
తెనాలి: క్విట్ ఇండియా.. ప్రతి భారతీయుడి నోట వినిపించిన రణన్నినాదం.. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన మహోజ్వలిత పోరాటం..! చైతన్యానికి మారుపేరైన తెనాలిలో ఆనాడు ఉద్యమం తారాస్థాయికి చేరింది. పోలీసు కాల్పుల్లో ఏడుగురి పోరాటయోధుల బలిదానానికి దారితీసింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టిన మహోద్యమంగా మలుపుతిరిగింది.
గాంధీజీ పిలుపు మేరకు..
తెల్లదొరలను దేశం విడిచివెళ్లాలంటూ 1942లో గాంధీజీ ఇచ్చిన ‘క్విట్‌ఇండియా’ నినాదం మేరకు కాంగ్రెస్ వాదులు, విద్యార్థులు ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్నారు. ముంబై సమావేశంలో పాల్గొన్న ఆనాటి జిల్లా నేతలు కల్లూరి చంద్రమౌళి, వెలువోలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు, అవుతు సుబ్బారెడ్డి, శరణు రామస్వామి తెనాలి వచ్చారు. అగ్రశ్రేణి ఉద్యమ నేతల అరెస్టుతో నాటి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (వెర్రెయ్యగారి మేడ)లో కార్యకర్తలు సమావేశమై, మరుసటిరోజు ఆగస్టు 12న పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. కల్లూరి చంద్రమౌళి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నన్నపనేని వెంకట్రావు, కార్యదర్శి రావి అమ్మయ్య నేతృత్వంలో తెనాలి తాలూకా హైస్కూలు, భారత్ ట్యుటోరియల్ కాలేజి విద్యార్థులు సహా వేలాదిమంది బంద్‌లో పాల్గొన్నారు.
రైల్వేస్టేషను సమీపంలో తెరిచి ఉంచిన హోటల్‌లోని ఫర్నిచరు, సామగ్రిని బయటపడేశారు. రైల్వేస్టేషనులో పండ్లదుకాణం, హోటల్‌నూ మూయించారు. అక్కడే స్పెన్సరు క్యాంటిన్‌లోకి వెళ్లి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. నార్త్ క్యాబిన్ దగ్గర్లోని ఆయిల్ ట్యాంకరుకు నిప్పటించారు. రెండు వ్యాగన్లలోని షాహి డక్కన్ సిగరెట్ బండిల్స్‌ను ప్లాట్‌ఫాంపై వేసి తగులబెట్టారు. రైల్వేస్టేషన్‌కు మంటలు వ్యాపించాయి. అప్పుడే చైన్నె నుంచి వచ్చిన ప్యాసింజరు రైలులోంచి ప్రయాణికులను దించేసి, నాలుగు బోగీల్లో కిరోసిన్ పోసి నిప్పంటించారు.
అడ్డుకున్న బ్రిటిష్ కలెక్టర్, ఎస్పీ
రైల్వేస్టేషను నుంచి కొత్తపేటలోని సబ్‌ట్రెజరీ కార్యాలయానికి వెళ్తుండగా, ప్రస్తుత రణరంగ్ చౌక్ ప్రాంతంలో ప్రత్యేక బలగాలతో వచ్చిన బ్రిటిష్ కలెక్టర్, ఎస్పీలు, ఉద్యమకారులను నిలువరించారు. దీంతో ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. సమీపంలోని కట్టెల అడితీ నుంచి కట్టెలు పైకిలేచాయి. పోలీసులు కాల్పులకు తెగబడటంతో ఏడుగురు అమరులయ్యారు.
అంతర్జాతీయస్థాయిలో సంచలనం
ఈ పోరు అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన చర్చిల్, సింగపూర్‌లో ఉన్న నేతాజీ దృష్టికి వెళ్లింది. బెర్లిన్, టోక్యో రేడియోలు ప్రసారం చేశాయి. ఘటన తర్వాత తెనాలిలో పౌరజీవితం పోలీసుల దయాదాక్షిణ్యమైంది. నాయకులు, దేశభక్తులను అరెస్టుచేసి, కోర్టుల్లో శిక్షలు విధించారు. మొదటి ముద్దాయి రావి అమ్మయ్యను కడలూరు జైలుకు పంపారు. విద్యార్థుల కోసం తాలూకా హైస్కూలుకు వెళ్లిన పోలీసులను ప్రధానోపాధ్యాయుడు జొన్నలగడ్డ శివసుందరం అనుమతించలేదు. తెనాలి ప్రజలపై రూ.2 లక్షల సామూహిక జరిమానా విధించి, వసూలుకు నానా బాధలు పెట్టారు.
నేడు అమరవీరుల స్మరణ
రణరంగ్ చౌక్‌లో ఏటా ఆగస్టు 12న మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వీరసంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యవేక్షణలో జరగనున్న కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. అమర వీరులకు నివాళి అర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment