ప్రలోభాల వైపు తమ్ముళ్ల ‘స్టాండింగ్’
సాక్షి ప్రతినిధి, గుంటూరు: అడ్డగోలు హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. తన నైజం మార్చుకోలేదు. అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకొంటున్న పచ్చ పార్టీ నాయకులు... గుంటూరులోనూ అదే బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వేదికగా తమ దుర్బుద్ధిని మరోసారి చాటుతున్నారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
గుంటూరు రాజకీయం వేడెక్కింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో కూటమి నాయకులు ప్రలోభాలకు తెరలేపారు. మెజారిటీ లేకపోయినా కౌన్సిల్‌పై పట్టు సాధించేందుకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలను పావుగా వాడుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా బేరాలు చేసి మరీ తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. స్థాయీ సంఘం ఎన్నిక మరో రెండు రోజుల్లో ఉండటంతో తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వైఎస్సార్ సీపీ చర్యలు చేపట్టింది. వారిని హైదరాబాద్‌కు తరలించింది. వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు మళ్లీ వెనక్కి వెళ్లిపోతారనే భయంతో తెలుగుదేశం పార్టీ కూడా క్యాంపునకు తరలించింది.
కమిషనర్‌ను అడ్డం పెట్టుకొని...
కౌన్సిల్‌పై పట్టు చేజిక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కడానికి సిద్ధమైన కూటమి నేతలు ఏకంగా మున్సిపల్ కమిషనర్‌ను అడ్డం పెట్టుకుని రంగంలోకి దిగారు. గత నెల 4వ తేదీన కమిషనర్ పులి శ్రీనివాసులు కౌన్సిల్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించి అర్ధాంతరంగా ఆగిపోయిన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని మేయర్ లేఖ రాస్తే సమావేశం పెట్టకుండా స్థాయీ సంఘం ఎన్నికల తేదీలను కమిషనర్ ప్రకటించారు. నిబంధనలను గాలికి వదిలేసిన అధికారికి ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. మరోవైపు స్థాయీ సంఘంలో తమకు ఏ మాత్రం స్థానాలు వచ్చే అవకాశం లేకపోయినా పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్‌లు రంగంలోకి దిగారు. తమ పరిధిలో ఉన్న కార్పొరేటర్లకు గాలం వేయడం మొదలుపెట్టారు. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారు. అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకువచ్చి వారి ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పి వస్తున్నారు. ఇలా వారం రోజుల్లోనే కొంతమందిని తమవైపు తిప్పుకున్నారు.
గుంటూరులో వేడెక్కిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వైఎస్సార్ సీపీ, కూటమి పార్టీల క్యాంప్ రాజకీయాలు కార్పొరేటర్ల కొనుగోలుకు తెరలేపిన కేంద్ర మంత్రి పెమ్మసాని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఎర వైసీపీ కార్పొరేటర్లను సంతలోపశువుల్లా కొంటున్న టీడీపీ: అంబటి
బలం లేకున్నా ప్రయత్నాలు
తమకు ఏ మాత్రం బలం లేకపోయినా అన్ని స్థానాలకూ కూటమి సభ్యులు నామినేషన్లు వేశారు. వైఎస్సార్ సీపీ నుంచి నామినేషన్లు వేసిన వారిని ప్రలోభాలకు గురిచేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కక్కిన కూడుకు ఆశ పడటం సరికాదని పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా కొనుగోళ్లకు దిగలేదని గుర్తు చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ నిస్సిగ్గుగా సమర్థించుకోవడమే కాకుండా, అదే రోజున ఒక కార్పొరేటర్‌కు కండువా కప్పి తమ పార్టీలో చేర్చుకున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లను కొనుగోలు చేసి గుంటూరు నగరపాలక సంస్థలో పాగా వేయడానికి కూటమి చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రజల్లో తీవ్ర నిరసస వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment