
ఉపాధ్యాయ సమస్యలపై నేడు ఫ్యాప్టో నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. మంగళవారం కంకరగుంటలోని ఎస్టీయూ భవన్‌లో జరిగిన గుంటూరు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు 30 శాతం ఐఆర్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ఆర్థిక బకాయిలు, జెడ్పీ పీఎఫ్ రుణాలు, ఏపీజీఎల్‌ఐ క్లోజర్స్, సరెండర్ లీవ్స్ నిధులు విడుదల చేయడంతో పాటు సీపీఎస్, జీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. కారుణ్య నియమకాలు తక్షణమే పూర్తి చేసి, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ కె. వీరాంజనేయులు, డెప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్‌రావు, డీకే సుబ్బారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ. వేళాంగిణి రాజు, పి.ప్రసాద్, జిల్లా నాయకులు ఎం.సాంబశివరావు, ఎంపీ సుబ్బారావు, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.