ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం మీడియాలో ఉంటారు. ఆ విషయంలో ఆయన చాకచక్యాన్ని ఒప్పుకోక తప్పదు. 2024 ఎన్నికలలో గెలవడానికి ముందు ఆయన ఏ కబుర్లు చెప్పారు?.. ఇప్పుడు ఏమి చేస్తున్నారు?.. అనేది తరచి చూస్తే గమ్మత్తుగా ఉంటుంది. విపక్షంలో ఉన్నప్పుడు రోజూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ మీడియా సమావేశాలు పెట్టేవారు. ఏదో ప్రజెంటేషన్ అంటూ తనదైన శైలిలో విమర్శలు చేసేవారు. అధికారంలోకి వచ్చినా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. అందుకే అసలు పని మానేసి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూ శ్వేతపత్రాల పేరుతో కధ నడిపిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం విద్యుత్ శ్వేత పత్రం విడుదల చేశారు. అసలు ఇక్కడ ఒక విషయం ప్రశ్నించాలి. గత ప్రభుత్వాన్ని ప్రజలు కాదని టీడీపీని ఎన్నుకున్న తర్వాత ఈ పత్రాల గోల దేనికి?. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలు, ఆరోపణలనే మళ్లీ గుప్పిస్తూ శ్వేతపత్రాలు ఇస్తే చంద్రబాబు సాధించేదేమి ఉంటుంది?. పోనీ అవన్నీ సత్యమైన విషయాలా అంటే అదేమీ కాదు.తన ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గిస్తుందనికాని, గతంలో తాను వ్యతిరేకించిన ట్రూ అప్ చార్జీలను తొలగిస్తామని, రద్దు చేస్తామని కాని చెప్పడం లేదు. పైగా తన గత హయాంలోని అప్పులు,నష్టాలు అన్నింటిని కలిపి జగన్ ఖాతాలో వేసి బదనాం చేస్తున్నారు.
జగన్ కొన్ని పీపీఏలను సమీక్షించాలని ప్రయత్నించినప్పుడు ఇంకేముంది.. అంతర్జాతీయంగా ఏపీకి నష్టం జరిగిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయా విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తానని అంటున్నారు. జగన్ ప్రభుత్వం పేదలపై వేసిన విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గిస్తారా ? అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఆ జర్నలిస్టు కూడా తెలుగుదేశం మద్దతుదారులాగానే అడిగారు. ఫర్వాలేదు. అయినా ఏదైనా పాజిటివ్ సమాధానం వస్తుందని అనుకున్నవారు ఆశ్చర్యపోయే జవాబును చంద్రబాబు ఇచ్చారు.
'పేదలపై ఇప్పటికే భారం పడిపోయింది. కొత్త టారిఫ్ వచ్చే మార్చికి అమలులోకి వస్తుంది. అప్పటికి ఏమి చేయాలో ఆలోచిస్తాం. ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు, ఆర్దిక ఇబ్బందులు ఉన్నాయి..." అని చంద్రబాబు సెలవిచ్చారు. ఇది తెలివిగా చెప్పారని అనుకోవచ్చు. కాని అంతిమంగా అర్ధం అవుతున్నది ఏమిటంటే వచ్చే మార్చిలో విద్యుత్ చార్జీలు పెంచే అవకాశం ఉందనే కదా! ట్రూఆప్ చార్జీలను రద్దు చేయబోమని చెబుతున్నట్లే కదా!
ప్రభుత్వం విష వలయంలో ఉందని ఆయన అంటున్నారు. ఆదాయం లేకపోతే బొగ్గు కూడా కొనలేని పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. మరి జగన్ టైమ్ లో మాత్రం డబ్బు అక్కర్లేకుండానే అన్ని జరిగిపోవాలన్నట్లు ప్రచారం చేశారు. ఆ రోజుల్లో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేయాలనే కదా టిడిపి, దానికి మద్దతు ఇచ్చే మీడియా అదనపు చార్జీలకు వ్యతిరేకంగా రచ్చ,రచ్చ చేసి ప్రజలలో విష బీజాలు నాటిందని అంటే కాదనగలరా!స్మార్ట్ మీటర్లను వ్యవసాయ మోటార్లకు జగన్ ప్రభుత్వం అమర్చితే రైతులకు ఉరి తాళ్లు వేస్తున్నారని చంద్రబాబు నానా యాగీ చేశారా?లేదా?. ఈనాడు మీడియా ఆ మీటర్లకు వ్యతిరేకంగా పచ్చి అబద్దాలు రాసిందా?లేదా?. ఇప్పుడు ఆ మీటర్లను తీసేస్తారా అని అడిగితే మాత్రం దానిపై పరిశీలన చేసి ముందుకు వెళ్లాలని అంటున్నారు. ఇప్పటికే మీటర్లు ఏర్పాటైనందున అవి వృధా కాకుండా ,ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పానెళ్లు అందచేసి రైతులు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే చూస్తాం! అని దాటవేత సమాధానం ఇచ్చారు.
పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల పేరుతో జగన్ ప్రభుత్వం అడ్డగోలుగాఆ భూములు ఇచ్చిందని మరో జర్నలిస్టు తన టిడిపి ఎజెండా ప్రకారం ప్రశ్న వేసినా, చంద్రబాబు మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా జవాబు ఇచ్చారినిపిస్తుంది. పీఎస్పి ప్రాజెక్టులలో విద్యుత్ బయటకు వెళ్లినా నష్టం లేదని ,మన వినియోగదారులపై భారం పడకపోతే చాలని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆయన చెప్పడం విశేషం. అంటే ఈ మేరకు జగన్ కృషిని ఒప్పుకున్నట్లే కదా!గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాకపోయినా విద్యుత్ వినియోగం పెరిగిందని చంద్రబాబు అనడం విశేషం.
ఏ రాష్ట్రంలో అయినా ప్రజల ఆర్ధిక స్థితిగతులు అంచనా వేయడానికి, అభివృద్దిని నమోదు చేయడానికి,పరిశ్రమల ప్రగతి తెలుసుకోవడానికి విద్యుత్ సగటు వినియోగం కూడా ఒక కొలమానం అవుతుంది.ఆ రకంగా చూస్తే జగన్ టైమ్ లో ఈ విషయంలో మంచి ప్రగతి సాధించినట్లే అవుతుంది కదా!కాకపోతే చంద్రబాబు ఆ మాట ఒప్పుకోలేరు. గతంలో అదానీ తదితర బడా కంపెనీలకు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిమిత్తం పెద్ద ఎత్తున భూములను జగన్ కేటాయించారంటూ తెలుగుదేశం మీడియా తప్పుడు ప్రచారం చేసేది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కనుక ఆయన ఆ ప్రాజెక్టులను రద్దు చేస్తారా?.. అంటే అదేమీ చేయరన్న సంకేతాలే వస్తున్నాయి. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా యూనిట్ 2.49 రూపాయలకు విద్యుత్ సరఫరా చేయడానికి జగన్ ప్రభుత్వం ఒప్పందం అయితే దానిపై ఎంతగా దారుణ అబద్దాలను టీడీపీ మీడియా ప్రచారం చేసింది తెలిసిందే. ఆ మీడియా మరి ఇంత దిగజారి రాస్తుందేమిటా అన్న బాధ కలిగినా ఏమి చేయలేని పరిస్థితి. ఆ విషయంలో కూడా చంద్రబాబు ఎక్కడా ఆ ఒప్పందాలను రద్దు చేయడానికి కమిట్ అవకపోవడం విశేషం.
ఆంద్రజ్యోతి మీడియా మాత్రం చంద్రబాబు కన్నా అతిగా స్పందిస్తూ జగన్ పాలనలో ఇంధన రంగం చిధ్రమైపోయిందని అసత్యాలను ప్రచారం చేసింది. ఒకపక్క కొత్తగా విద్యుత్ రాలేదని చెబుతారు. మరో పక్క సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా ఏడువేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు జగన్ ప్రభుత్వం ఒప్పందం అయిందని అంగీకరిస్తారు. ఈ మీడియా ఎంత నీచంగా రాసిందంటే జగన్ ప్రభుత్వం వల్ల 1.28 లక్షల కోట్ల భారం పడిందట. వాస్తవం ఏమిటంటే అందులో రాష్ట్ర విభజన టైమ్ కు డిస్కంలపై ఉన్న అప్పులు, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులు అన్ని కలిపి 86వేల కోట్ల రూపాయలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మరో 36వేల కోట్ల అప్పులు తీసుకుంది. కానీ, మొత్తం అప్పు అంతటిని జగన్ ప్రభుత్వంపై నెట్టేసి తాము అక్షర సత్యాలు రాశామని నిస్సిగ్గుగా టీడీపీ మీడియా రాసుకుంది.
తెలంగాణ విద్యుత్ బకాయిలను కూడా గత ప్రభుత్వంపై నెట్టడానికి మొహమాట పడలేదు.ప్రస్తుతం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నందున , వెంటనే బకాయిలు వసూలు చేయవచ్చు కదా.. ఆ మాట మాత్రం రాలేదు. తెలంగాణ ప్రభుత్వం వారే తమకే ఏపీ 24వేల కోట్ల బకాయి ఉందని కొత్త వాదన తెచ్చినా చంద్రబాబు కిమ్మనలేదు. అసలు ఇంతకీ విద్యుత్ రంగానికి సంబంధించి తన ప్రణాళిక ఏమిటో చెప్పకుండా ,ఉన్నవి,లేనివి కలిపి శ్వేతపత్రం పేరుతో జగన్ ప్రభుత్వంపై బురద చల్లడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు.
బహుశా ప్రజలపై భారం వేయడానికి ముందు జగన్ తప్పుల వల్లే ఈ పరిస్టితి ఏర్పడిందని అసత్య ప్రచారం చేయడమే లక్ష్యం అయి ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. ఆ తర్వాత తానేదో ఉద్దరిస్తున్నట్లు, బాగు చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తుంటారు. అంతే తప్ప తాను ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటీ అన్న విషయం గురించి మాత్రం ప్రస్తావించరు. అదే ఆయన గొప్పదనం. జనం ఓట్లు వేశారు కనుక ఇప్పుడు చంద్రబాబు ఏమి చేసినా భరించవలసిందే. ఆయన ఏమి చెప్పినా వినాల్సిందే. ఆ క్రమంలోనే ఈ నెల కూడా యధా ప్రకారం ట్రూ అప్ చార్జెస్ ను విద్యుత్ సంస్థలు బిల్లుల్లో వేసి వినియోగదారులకు పంపించాయని వార్తలు వచ్చాయి. వాటిని చచ్చినట్లు జనం కట్టక తప్పదు. దీనిపై టీడీపీ నేతలు మాట్లాడరు. జగన్ ప్రభుత్వం టైమ్ లో నానా యాగీ చేసిన టీడీపీ మీడియా కిక్కురుమనదు. ఇలాంటి టెక్నిక్స్ విషయంలో చంద్రబాబును మించినవారు ఎవరూ లేరన్నది వాస్తవం అని చెప్పాలి.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment