
ఎం.వి. రమణారెడ్డి (1944 – 2021)
ఎం.వి. రమణారెడ్డి (1944–2021) అనారో గ్యంతో బాధపడుతూ మరణించారు. వైద్యుడిగా, రాయలసీమ వాదిగా, సాహితీవేత్తగా ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. 1969లో, పాతికేళ్ళ వయసులోనే ‘ప్రభంజనం’ పత్రికను ప్రారంభించి, మూడు నాలుగేళ్ళు నడిపారు. విరసంలో చేరి, ప్రథమ మహాసభలలో కార్యవర్గ సభ్యునిగా ఎన్నికై పని చేశారు. తర్వాత కాలంలో విరసం నుంచి దూరమై తనవైన కార్యకలాపాలను సాగించారు. తెలుగు దేశం, కాంగ్రెస్, వైసీపీ వంటి ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. రాయలసీమ విమోచనా సమితిని స్థాపించి, రాయలసీమ హక్కుల కోసం గళ మెత్తారు. ఆయనది బహుముఖమైన వ్యక్తిత్వం గనుక వేర్వేరు విషయాలు గుర్తుకువస్తాయి. ఆయన వాదనలతో అంగీకరించని వాళ్ళు సైతం ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలలోని మౌలికత్వాన్ని గుర్తిస్తారు.
రాజకీయ కృషి చేస్తూనే, సాహిత్య సృజనని నిరాఘాటంగా కొనసాగించారు. ‘ఆయుధం పట్టని యోధుడు’ అంటూ మార్టిన్ లూథర్‌కింగ్ గురించి రాసినా; చెరసాలలను ధిక్కరించి, నిర్బంధం నుంచి తప్పించుకు తీరాలన్న తపనతో పెనుగు లాడిన హెన్రీ షారియార్ ప్రసిద్ధ రచన ‘పాపి యాన్’ను ‘రెక్కలు చాచిన పంజరం’గా అనువాదం చేసినా; ఆయన సాహిత్య కృషి విలువైనది. మార్గరెట్ మిషెల్ ప్రఖ్యాత రచన ‘గాన్ విత్ ద విండ్’ నవలను ‘చివరకు మిగిలింది’ పేరుతో అనువదించి ప్రచురించారు. ఇవి కాక, రాయలసీమ కన్నీటి గాథ, తెలుగింటి వ్యాకరణం, తెలుగింటి కొచ్చిన ద్రౌపది, ప్రపంచ చరిత్ర వంటి స్వతంత్ర రచనలు ఆయన విలువైన సాహిత్య సృజనకు తార్కాణం.
అనువాదం కోసం ఎంచుకున్న పుస్తకాలు ఆయన అభిరుచికీ, వ్యక్తిత్వానికీ అద్దం పడతాయి. తిక్కన పద్యాలపైన, పదాలకి అర్థాల పైన చేసిన వ్యాఖ్యానాలు ఆయన పరిశీలనా శక్తికీ, పరిశోధనా పటిమకీ నిదర్శనంగా నిలబడతాయి. భాష పట్లా, రాయలసీమ కన్నీటి గాథల పట్లా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన లోతైన అవగాహననీ, ఆలోచనల విస్తృతినీ వెల్లడిస్తాయి. తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతూ కూడా నాలుగు సంపు టాల ప్రపంచ చరిత్ర పుస్తకం తేవాలన్న తాప త్రయం తన పట్టుదలకీ, ధీశక్తికీ సాక్ష్యమిస్తుంది.
మొత్తం మీద చూస్తే– రచయితగా, సాహిత్య వేత్తగా, రాజకీయవాదిగా మరొకరితో పోల్చలేని అరుదైన, విలక్షణమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. రాజకీయాల నుంచి సాహిత్యంలోకి మళ్ళినవారూ, సాహిత్య సృజనకర్తలుగా, రాజకీయవేత్తలుగా ఏక కాలంలో కొనసాగుతున్నవారూ చాలామందే ఉన్నారు. కాలక్రమంలో వారిలో సాహితీవేత్త పార్శ్వమో, రాజకీయవేత్త పార్శ్వమో ప్రధానంగా ముందుకొస్తుంది. రమణారెడ్డి గారిలో బహుశా రెండు పార్శా్వలనూ సమపాళ్లలో చూడవచ్చునేమో.
యూరప్ వికాస యుగపు ప్రతినిధుల గురించి చర్చిస్తూ ఎంగెల్స్ ఒక విలువైన పరిశీలన చేస్తాడు. మానవ జాతి చరిత్రలోనే అతిగొప్ప ప్రగతిశీల యుగంగా వెలుగొందిన ఆ కాలం– ఆలోచనలో, ఆశయాలలో, ఆవేశాలలో, వ్యక్తిత్వంలో, విశ్వజ నీనతలో, విజ్ఞానంలో మహా ప్రతిభావంతులని సృష్టించిందని అంటాడు. లియోనార్డో డా వించి, అల్బ్రెక్ట్ డూరర్, మాకియవెల్లి, మార్టిన్ లూథర్ వంటి వారిని ప్రస్తావిస్తూ, వ్యక్తులను ఒకే పార్శా్వ నికి పరిమితం చేసే శ్రమ విభజన ప్రభావానికి ఆనాటి ప్రతిభావంతులు ఇంకా లోబడలేదని చెబు తాడు. వైద్య వృత్తి నుంచి, రాజకీయాలు, సాహిత్య సృజన, విభిన్న ఆసక్తుల దాకా విస్తరించిన రమణా రెడ్డిని కూడా ఈ కోణం నుంచే అంచనా వేయా లేమో. తెలుగుసీమలోని రాజకీయ, సాహిత్య ఉద్య మాల వికాసంతో, ఉత్థాన పతనాలతో సన్నిహితంగా ముడిపడిన ఆయన ప్రస్థానాన్ని, తాను వేసిన విలక్షణమైన ముద్రనుంచి విడ దీసి చూడలేము.
– సుధా కిరణ్
ఈ–మెయిల్ : sukira2001@yahoo.com
Comments
Please login to add a commentAdd a comment