‘సాక్షి’ కథనంతో జెడ్పీ యంత్రాంగంలో కదలిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు అర్ధాకలితో తరగతులకు హాజరవుతున్న దుస్థితిని వెలుగులోకి తెస్తూ ‘‘పది చదువులు చిందర వందర’’ శీర్షికతో శుక్రవారం ‘‘సాక్షి’’లో ప్రచురించిన కథనం జెడ్పీ అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ హైస్కూళ్లలో చదువుతున్న 24,146 మంది విద్యార్థులకు నెలరోజుల పాటు అల్పాహారాన్ని అందించేందుకు జెడ్పీ నిధుల నుంచి రూ.54,32,850లను మంజూరు చేస్తూ జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు శుక్రవారం ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో విద్యార్థికి సాయంత్రం వేళలో అల్పాహారాన్ని అందించేందుకు రోజుకు రూ.7.50 చొప్పున కేటాయించారు. ఈ విధంగా గుంటూరులోని జిల్లాలోని 146 పాఠశాలల్లో చదువుతున్న 9,070 మందికి రూ.20,40,750, పల్నాడు జిల్లాలోని 183 హైస్కూళ్లలో 11,233 మందికి రూ.25,27,425, బాపట్ల జిల్లాలోని 79 హైస్కూళ్లలో 3,843 మందికి రూ.8,64,675 చొప్పున నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సంబంధిత నిధులను ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. జెడ్పీ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ – ఎడ్యుకేషన్ ఫండ్ నుంచి మంజూరు చేసిన నిధులకు మూడు జిల్లాల పరిధిలోని ఆయా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాలకు జమ చేయాలని డీఈవోలకు సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం రూపంలో అరటిపండ్లు, బ్రిటానియా, సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, కోడిగుడ్లు, వేరుశెనగ ఉండలు, గుగ్గిళ్లు (అలసందలు, పెసలు) వంటి తినుబండారాలను అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రెండు రోజుల్లో స్టడీ మెటీరియల్
‘‘పది చదువులు చిందర ‘వంద’ర ’’ శీర్షికతో శుక్రవారం ‘‘సాక్షి’’లో ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అంతకుముందు స్పందించారు. విద్యార్థులను టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీఈఆర్టీ నుంచి మోడల్ పేపర్లను తెప్పించి విద్యార్థులతో చదివిస్తున్నామని పేర్కొన్నారు. జెడ్పీ పాలకవర్గంతో సంప్రదింపులు జరిపిన పిదప ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేల మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్, అల్పాహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
టెన్త్ విద్యార్థులకు అల్పాహారానికి ఆగమేఘాలపై ఉత్తర్వులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 24,146 మంది విద్యార్థులకు లబ్ధి
Comments
Please login to add a commentAdd a comment