ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు 48 గంటల డెడ్‌లైన్ సవాల్ తమాషాగా ఉంది. సాధారణంగా ఎవరైనా తమకు ప్రభుత్వం చేసే పని నచ్చకపోతే దానికి అసమ్మతిగా నిరసన తెలుపుతారు. సవాళ్లు విసురుతారు. రాజీనామాలు చేస్తారు. ఉపఎన్నికలకు సిద్ధం అవుతారు. కానీ చిత్రంగా చంద్రబాబు మాత్రం ప్రభుత్వంలో ఉన్నవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఆయన కూడా రాజీనామా చేస్తారట. తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తారట. పైగా, మళ్లీ ఎన్నికలు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజీనామాలకు చాలా చరిత్ర ఉంది. 1950వ దశకంలో పలువురు నేతలు తాము పార్టీ మారినప్పుడు రాజీనామాలు చేశారు. పీవీజీ రాజు, తెన్నేటి విశ్వనా«థం వంటి ప్రముఖులు రాజీనామాలు చేయడానికి వెనుకాడలేదు. ఆ తర్వాత కాలంలో ‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో పెద్ద ఉద్యమం చెలరేగింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న సీపీఐ తది తర పార్టీల ఎమ్మెల్యేలు 1967 ఎన్నికలకు ముందు తమ పదవులు వదలుకున్నారు. అప్పటినుంచి జైఆంధ్ర ఉద్యమ సమయంలో కానీ, 1994లో కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో కానీ అనేకమంది నేతలు ఉద్యమ లక్ష్యాలకోసం పదవులకు రాజీనామా చేశారు. బోఫోర్స్ స్కామ్ సమయంలో నేషనల్ ్రçఫంట్ అధ్యక్షుడుగా ఉన్న ఎన్టీరామారావు దేశవ్యాప్తంగా వందకు పైగా ప్రతిపక్ష ఎంపీలతో రాజీనామా చేయించారు. ఇకపోతే, 2001లో టీఆర్‌ఎస్ స్థాపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుది ఇందులో ప్రత్యేక రికార్డు. సిద్ధిపేట ఎమ్మెల్యే పదవికి, కరీంనగర్ ఎంపీ పదవికి మరోసారి మంత్రి పదవికి వరుసగా రాజీనామాలు చేసి తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా రాజీనామా చేయించారు.
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ ఇద్దరూ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపిం చినప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలుపొందారు. వైసీపీలో చేరదలచిన 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఉప ఎన్నికలలో పోటీచేయించారు. ఇదంతా చరిత్ర. ఒక్క చంద్రబాబు హయాంలో మాత్రమే ఇలాంటి రాజీనామాలు జరగలేదు. ఇతరపార్టీల నుంచి వచ్చిన వారికి ఆయన టీడీపీ కండువాలు కప్పారు. కానీ వారితో రాజీనామాలు చేయించే ధైర్యం చేయలేదు. గత టర్మ్‌లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారితో రాజీనామా చేయించాలని, అనర్హత వేటు వేయాలని పలుమార్లు వైసీపీ డిమాండ్ చేసింది. వీటిలో దేనికీ చంద్రబాబు సిద్ధపడలేదు.
ఎవరైనా తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రాజీనామా అస్త్రం ప్రయోగిస్తారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరూ సాధారణంగా తమంతట తాముగా పదవులను వదులుకోవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు అమరావతి రాజధానిని మూడుగా విభజించి విశాఖపట్నం, కర్నూలుకు కూడా విస్తరిస్తున్న నేపధ్యంలో దానిని వ్యతిరేకిస్తూ చంద్రబాబు అసెంబ్లీ రద్దు డిమాండ్ చేశారు. అప్పుడు తాము కూడా ఎన్నికలకు సిద్ధం అని అంటున్నారు. చంద్రబాబు చెప్పే సిద్ధాంతమే కరెక్టు అయితే ఆయన ఎన్నిసార్లు అసెంబ్లీని రద్దు చేయాలి? ఉదాహరణకు 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు రేషన్ బియ్యం రేట్లు పెంచబోమని, మధ్యనిషేధం ఎత్తివేయబోమని, బీజేపీతో ఎట్టి పరిస్థితిలోనూ కలవబోమని చెప్పారు. కానీ వీటిలో ఏ ఒక్కదానిపైన నిలబడలేదు. మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. 1994 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ ఇచ్చిన ప్రధాన నినాదం మద్య నిషేధం. కానీ బాబు దానికి మంగళం పాడారు.
2014 ఎన్నికలకు ముందు మొత్తం రైతుల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. డ్వాక్రా రుణాలు మొత్తం రద్దు చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. వీటీలో ఏ విషయంలోనూ మాట నిలుపుకోలేదు. ఈ సందర్భాలలో ఎన్నడూ రాజీనామా ఊసే ఎత్తలేదు. ఎవరైనా రాజీనామా అడిగితే ఇంతెత్తున ఎగిరిపడేవారు. అలాంటి బాబు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లి అమరావతి నుంచి రాజధానిని మార్చుతానని ఎన్నికలకు ముందు చెప్పలేదు కనుక ఎన్నికలకు వెళ్లాలని అంటున్నారు. ఆయన గొప్పతనం ఏమిటంటే తాను ఎన్ని వాగ్దానాలను తుంగలో తొక్కినా అవేమీ జరగనట్లు నటించగలరు. సీఎం జగన్ మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలను తీసుకోవాలని జగన్ చెబితే, ప్రభుత్వ భూమి అన్న పదం వదలిపెట్టి వీడియో చూపిస్తారు. తమకు మద్దతు ఇచ్చే పత్రికలలో రాయిస్తారు. ఇది వారి నీతి. మరి లక్ష కోట్లు కావాలని కేంద్రాన్ని ఎందుకు అడిగారంటే చంద్రబాబు సమాధానం చెప్పరు. పైగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని కొత్త వాదన తెస్తారు. ముఖ్యమంత్రిగా ఉంటే తానే నాలుగైదు లక్షల కోట్లు ఉంటే కానీ రాజధాని నిర్మాణం జరగదని చెబుతారు. ప్రతిపక్షంలోకి రాగానే పైసా అక్కర్లేదని చెప్పగల నేర్పరితనం ఆయనకు మాత్రమే ఉంది.
నాలుగైదు లక్షల కోట్లా? లక్ష కోట్లా అన్నది పక్కన పెడితే, మొత్తం ఏపీ ప్రజల డబ్బంతా కొన్నేళ్లపాటు అమరావతిలో ఖర్చు చేయాలన్నది చంద్రబాబు సిద్దాంతంగా ఉంది. ఆ మాట చెప్పకుండా అమరావతి పూర్తి అయితే లక్ష నుంచి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చేదని చంద్రబాబు ఎంత దారుణంగా అబద్ధం చెబుతున్నారో చూడండి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆదాయం మొత్తం లక్షా పాతికవేల కోట్లు లేదు. అలాంటిది అడ్రస్ లేని అమరావతి లక్ష కోట్లు సంపాదించేదని చంద్రబాబు చెప్పగలుగుతున్నారంటే అబద్ధాలు ఆడడానికి ఆకాశమే హద్దు అని ఆయన రుజువు చేసుకుంటున్నారనిపిస్తుంది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెడితే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి? కర్నూలులో హైకోర్టు పెడితే వచ్చిన చిక్కేమిటి? ఇచ్ఛా పురం వాళ్లు కర్నూలు వెళ్లగలరా? కర్నూలు వారు విశాఖపట్నం రాగలరా? అని ఆయన అంటున్నారు. అసలు సామాన్యులకు రాజధానికి రావల్సిన అవసరం ఎంత ఉంటుంది? రాష్ట్ర విభజన జరగడానికి ముందు ఇచ్ఛాపురం నుంచి హైదరాబాద్‌కు ఎలా వచ్చారు? విభజన తర్వాత అనంతపురం, కర్నూలు వాళ్లు విజయవాడకు ఎలా వస్తున్నారు? 1953లోనే కర్నూలును రాజధానిగా అప్పటి ఆంధ్ర నేతలు ఎందుకు ఒప్పుకున్నారు? ప్రజలను మభ్యపెట్టే వాదనలతో జనాన్ని మాయ చేయాలని చంద్రబాబు యత్నం. లక్షల కోట్లు వ్యయం చేసి ఒకేచోట అభివృద్ధి చేయడమా? లేక ఆ డబ్బును ఆయా చోట్ల వెచ్చించి అన్ని ప్రాంతాలను సమానంగా చూడడమా? అన్నదే ఇక్కడ ప్రధాన సమస్య. అంతేకాదు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల ఆర్తి, ఆత్మగౌరవం కూడా ఇందులో ఇమిడి ఉంటాయన్నది అర్థం చేసుకోవాలి. అమరావతిలో ఎటూ అసెంబ్లీ ఉంటుంది. పైగా అక్కడ వ్యవసాయ లేదా ఇతర రంగాలకు చెందిన హబ్‌లు రావచ్చని అంటున్నారు. చరిత్రలో కొత్తగా నిర్మించిన నగరాలు ఏవీ సఫలం కాలేదు. పుత్రజయ, బ్రెసిలియా, మన దేశంలో గాంధీ నగర్, నయా రాయపూర్ ఇలా ఆయా చోట్ల అవి జనం లేక వెలవెలపోతున్నాయన్నది ఒక విశ్లేషణ.
అందులోనూ విజయవాడ, గుంటూరుల మధ్య పల్లెటూళ్లలో తలపెట్టిన బాబు కలల రాజధాని రియల్ ఎస్టేట్‌కు పనికి వచ్చిందేకాని, ప్రజల అవసరాలు తీర్చడానికి కాదన్నది పచ్చి నిజం. అయితే అదే సమయంలో అక్కడ భూములు ఇచ్చిన రైతులకు నష్టం లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. బాబు రాజీనామాల సవాళ్ల ప్రహసనానికి మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు ఘాటుగానే బదులు ఇచ్చారు. అమరావతి ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని.. కర్నూలు, విశాఖపట్నంలలో రాజధాని వికేంద్రీకరణ ప్రజలు వద్దని కోరుకుంటున్నారని బాబు విశ్వసిస్తుంటే ఆయన రాజీనామా చేసి సవాల్ విసరాలి. అలాగే పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఆ సవాళ్లలో ఆయన నెగ్గితే అప్పుడు తన వాదనకు కొంతైనా విలువ వస్తుంది. లేకుంటే ఆయనవన్నీ మేకపోతు గాంభీర్యం, విషయం లేని సవాళ్లేనని తేలిపోతుంది.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment