తెనాలి జిల్లా వైద్యశాలలో విచారణ
తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరిపేందుకు సెకండరీ హెల్త్ విభాగ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి. రమేష్ కిషోర్ శుక్రవారం తెనాలి వచ్చారు. తల్లీపిల్లల వైద్యశాలలో ఆపరేషన్ చేసిన సీనియర్ వైద్యులు డాక్టర్ రాంబాబు, ఇతర వైద్యులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. జేడీ మాట్లాడుతూ మంగళగిరి మండలం యర్రబాలెంకు చెందిన గాజుల పావని ప్రసవం జరిగి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు ఈ నెల 24వ తేదీ వచ్చిందని తెలిపారు. పీపీ యూనిట్ సీనియర్ వైద్యులు డాక్టర్ రాంబాబు, మరో సర్జన్ డాక్టర్ సింహాచలం సహకారంతో ఆమెకు ఆపరేషన్ చేశారన్నారు. మరుసటి రోజు ఆమెకు కడుపులో ఉబ్బరం రావటంతో స్కానింగ్ చేసి లోపల ఇబ్బంది ఉండటంతో గుంటూరుకు రిఫర్ చేశారని చెప్పారు. ఆ తర్వాత ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించటంతో తెనాలి వచ్చినట్లు తెలిపారు. సాధారణంగా డెలివరీ జరిగిన వెంటనే ఆపరేషన్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావని, కొన్ని సంవత్సరాల తర్వాత అయితే సమస్యలు వస్తుంటాయని చెప్పారు. పీపీ యూనిట్ తమ పరిధిలోది కాదని, వైద్యశాల తమ పరిఽఽధిలో ఉండటంతో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. గుంటూరు వైద్యశాలలో కూడా దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ మజీదా బేగం, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించటంతో మహిళ మృతి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్యులను విచారించిన జేడీ
Comments
Please login to add a commentAdd a comment