
పీఎఫ్ పనులపై వచ్చి ఉపాధ్యాయుడు మృతి
● గుంటూరులోని డీఈఓ కార్యాలయంలో కుప్పకూలిన ఉపాధ్యాయుడు చల్లా వెంకటరెడ్డి ● జూన్‌లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. ఇంతలోనే మృత్యువాత
గుంటూరు ఎడ్యుకేషన్: బోధన వృత్తిలో సుదీర్ఘ సేవలందించిన ఉపాధ్యాయుడు హఠాన్మరణం చెందారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న చల్లా వెంకటరెడ్డి (62) బుధవారం పీఎఫ్ క్లియరెన్స్, ఎన్‌ఓసీ కోసం గుంటూరు డీఈఓ కార్యాలయానికి వచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని విజిటర్స్ కుర్చీలో కూర్చుని ఉండగానే, తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన వెంట ఉన్న కుమారుడు ప్రసన్నాంజనేయులు రెడ్డితో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది హుటాహుటిన సమీపంలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తక్షణమే సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక రమేష్ ఆస్పత్రికి వచ్చి వెంకటరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆయన కుమారుడిని పరామర్శించి, అంబులెన్స్‌లో ఆయన స్వస్థలమైన పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి పంపారు. మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ పొంది, కుటుంబ సభ్యులతో కలసి శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఉపాధ్యాయుడు ఈ విధంగా హఠాన్మరణం చెందడంతో తోటి ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా పీఎఫ్ క్లియరెన్స్, ఎన్‌ఓసీ కోసం నరసరావుపేట డీఈఓ కార్యాలయానికి వెళ్లాల్సిన వెంకటరెడ్డి సరైన సమాచారం లేకపోవడంతో గుంటూరు డీఈఓ కార్యాలయానికి వచ్చి ఈ విధంగా మృతి చెందారు.