నివాళి
ఉసాగా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడైన ఉ. సాంబశివరావు (1950 –2020) హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా వైరస్‌కు చికిత్స చేయించుకుంటూ శనివారం వేకువజామున కన్నుమూశారు. వేలాది మంది తన అభిమానులు, అనుయాయులకు కనీస సమాచారం తెలియకుండానే అయనను కోవిడ్–19 వైరస్ బలి తీసుకుంది. దళిత–బహుజన వర్గాలకు, ఆయన అభిమానులకు ఇది కచ్చితంగా అశనిపాతం లాంటి వార్తే అవుతుంది. తెనాలి సమీపంలోని కుగ్రామంలో ఒక నాయీబ్రాహ్మణ కుటుం బంలో పుట్టిన ఉసా 1960ల ప్రారంభంలో తెనాలి డిగ్రీ కాలేజీలో యువ విద్యార్థిగా ఉంటున్నప్పుడు హేతువాదిగా జీవితం ప్రారంభించారు. నక్సల్బరీ ఉద్యమం బద్దలయ్యాక ఉసా కమ్యూనిస్టు విప్లవ సిద్ధాంతం వైపు ఆకర్షితులై తరిమెల నాగిరెడ్డి పార్టీలో చేరారు.
బహుముఖ ప్రతిభాపాటవాలతో ఉసా సిద్ధాం తకారుడిగా, రచయితగా, గాయకుడిగా పరిణమిం చారు. సాయుధపోరాటం వైపు మొగ్గుచూపి తూర్పుగోదావరి జిల్లా కొండమొదలు గిరిజన విముక్తి పోరాటంలో పాల్గొనడానికి వెళ్లి 1980ల వరకు అక్కడే నివసించారు.
తెలంగాణలో ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో తీవ్రమైన కరువు వ్యాపించడంతో తాగునీరు, సాగునీరు సౌకర్యం కల్పించాలనే డిమాండుతో మోత్కూరు రైతులను సంఘటితం చేసేందుకు బాధ్యతలను చేపట్టారు. మోత్కూరులోనే అయిదేళ్లు నివసించిన ఉసా కులంతో పనిలేకుండా రైతు కుటుంబాల్లో ఒకరిగా కలిసిపోయారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక వ్యవసాయ సమస్యలపై వేలాదిమందిని కదిలించారు.
అదే సమయంలో 1985లో కారంచేడు దళితులపై హత్యాకాండ ఘటన జరిగింది. ఉసా శషభిషలు లేకుండా దళిత్ మహాసభ, దళిత ఉద్యమంవైపు నిలిచాడు. తనతో విభేదించిన యూసీసీఆర్‌ఐ (ఎమ్‌ఎల్) తర్వాత ఉసాను పార్టీనుంచి బహిష్కరించింది. ఉద్యమంలో తనతోపాటు పనిచేసిన సహచరితోపాటు బయటకు వచ్చిన ఉసా ఆనాటి నుంచి సామాజిక సంస్కరణల్లో, కుల వ్యతిరేక పోరాటాల్లో పాల్గొంటూ వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీపేట దళితులపై వేధింపు ఘటన చోటు చేసుకున్నప్పుడు కే.జీ. సత్యమూర్తితో కలిసి అక్కడి శిబిరంలో పాలుపంచుకున్నారు.
ఆ తర్వాత 1987–89 మధ్య కాలంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రత్యేకించి కృష్ణానది గట్టుపై ఉన్న గ్రామాల్లో కరువుబారిన పడిన ప్రజలకు సహాయం చేసే కృషిలో నాతో పాటు పనిచేశారు. ఆ గ్రామాల్లో తోటి కార్యకర్తలతో కలిసి రెండున్నర సంవత్సరాలు గడిపి ప్రజల బాగోగులు పట్టించుకున్నారు. ఈలోగా మండల్ ఉద్యమం పొడసూపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ప్రజలను కూడగట్టడంలో ఉసా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. కేజీ సత్యమూర్తి మావోయిస్టు పార్టీ నుంచి బయటకివచ్చాక ఇరువురూ కలిసి ‘ఎదురీత’ పత్రిక స్థాపించారు. అటు మార్క్సిజం, ఇటు అంబేడ్కరిజం రెండిం ట్లోనూ ఉసా కీలకమైన సిద్ధాంతవేత్తగా, గొప్ప వక్తగా పరిణమించారు. ఆయన రచనలు, ప్రసంగాలు మారోజు వీరన్న వంటి విప్లవోద్యమ కార్యకర్తలను సైతం ప్రభావితం చేశాయి. తెలంగాణ మలి దశ ఉద్యమం మొదలైంది. ఉసా ఆంధ్రప్రాంతంలో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ అనేక సమావేశాలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సీపీఎం మద్దతుతో ఏర్పడిన టి–మాస్, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్‌లో ఊసా భాగమయ్యారు.
కులాంతర వివాహాలకు ఉసా గొప్ప మద్దతుదారు. తాను స్వయంగా పార్టీలో పనిచేస్తున్న బ్రాహ్మణ కార్యకర్త పద్మను వివాహమాడారు. కొన్నేళ్ల క్రితం ఆమె చనిపోయారు. తమ ఏకైక కుమార్తెను చక్కగా చదివించారు. పార్టీనుంచి బయటకొచ్చాక పద్మ ఉద్యోగం చేయడం మొదలెట్టి సహచరుడికి మద్దతుగా నిలిచారు. సూరేపల్లి సుజాతతో కలిసి బహుజన సాంస్కృతిక సంస్థను ప్రారంభిం చిన ఊసా భావజాల ప్రచారం కోసం దేశి–దిశ అనే పేరిట యూట్యూబ్ చానల్ మొదలెట్టారు. కులపరమైన అత్యాచార ఘటనలు ఎక్కడ జరిగినా మొట్టమొదటగా అక్కడికి వెళ్లేవారు. స్వయంగా అనేక కులాంతర వివాహాలను జరిపించారు. మహిళల హక్కులు, సమానత్వం పట్ల తాను చూపిన నిబ ద్ధత సాటిలేనిది. పితృస్వామ్యం నుంచి మహిళ ఎలా విముక్తి చెందాలో చెబుతూ అనేక రచనలు చేశారు కూడా. గిరిజన ప్రాంతాల్లో కానీ, మోత్కూరు, కొల్హాపూర్ గ్రామాల్లో కానీ లేక దళిత్–బహుజన వాడల్లో వేధించబడిన ప్రతి ఒక్కరితోనూ ఆయన కలగలిసిపోయారు.
పూలే, అంబేడ్కరిజంపై అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. కాలేజీ రోజుల నుంచి రాయడం ప్రారంభించారు. హేతువాదం, సైన్స్, బుద్ధిజం పట్ల విశ్వాసం ఉన్నవాడిగా మూఢనమ్మకాలు, అజ్ఞానం పట్ల బద్ధవిరోధాన్ని ప్రకటించేవారు. తన రాజకీయ, సైద్ధాంతిక కార్యాచరణలో భాగంగా ఆయన అనేకమంది ప్రజల ఇళ్లలో గడిపారు. ఒక విప్లవకారుడిగా, మానవ హక్కుల సమర్థకుడిగా, కులవ్యతిరేక ఆదర్శవంతుడిగా, మార్క్స్, మహాత్మాపూలే, అంబేడ్కర్ అనుయాయిగా ఉసా వారసత్వం సాటిలేనిది. సామ్యవాద, శాస్త్రీయ సమాజాన్ని నిర్మించాలని కోరుకున్న వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని బలిగొంటున్న కొత్త వైరస్‌ని నిరోధించలేకపోతున్న, అభివృద్ధి చెందని వైద్యశాస్త్రం కారణంగా మనల్ని వదిలి వెళ్లిపోయారు. ప్రపంచ వైద్యశాస్త్రం కరోనా వైరస్‌ని నిర్మూలించిన రోజు మాత్రమే.. అన్నిరకాల సాంక్రమిక వ్యాధులపై శాస్త్ర విజ్ఞానం జయించడం సాధ్యమవుతుందని విశ్వసించిన ఉసా ఆకాంక్ష నెరవేరుతుంది. మానవ సమానత్వం కోసం అలుపులేని పోరాటం సాగించిన ఉసా రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన పాదముద్రలు వదిలి వెళ్ళారు.
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
Comments
Please login to add a commentAdd a comment