
‘మన దేశ ప్రజల మానసిక స్థితిని నేను సరిగ్గా అంచనా వేయగలను. నా అంచనా ప్రకారం రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కచ్చి తంగా 400 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయ’ని అన్నారు ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ! రానున్న లోక్ సభ ఎన్నికల్లో ‘మిషన్– 400’ (దేశంలోని లోక్ సభ స్థానాల్లో 400 సీట్లలో గెలవడం) లక్ష్యంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తూ, ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.
ఢిల్లీలో ఇటీవల జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయాయనీ, మూడో దఫా బీజేపీ ప్రభుత్వ పాలన ఎంతో దూరంలో లేదంటూ మోదీ బీజేపీ కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపారు. అదే క్రమంలో జమ్మూ–కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కోసం జీవితాంతం ఉద్యమించిన శ్యామప్రసాద్ ముఖర్జీకి ఇది నిజమైన నివాళి అవుతుందని అన్నారు.
ప్రధాని మోదీ పిలుపు అందుకున్న పార్టీ కార్య కర్తలంతా ఊరూరా, వాడవాడలా పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, లక్ష్య సాధన దిశగా సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో బీజేపీ చేపట్టిన ‘విజయసంకల్ప యాత్ర’ కూడా విజయవంతంగా జరుగుతున్నది. ఈ ఏడాది ఆరంభంలో జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కొని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల దాకా ప్రధాని మోదీ ప్రసంగాల సరళితో బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగూతూనే ఉన్నది. రామ మందిరం శాంతికీ, సహనానికీ, సామరస్యానికీ, సమన్వ యానికీ చిహ్నమని చెప్పడం ప్రధాని మోదీ ఔన్నత్యానికి నిదర్శనం.
ఇవాళ ఈ దేశానికి దశ దిశ బీజేపీ మాత్రమేననీ, నరేంద్రమోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అనీ దేశ ప్రజానీకం భావించడానికి ప్రధాన కారణం భారతదేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ప్రధానిగా మోదీ చరిత్ర కెక్కడమే. భారత దేశ ఆర్థికరంగ బలోపేతానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మరో 20 ఏండ్లలో భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రపంచంలోనే అగ్ర దేశాల సరసన నిలవబోతున్నది. ప్రధానమంత్రి మోదీ అవలంబిస్తున్న జాతీయ, అంతర్జాతీయ విధానా లతో భవిష్యత్‌లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా అవతరించనున్నది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ, భారత్‌కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వ డానికి సహకరిస్తామని హామీ ఇచ్చాయి. భారత్, ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇదంతా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయమే. మోదీ దౌత్య విజయాలకు ప్రపంచ నేతలందరి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇవాళ నరేంద్ర మోదీ ప్రపంచ నాయకుడు అయ్యారు. అంతర్జాతీయ వేదికల మీద భారతదేశం విజయాలు మార్మోగుతున్నాయి.
సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని భావించిన బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ, కోట్లాది భారతీయుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దేశ ప్రజల ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా సమాజంలోని అన్ని వర్గాలకూ నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పథకాలను విజయవంతంగా అంది స్తున్నది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఒక విషయాన్ని మనమందరం గుర్తు చేసుకో వాల్సిన అవసరం ఉన్నది.
ఒకప్పుడు కశ్మీర్‌లో తిరగాలంటే ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఇవాళ కశ్మీర్ రోడ్ల మీద స్వేచ్ఛగా క్రికెట్ అడుకుంటున్నారు. ఈ దేశాన్ని 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పాలనకు, పదేండ్లుగా పాలిస్తున్న బీజేపీ పాలనకు తేడా అదే. అందుకే భారతమాత సేవలో తరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మిషన్ – 400 లక్ష్యానికి అండగా నిలవడం అనే విషయాన్ని అందరూ బాధ్యతగా భావించాల్సి ఉన్నది.
పి.ఎల్. శ్రీనివాస్
వ్యాసకర్త బీజేపీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment