No Headline
సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో ప్లాట్ కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఇదే అవకాశంగా రియల్టర్లు నగర శివారు ప్రాంతాల్లో లేఅవుట్లు ఇబ్బడి ముబ్బడిగా వేస్తున్నారు. దీనికి నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరి. చాలామంది రియల్టర్లు అనుమతి తీసుకోకుండానే లేఅవుట్లు వేస్తున్నారు. నగర పరిధిలో ఎక్కడైనా అనధికారిక లేఅవుట్ వేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు మాత్రం రియల్టర్ల నుంచి భారీ స్థాయిలో ముడుపులు తీసుకుంటున్నారు. దీంతో అనధికార లే అవుట్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాలైన నల్లపాడు, పలకలూరు, లాల్‌పురం, నంది వెలుగు రోడ్డు తదితర ప్రాంతాల్లో లే అవుట్స్ అధికంగా వెలుస్తున్నాయి. లేఅవుట్ వేయాలంటే సదరు ప్రాంతంలో ప్రతి వీధిలో 40 అడుగుల రోడ్డు ఉండాలి. (కొత్తగా వచ్చే ఆదేశాల్లో దీన్ని మార్పు చేసే అవకాశం ఉంది.) అదే విధంగా ఎకరం స్థలంలో అంటే 4,800 గజాల్లో పది శాతం అంటే.. 480 గజాలు పార్కు, ప్లే గ్రౌండ్, ఇతర ప్రజా ప్రయోజనాల కోసం వదిలిపెట్టాలి. మిగిలిన స్థలంలో ప్లాట్లు వేసి విక్రయించుకోవాలి. సెక్యూరిటీ డిపాజిట్ కింద చదరపు మీటర్‌కు రూ.3 వేల వంతున నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు లేఅవుట్‌లలో కరెంట్ స్తంభాలు, తీగలు, లైట్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. నాలుగున్నర ఎకరాల పైబడిన లే అవుట్‌కి అయితే ప్రత్యేకంగా రిజర్వాయర్‌ను నిర్మించాలి. కానీ నగరంలో ఏర్పాటు చేసే చాలా లేఅవుట్‌లలో ఎక్కడా ఈ నిబంధనల అమలు మచ్చుకై నా కనిపించదు. నగరంలో సుమారు వంద వరకు అనధికార లేఅవుట్‌లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
ఫిర్యాదులొస్తే ఫోజు..
అనధికార లేఅవుట్‌లపై ఫిర్యాదులు రానంత వరకు ఎటువంటి చర్యలు ఉండవు. ఫిర్యాదు చేస్తే.. టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీ సాయంతో సదరు లేఅవుట్‌కు వెళ్లి కాసేపు హడావుడి చేస్తారు. హద్దు రాళ్లు తొలగించి ఏదో పెద్ద పని చేశామని షో చేయడంలో వారు సిద్ధహస్తులనే చెప్పవచ్చు. ఫిర్యాదుదారుడికి ఆ లేఅవుట్‌ను ధ్వంసం చేసినట్లు ఫొటోలు చూపడం మామూలైంది. తిరిగి ఆ లేవుట్‌లో యథావిధిగా పనులు చేసుకోమని పట్టణ ప్రణాళిక అధికారులే సంబంధిత రియల్టర్‌కు చెప్పడం పరిపాటిగా మారింది. లేఅవుట్‌ను పూర్తిగా ధ్వంసం చేయకుండా.. ౖపైపెన ధ్వంసం చేసినందుకుగాకు రియల్టర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మామూళ్లతో చోద్యం చూస్తున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఫిర్యాదులు వస్తే స్పందించినట్లుగా నాటకాలు కొందరు ప్రజాప్రతినిధులకూ అందుతున్న వాటాలు ప్రైవేట్ వెంచర్లకూ జీఎంసీ ద్వారానే సకల వసతులు
రూ.10 లక్షలకు పైగానే వసూలు
నగర పరిధిలో ఏర్పాటయ్యే అనధికార లేఅవుట్‌లలో ఒక్కో దాని నుంచి రూ.10 లక్షలు, ఆపైనే పట్టణ ప్రణాళిక అధికారులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా వాటా వెళుతోందని సమాచారం. లేఅవుట్‌కి అన్ని మౌలిక వసతులు రియల్టర్ కల్పించాల్సి ఉండగా... అవేమీ కల్పించకుండానే ప్లాట్స్ విక్రయించడం.. కొనుగోలుదారులు తర్వాత నగరపాలక సంస్థకు వినతి పత్రాలు అందజేసి సౌకర్యాల కల్పనకు విజ్ఞప్తి చేయడం పరిపాటిగా మారింది. దాని ప్రకారం మౌలిక వసతులు కల్పించాలని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం షరా మమూలైంది. దీంతో ప్రైవేట్ వెంచర్లకు కూడా నగరపాలక సంస్థ ద్వారానే సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతిమంగా ప్రజాధనం ఇలా అధికారులు, ప్రజాప్రతినిధులు, రియల్టర్లు లూటీ చేస్తున్నారు. దీంతో పాటు 10 శాతం పార్కు తదితరాలకు కేటాయించాల్సిన స్థలాలను కూడా రియల్టర్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నెల 14న నందివెలుగు రోడ్డులో అనధికారిక లేఅవుట్‌గా గుర్తించి గుంటూరు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు జేసీబీతో రోడ్లు ధ్వంసం చేశారు. 16వ తేదీన అదే లేఅవుట్‌ను రోడ్డు రోలర్‌తో సరి చేయించారు.
ఇదీ.. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది నిర్వాకానికి మచ్చుతునక. లేఅవుట్‌ను ధ్వంసం చేయడం అంటే రెండు చోట్ల రోడ్డుపై చిన్న గుంతలు తీసి ఫొటోలు తీసుకుని మీడియాకు పంపడం... రెండో రోజు లేఅవుట్ వేసిన రియల్టర్ వద్ద డబ్బులు తీసుకుని మళ్లీ లేఅవుట్‌ను పునరుద్ధరించుకునేలా చూడటం వారికి పరిపాటిగా మారింది. ఈ ఒక్క సంఘటన చాలు టౌన్‌ప్లానింగ్ అఽధికారులు ఎంత లంచాల మత్తులో మునిగి తేలుతున్నారో అర్థం చేసుకోవడానికి!
Comments
Please login to add a commentAdd a comment