విద్యార్థుల కోసం వైఎస్సార్ సీపీ ఉద్యమ బాట
పట్నంబజారు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్ని చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థులను చదువులకు దూరం చేస్తోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. దీనికి నిరసనగా విద్యార్థుల కోసం ఉద్యమబాట పట్టనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి పోరుబాట చేపడుతున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ తలపెట్టిన ఫీజు పోరుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఇతర విద్యార్థి నేతలు, పార్టీ ముఖ్యులతో కలిసి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చిన్నా బత్తిన వినోద్ ఆధ్వర్యంలో శుక్రవారం బృందావన్ గార్డెన్స్‌లోని కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం చేయడం వల్ల వారు చదువులు ఆపాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని పర్యవసానం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా ఉందని చెప్పారు. పిల్లల ఫీజులకు డబ్బులు లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. 2018–19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పెట్టి పోయిన రూ.1,800 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా 2023–24లో ఎన్నికల కోడ్ కారణంగా ఏర్పడిన బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కకు తప్పుకోవడం సమంజసం కాదన్నారు. ఆ బకాయిలతో కలిపి, ఇప్పటి వరకు రూ.3,900 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిపారు. లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఇంకా జాప్యం చేయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఫీజు పోరును విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రూ.18 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి పథకాలు విజయవంతంగా అమలైన నిజం అందరికీ తెలిసిందేనన్నారు. ఏ ఏడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే ఏడాదిలో నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు. ప్రతి త్రైమాసికంలో నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన ఘనత వైఎస్ జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మందపాటి శేషగిరిరావు, బాలిరెడ్డి, సురసాని వెంకటరెడ్డి, మేకా రవి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బడే జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గురిశెట్టి రవి, గంటి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మస్తాన్, కరీం, రాజేష్, అజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శులు సాజిద్, కిరణ్, అరుణ్, వర్మ, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 5న ఫీజు పోరు గుంటూరులో పోస్టర్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment