మంగళగిరి (తాడేపల్లి రూరల్): అసలు కరెన్సీకి డబుల్ దొంగ కరెన్సీ ఇస్తామని ఆశ చూపిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఘటన మంగళగిరి కాజ టోల్‌గేటు వద్ద గురువారం రాత్రి జరిగింది. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పేరేచర్లలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తికి చిత్తూరు జిల్లాలో ఓ మహిళ పరిచయమైంది. ఆమెతో నకిలీనోట్ల గురించి ప్రస్తావించాడు. రూ.15 లక్షలు అసలు నోట్లు ఇస్తే రెట్టింపు నకిలీనోట్లు ఇస్తామని ఆశ చూపించాడు. ఆ మహిళ ఈ విషయాన్ని తనకు తెలిసిన వాళ్లకు తెలియజేసింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన పగడాల జ్యోతి, వెంకటాచలం విశ్వనాఽథ్ దంపతులు ఆ మధ్యవర్తి ద్వారా డబ్బు ఇస్తానన్న వ్యక్తిని సంప్రదించారు. డబ్బులు తీసుకుని మంగళగిరి మండల పరిధిలోని కాజ టోల్‌గేటు వద్దకు రమ్మని ఆ వ్యక్తి చెప్పడంతో గురువారం రాత్రి 10.30 నిమిషాలకు పగడాల జ్యోతి, వెంకటాచలం విశ్వనాఽథ్‌లు రూ.15 లక్షల అసలు నోట్లను తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి మరో వ్యక్తితో పథకం ప్రకారం టోల్‌గేటు వద్ద వేచి ఉన్నాడు. అనంతరం ఆ దంపతుల దగ్గర నగదు తీసుకున్నాడు. రూ.30 లక్షల నకిలీ నోట్లను ఒక సూట్‌కేసులో పెట్టి ఇచ్చాడు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు పోలీసులు అంటూ హడావిడి చేసి అక్కడి నుండి పారిపొమ్మని ఆ దంపతులను హెచ్చరించాడు. ఆ దంపతులు భయపడి సూట్‌కేస్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లిన తరువాత సూట్‌కేస్ ఓపెన్ చేసి చూడగా నోట్ల కట్టలలో పైన కింద నోట్లు తప్ప మధ్యలో అన్నీ తెల్లకాగితాలు ఉండడం చూసి అవాక్కయ్యారు. బాధితులు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తామంటూ బురిడీ రూ.15 లక్షలు పోగొట్టుకున్న బాధితులు
Comments
Please login to add a commentAdd a comment