గుంటూరు మెడికల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కొందరు దళారులు తిష్టవేశారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని కొంత మంది ఉద్యోగులకు మాముళ్ల జబ్బు సోకింది. ఈ స్వార్థపరులు ప్రతి పనికి రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ కార్యాలయ పరువు మంటగలుపుతున్నారు. ఇప్పటికే ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ కోసం, కార్యాలయం పరిధిలోని వైద్యులు, వైద్య సిబ్బంది సర్వీస్ విషయాలకు రేట్లు ఫిక్స్ చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. తాజాగా అక్టోబర్ నెలలో విడుదల చేసిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు గాలం వేసి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేయటం చర్చనీయాంశంగా మారింది.
అక్టోబర్‌లో నోటిఫికేషన్....
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్‌లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అక్టోబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు–3, ఫార్మాసిస్టు ఉద్యోగాలు–11, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు –11, శానిటరీ అటెండర్ ఉద్యోగాలు –15 చొప్పున మొత్తం 40 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏడాదిగా నోటిఫికేషన్ లేకపోవడంతో ఇప్పుడు వేల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకుని, ఫోన్స్ కూడా చేయిస్తున్నారు. ఉద్యోగాలకు పోటీ పడేవారి సంఖ్య వేలల్లో ఉండటంతో కార్యాలయంలో కొంత మంది ఉద్యోగులు వారికి గాలం వేస్తున్నారు. కాంట్రాక్ట్, నాలుగవ తరగతి ఉద్యోగులు ఈ వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధి వద్ద పనిచేసే వ్యక్తి బంధువు ఉద్యోగానికి దరఖాస్తు చేయటంతో సదరు వ్యక్తికి రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం వస్తుందని దళారులు ఫోన్ చేసి చెప్పటంతో వారి దందా వెలుగులోకి వచ్చింది. గతంలో కార్యాలయంలో పనిచేసి ఇతర కార్యాలయాలకు పదోన్నతిపై వెళ్లినవారు, గతంలో ఉద్యోగాల సమయంలో వసూళ్లుకు పాల్పడిన ప్రైవేటు వ్యక్తులు సైతం నేడు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నిరుద్యోగులను నిలువునా ముంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment