
అక్టోబర్ 7 నాటి హమాస్ వరుస రాకెట్ దాడులను ఇజ్రాయెల్ తనదైన ‘9/11’గా అభివర్ణిస్తోంది. ఇరాన్, లెబనాన్ కూడా ఘర్షణ కేంద్రాలుగా మారితే వివాదం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పాలస్తీనా సమస్యను అరబ్ రాజ్యాలతో సహా అన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. ఇప్పుడు ఇదే ప్రాంతీయ, ప్రపంచ రాజకీయాలకు కేంద్రం అవుతుంది. సరిగ్గా హమాస్ సాధించాలనుకున్నది ఇదే. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల స్థాపన చర్చలను నిలిపివేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఇజ్రాయెల్, దాని నౌకాశ్రయం హైఫాను కలుపుకొని ప్రకటించిన ‘ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరోప్ ఎకనామిక్ కారిడార్’ సందిగ్ధంలో పడే అవకాశం ఉంది.
2007 నుండి గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, అక్టోబర్ 7న, ఇజ్రాయెల్‌పై వరుస రాకెట్ దాడులను ప్రారంభించింది. ఆపై ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దులో కమాండో దాడులతో, ఇజ్రాయెల్ పౌరులను, విదేశీయులను విచక్షణారహితంగా చంపడమే కాకుండా, ఇజ్రాయెల్ పౌరులను, అనేక మంది ఇజ్రాయెల్ రక్షణ సిబ్బందిని అపహరించుకుపోయింది. సరిహద్దు సమీపంలో సంగీత ఉత్సవాన్ని ఆస్వాదిస్తున్న 250 మంది యువ ఇజ్రాయెలీలను, విదేశీయులను విచక్షణారహితంగా చంపివేశారు.
ఈ హమాస్ దాడిని ఇజ్రాయెల్ తనదైన ‘9/11’గా అభివర్ణిస్తోంది. ఇతర ఇజ్రాయెలీలు అయితే,
రెండవ ప్రపంచ యుద్ధంలో హోలోకాస్ట్ అని పిలుస్తున్న మారణకాండలో లక్షలాదిమంది యూదులను హిట్లర్ పాలనలోని జర్మనీలో గ్యాస్ ఛాంబర్‌లకు పంపిన తరహాలో మళ్లీ యూదులను అత్యంత దారుణంగా లక్ష్యంగా చేసుకున్న హత్యాకాండగా అభివర్ణించారు.
మనం ఇప్పుడు 20 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు నివసించే గాజా స్ట్రిప్‌లో ఒక పెద్ద మానవ విషాదం అంచున ఉన్నాము. గాజా ఉత్తర భాగంలో నివసించే ప్రజలను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి స్ట్రిప్ దక్షిణ భాగం వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెచ్చరించాయి. అయితే, ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఫిరంగి బాంబు దాడులు కొనసాగుతున్నందున, దక్షిణం వైపునకు వెళ్లడానికి కూడా సురక్షితమైన మార్గాలు లేవు.
ఈజిప్ట్‌కు వెళ్లే ఏకైక నిష్క్రమణ స్థానం రఫాహ్ చెక్‌పాయింట్ ద్వారా వెళుతుంది. దాన్ని కూడా మూసి వేశారు. ఈజిప్ట్ కోరుకునే చివరి విషయం వేలాది పాలస్తీనియన్ల వలసే. ఇజ్రాయెల్ దిగ్బంధనం వల్ల అత్యవసరంగా కావలసిన ఆహారం, నీరు, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇవన్నీ ఇజ్రాయెల్ ద్వారానే వస్తాయి. ఇప్పటికీ పనిచేస్తున్న ఆసుపత్రులు, క్లినిక్‌లలో వైద్య సామగ్రి అయిపోయింది. అమెరికా జోక్యం నీటి సరఫరా పునఃప్రారంభానికి దారితీసింది కానీ ఇది దక్షిణ గాజాకు మాత్రమే.
గాజాలో పాలస్తీనియన్ల ఈ సామూహిక శిక్ష, హమాస్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసే అవకాశం లేదు. దాని నాయకులు కొందరు ఇప్పటికే ఒమన్ లో ఆశ్రయం పొందారు. మరికొందరు ఇరాన్ లేదా లెబనాన్ కు పారిపోయి ఉండవచ్చు. లెబనాన్ లోని ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మల్లే, ఇరాన్ హమాస్‌కు మద్దతు ఇస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ బాంబుదాడిలో పలువురు బందీలు మరణించినట్లు హమాస్ ఇప్పటికే ప్రకటించింది.
ప్రపంచ స్థాయి నిఘా, సైనిక సామర్థ్యాలు ఉన్నప్పటికీ దాడిని నిరోధించలేకపోయిన బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయె లీలకు ఆగ్రహం ఉంది. అకస్మాత్తుగా, అనేకమంది ఊహించినట్లుగా ఇజ్రాయెల్ అభేద్యంగానూ, సురక్షితంగానూ కనిపించడం లేదు. ప్రణాళికాబద్ధమైన దాడి నెతన్యాహు వైఫల్యాల నుండి దృష్టిని మళ్లించి, ప్రజలు ద్వేషిస్తున్న శత్రువుకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసే రాజకీయ ప్రయోజనానికి మాత్రం ఉపయోగపడుతుంది.
1967 నుండి 2005 వరకు దక్షిణ గాజాలోని తన ఆవాసాలను ఖాళీ చేసి పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ (పీఎన్‌ఏ)కి పగ్గాలు అప్పగించి నట్లుగానే, ఇప్పుడు సైతం గాజాను ఆక్రమించడానికి ఇజ్రాయెల్ విముఖత చూపవచ్చు. కానీ 2007లో హమాస్ గాజా బాధ్యతలు స్వీకరించింది. అప్పటి నుండి పీఎన్‌ఏకి ఎటువంటి పాత్రా లేదు. గాజా దాని మధ్యధరా తీరంపై ఇజ్రాయెల్ గగనతల నియంత్రణను కొనసాగించింది. గాయపడిన, శత్రు జనాభాతో నిండివున్న గాజాను తాత్కాలికంగా తిరిగి ఆక్రమించడం కూడా ఇజ్రాయెల్ భద్రతను ఎలా మెరుగుపరుస్తుందో చెప్పడం కష్టం.
ఇజ్రాయెల్, కీలకమైన అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించే ధోరణి ఇప్పుడు సవాలును ఎదుర్కొంటోంది. ఇజ్రా యెల్‌తో దౌత్య సంబంధాల స్థాపన, రాయబార కార్యాలయాల మార్పిడికి దారి తీస్తుందని భావిస్తున్న కీలకమైన చర్చలను నిలిపి వేస్తున్నట్లు సౌదీ అరేబియా ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఇజ్రాయెల్, దాని నౌకాశ్రయం హైఫాను కలుపుకొని ప్రకటించిన ‘ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరోప్ ఎకనామిక్ కారిడార్’ ఇప్పుడు సందిగ్ధంలో పడే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు అమాయక పాలస్తీనియన్లను చంపడం, తీవ్రంగా గాయపర్చడం అనేది ఇప్పటికే అరబ్ వీధుల్లో ఆందోళన కలిగిస్తోంది. పైగా ఇజ్రాయెల్‌తో సామీప్యతను ప్రదర్శించడం ద్వారా అరబ్ పాలకులు తమ భద్రతకు హాని కలగాలని కోరుకోవడం లేదు. అమెరికా, యూరప్‌లోని గణనీయమైన అరబ్ డయాస్పోరాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మరియు ముస్లిమే తర ప్రజలలో కూడా ఆగ్రహావేశాలతో కూడిన ప్రదర్శనలు జరిగాయి. పాలస్తీనా సమస్యను అరబ్ రాజ్యాలతో సహా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాలు కూడా పక్కన పెట్టేశాయి.
ఇప్పుడు ఇదే ప్రాంతీయ, ప్రపంచ రాజకీయాలకు కేంద్రం అవుతుంది. సరిగ్గా హమాస్ సాధించాలనుకున్నది ఇదే. శాంతి, శ్రేయస్సుతో కూడిన యుగానికి దారి తీస్తూ, ఇజ్రాయెల్‌ను పశ్చిమాసియా రాజకీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకురాగల... అమెరికా మద్దతు కలిగిన ప్రాంతీయ ఒడంబడిక వైపు మొగ్గు చూపడం అనేది ఇప్పుడు సమాధి అయిపోయింది. ఇంకా చెప్పాలంటే పాలస్తీనా సమస్య ప్రస్తుతం స్తంభించిపోయింది. ఇది రివర్స్ కావచ్చు కూడా. ఇరాన్, లెబనాన్ కూడా ఘర్షణ కేంద్రాలుగా మారితే వివాదం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. విస్తృత స్థాయి యుద్ధంగా మారితే మహా విపత్తు అవుతుంది.
పౌరుల లక్ష్యాలపై హమాస్ ప్రారంభించిన భయంకరమైన ఉగ్రదాడుల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌కు సంఘీ భావం తెలిపారు. అది అప్పుడు సముచితమే. కానీ తదుపరి పరిణా మాలకు ఒక కారకం అవసరం. గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై జరిగిన దాడిలో పాలస్తీనా పౌరులకు జరిగిన తీవ్ర నష్టాన్ని కూడా అంగీకరించాలి. వారి హక్కులు ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నంత ముఖ్య మైనవి, బలమైనవి కూడా.
మన పశ్చిమ పొరుగు ప్రాంతంలో పరిస్థితి భౌగోళికంగా, రాజకీయపరంగా ప్రమాదభరితంగా మారితే భారతదేశం కూడా నష్టపోతుంది. సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే అంచనాతో ఇప్పటికే చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నివసి స్తున్న, పని చేస్తున్న దాదాపు 80 లక్షలమంది భారతీయుల సంక్షేమం కూడా ప్రమాదంలో పడుతుంది.
ఇటీవలి కాలంలో, ఈ ప్రాంతంలో నిర్బంధం, సయోధ్య పట్ల సాధారణ ధోరణిని ఉపయోగించుకున్న భారతదేశం అరబ్ దేశాలతో, ఇజ్రాయెల్‌తో ఏకకాలంలో బలమైన భాగస్వామ్యాలను కొనసాగించగలిగింది. ఐ2యూ2 (ఇండియా– ఇజ్రాయెల్, యూఏఈ–యూఎస్) భాగస్వామ్యం ఆ ధోరణి కొన సాగుతుందనే అంచనాపై ఆధారపడి ఉంది. ఈ ఊహను పునః పరిశీలించవలసి ఉంటుంది.
మనం ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మాత్రమే కాకుండా పశ్చిమాసియాలో సంభవించే పెను మంటతో కూడా పోరాడవలసి ఉంది. వచ్చే ఏడాది అమెరికాలోనూ, మన దేశంలోనూ ఎన్నికలు జరగనుండగా, పెద్ద ఎత్తున రాజకీయ పరివర్తనలు కూడా జరుగు తున్నాయి. అనిశ్చితి, అనూహ్యత అపూర్వమైన స్థాయికి చేరు కున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం విజయవంతమైన ప్రకాశాన్ని, వాస్తవికత తాలూకు తాజా మోతాదుతో తగ్గించా ల్సిన అవసరం ఉంది.
శ్యామ్ శరణ్
వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment