తాజ్‌మహల్ నిర్మాణం వెనుక గొప్ప కళాచాతుర్యం ఉన్నట్లే కొన్ని పేలవమైన కల్పనలూ ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అపురూపమైన నిర్మాణం జరగకుండా తాజ్‌మహల్‌ను నిర్మించిన వారి చేతులను షాజహాన్ నరికించాడన్నది మనం వింటూ వస్తున్న ఒక కల్పన. గత డిసెంబరులో ప్రధాని మోదీ వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్‌ను ప్రారంభించిన సందర్భంగా పారిశుధ్య కార్మికులపై పూలజల్లు కురిపించినప్పుడు... ‘నాటి రాజు షాజహాన్ కార్మికుల చేతులను నరికిస్తే.. నేటి రాజు నరేంద్ర మోదీ కార్మికులపై పూలవర్షం కురిపించారు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. అలా ఒక అవాస్తవానికి మళ్లీ పిలకలు బయల్దేరాయి.
తాజ్‌మహల్ నిర్మాణం ఎలా సాగిందనేది చేతిరాతతో అరబిక్ లిపిలో పొందుపరిచి ఉన్న సమాచారం ఆధారంగా అర్థమౌతుందని యునెస్కో పేర్కొంది. తాజ్ గోపుర సమాధి, లోపలి వెలుపలి భాగాలను నిర్మించడానికి తాపీ పనివాళ్లను, రాళ్లు చెక్కేవారిని, మణులను పొదిగేవారిని, చిత్రకారులను, శిల్పకళా నిపుణులను ఆ కాలంలోనే షాజహన్ తన మొత్తం సామ్రాజ్యం నుండి, ఇంకా.. మధ్య ఆసియా, ఇరాన్ నుండి రప్పించారు. తాజ్ మహల్ ఇండో–ఇస్లామిక్ నిర్మాణ శైలికి గొప్ప తార్కాణమని యునెస్కో కీర్తించింది. తాజ్ నిర్మాణ కార్మికులకు, కళాకారులకు ఇచ్చిన జీతభత్యాలు, నెలసరి వేతనాలలో షాజహాన్ గొప్ప ఉదారతను ప్రదర్శించినట్లు కూడా నాటి జమాఖర్చుల పుస్తకాలను బట్టి తెలుస్తోంది. ఉదా: రాళ్లను చెక్కే అటా ముహమ్మద్ అనే నిపుణుడికి నెలకు రూ.500 చెల్లించారు. ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా నుంచి వచ్చిన షాకీర్ ముహమ్మద్ అనే కట్టుబడి మేస్త్రి నెలకు రూ.400 అందుకున్నాడు. ముల్తాన్‌కు చెందిన తాపీ కార్మికుడు ముహమ్మద్ సజ్జాద్ నెలకు రూ. 590, లాహోర్ నుంచి వచ్చిన ముఖద్వార నిర్మాణ కార్మికుడు చిరంజీలాల్‌కు నెలకు రూ.800 ఇచ్చారు. వాళ్లకు ఇచ్చిన ఈ భారీ మొత్తాలను బట్టి వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో నిర్దిష్టమైన పనికి బాధ్యత వహించేవాళ్లనుకోవచ్చు. చెప్పి చేయించేవాళ్ల చేతులను కానీ, చెప్పింది చేసేవాళ్ల చేతులను కానీ షాజహాన్ నరికించారు అనడంలో ఆధారాల మాట అటుంచి, అసలు అర్థమే లేదు. (చదవండి: రాజ్యాంగ పీఠిక ఓ ప్రకటన!)
మేస్త్రీలు కాకుండా.. వాస్తుశిల్పులు, చేతిరాత నిపుణులు, నిర్వాహకులు కూడా నిర్మాణంలో పాల్పంచుకున్నారు. వాళ్ల గురించిన వివరాలూ రికార్డులలో ఉన్నాయి. ఇరాన్‌లోని షిరాజ్ ప్రాంతం నుంచి తన పెద్ద సోదరుడు అఫ్జల్‌ఖాన్‌తో కలిసి మొఘల్ ఆస్థానానికి వచ్చిన కాలిగ్రాఫర్ అమానత్ ఖాన్ ప్రత్యేక గౌరవ మర్యాదల్ని పొందారు. తాజ్ కుడ్యాలపై ఖురాన్ శాసనాలను అందంగా లిఖించే మహద్భాగ్యం అతడికి లభించింది. ముంతాజ్ సమాధిపై అతడు చెక్కిన అక్షర నగిషీలకు షాజహాన్ ముగ్ధుడై అతడికి ‘మాన్సాబ్’ అనే బిరుదును ప్రదానం చేశారు. భూమిపై హక్కులు సంక్రమింపజేసే అధికారిగా అది ప్రభువులిచ్చే బిరుదు. అమానత్ ఖాన్ తాజ్‌మహల్‌పై ఆరేళ్లు పనిచేశారు. సమాధి నగీషీ రాత 1638లో పూర్తయింది. ఆ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనిలో ఉన్నప్పుడే అతడి వ్యక్తిగత జీవితాన్ని విషాదం స్పృశించింది. లాహోర్‌లో ఉంటున్న అతడి సోదరుడు అఫ్జల్ ఖాన్ మరణించాడు. అమానత్ ఖాన్ తను సంపాదించినదంతా వెచ్చించి అఫ్జల్‌కు స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. సోదరుడి మరణం తర్వాత కూడా అమానత్ తిరిగి ఇరాన్ వెళ్లలేదనీ, తాజ్‌మహల్ ప్రధాన వాస్తుశిల్పి, తన ఆప్తమిత్రుడు అయిన ఉస్తాద్‌ఖాన్ అభ్యర్థన మేరకు ఇక్కడే ఉండిపోయారనీ డబ్లు్య.ఇ. బెగ్లే అనే చరిత్రకారుడు రాశారు. (క్లిక్: పుష్కరం కిందే యుద్ధ బీజాలు)
మొఘల్ చరిత్రలో అనేకమంది రూపకర్తలు, వాస్తుశిల్పులు ఎంతో ప్రాముఖ్యం పొందారు. వారిలో కొందరు తాజ్‌మహల్ నిర్మాణానికి పని చేశారు. ఇస్మాయిల్ అఫాండి టర్కీలోని ఒట్టోమన్‌ల కోసం గోపురాలను రూపొందించిన ఘనత కలవారు. ఖాజిమ్‌ఖాన్ లాహోర్‌కు చెందిన ఒక స్వర్ణకారుడు. తాజ్ సమాధి గోపురానికి కాంతులీనే తాపడం చేసినవారు. తాజ్‌మహల్ నిర్మాణంలో హస్తకళాకారులు, కార్మికులతో పాటు.. మేధాపరంగా వాస్తుశిల్పులు, సృజనశీలురు అందరూ కూడా షాజహాన్ అభిరుచికి, దార్శనికతకు తగ్గట్టుగా పని చేసి ఆయన నుంచి సత్కారాలు, బహుమానాలు పొందారే తప్ప చేతులు పోగొట్టుకోలేదు. ఎలాగో పుట్టి, ఎలాగో కొట్టుకు వస్తున్న వదంతి మాత్రమే అది. వదంతిని పునరావృతం చేయడం అంటే అజ్ఞానాన్నీ, చరిత్రపై అవగాహన లేమినీ ప్రదర్శించుకోవడమే.
– ఎం.సలీమ్ బేగ్
ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (జేకే) ముఖ్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment