవులకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని కలిగి ఉంది. అయితే ఇండియాలో జాట్‌లు కూడా తమను తాము హిందువులుగా పరిగణించుకుంటారు. వారి మహిళలు శతా బ్దాలుగా కఠినమైన శారీరక శ్రమ ద్వారా భారతదేశ నాగరికతను, సంస్కృతిని నిర్మించడంలో భాగస్వాములుగా ఉన్నవారు. జాట్ మహి ళల శారీర శ్రమ వారసత్వం నుండి వారి పిల్లలకు రెజ్లింగ్ నైపుణ్యాలు సంక్రమిస్తున్నాయి.
కాగా రైతుల ఉద్యమ సమయంలో కూడా ప్రభుత్వం ఉదాసీన తను చూపింది. ఎందుకంటే వారు కష్టపడి పని చేసే రైతులు మాత్రమే. వారిలో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు లేరు. అదే ఉదాసీన తను ఇప్పుడు మహిళా రెజ్లర్‌ల విషయంలో చూపిస్తోంది. ఇప్పుడిక హరియాణా, యూపీలలోని జాట్‌లు తమ మహిళా రెజ్లర్‌లకు మద్ద తుగా ఖాప్ పంచాయితీలను ఆశ్రయించాలని చూస్తున్నారు. కులాంతర వివాహాలకు వ్యతిరేకంగా గతంలో వారు ఈ పంచాయితీల సహాయాన్నే కోరారు. వ్యక్తిగతంగా నేను సంప్రదాయ కుల పంచా యితీ వివాద వ్యవస్థను సమర్థించనప్పటికీ తమ సొంత సంస్థ ఛైర్మన్ నుంచి ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళా రెజ్లర్‌లకు దేశవ్యాప్త మద్దతు లభించాలన్నది నా ఆకాంక్ష.
భారత రెజ్లింగ్ సమాఖ్య ఛైర్మన్‌గా బ్రిజ్ భూషణ్ సింగ్‌ను మోదీ ప్రభుత్వం ఎలా నియమించింది? ఆయన జీవితంలో ఆయనకు క్రీడ లతో సంబంధం లేదు. అతడి నేరమయ జీవితాన్ని కప్పిపుచ్చేందుకు, రామజన్మ భూమి అంశంలో అతడి ప్రమేయానికి గుర్తింపుగా
అత్యంత కీలకమైన ఆ పదవిని కట్టబెట్టిన ట్లున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడాభివృద్ధి సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల నెట్ వర్క్ కలిగిన యోగా కేంద్రాల వంటివి కావు. క్రీడలు యవతీయువ కుల జీవన్మరణ సాధనతో ముడివడి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం బ్రిజ్ భూషణ్‌ను డబ్లు్యఎఫ్‌ఐ ఛైర్మన్ పదవి నుంచి తొలగించి, ఆయనపై ఇప్పటికే నమోదై ఉన్న ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తక్షణం విచారణ జరిపి శిక్ష విధించాలి. (గురువారం బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఆయనపై ‘పోక్సో’ కేసును తొలగించాలని కూడా నివేదికను సమర్పించారు.
- కంచె ఐలయ్య షెఫర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment