
మహబూబాబాద్: ‘నాటి, నేటి రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంది. నేటి రాజకీయం డబ్బుతో ముడి పడింది. నాడు 1994లో కేవలం రూ. 4 లక్షల లోపే ఖర్చు చేసి ఎమ్మెల్యేనయ్యా. అంత వరకు మానుకోట నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. ఆ కంచుకోటను ఢీకొట్టడానికి సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగిన నేను గెలుపొందానని’ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య అన్నారు. నాటి, నేటి ఎన్నికలకు తేడా, ఓటర్లు, ఇతరత్రా విషయాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
1994లో మానుకోట నుంచి ఎమ్మెల్యే గెలిచా..
1994లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తుల్లో భాగంగా మానుకోట సీటు సీపీఐకి కేటాయించారు. అయితే అప్పటికే ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడి నుంచి ఐదు సార్లు వరుసగా ఆ పార్టీ గెలుపొందింది. అయినా పార్టీని ఢీకొని గెలుపొందా. అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డిపై సుమారు 10 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచి ఆ కంచుకోటపై సీపీఐ జెండా ఎగురవేశా.
కేవలం రూ. 4 లక్షల ఖర్చుతోనే..
ప్రచార వాహనాలు, సమావేశాలు, వాల్ పోస్టర్లు, ఇతరత్రా అంశాలకు ఆ ఎన్నికల్లో కేవలం రూ. 4 లక్షలలోపే ఖర్చు అయింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడంతో పాటు ఎమ్మెల్యే కాక ముందు పేదల పక్షాన పోరాటాలు చేసి సుమారు 3వేల మంది పేదలకు ప్రభుత్వ స్థలాలు ఇప్పించా. నాడు పేదల సమస్యలపై చేసిన పోరాటాలు నన్ను గెలిపించాయి. ఆ ఎన్నికలు భూ స్వాములకు వ్యతిరేకంగా జరిగాయి.
గెలిచిన అనంతరం ఎంతో అభివృద్ధి..
ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మానుకోటకు వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేయించా. తండాలు, గ్రామాలకు రోడ్లు, ఇతరత్రా పనులు చేయించా. ప్రధానంగా ఆ సమయంలో హౌస్ కమిటీ ఏర్పాటు చేసి భూస్వాములు కబ్జా చేసిన 12వేల ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం. గూడూరు నుంచి చెన్నారావు పేట మండలం వరకు ఉన్న అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టా. లక్షల ఎకరాల భూమి కబ్జా కాకుండా చూశా. 70 మంది స్వాతంత్య్ర సమరయోధులకు న్యాయం చేశా.
నాడు ఆరు మండలాలు..
1994లో నియోజకవర్గ పరిధిలో ఆరు మండలాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో మానుకోట , కేసముద్రం, నెక్కొడ ఉండగా నెల్లికుదురు, గూడూరు, చెన్నారావు పేట మండలాల్లోని కొన్ని గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. హౌస్ కమిటీ ద్వారా భూముల స్వాధీనం, ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టినప్పుడు భూస్వాములు ఆ కమిటీ రద్దు చేస్తే రూ. 50 లక్షలు ఇస్తానన్నా ఎలాంటి ఆఫర్లకు లొంగకుండా పేదల కోసం పని చేశా. నేను గెలిచిన తర్వాత గడీల్లో జిలేడు మొక్కలు పెరిగాయి. గడీల రాజకీయాలకు చెక్ పడింది.
3 వేల ఓట్ల తేడాతో ఓటమి..
1989లో కూటమిలో భాగంగా సీపీఐ తరఫున పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి చేతిలో కేవలం 3వేల ఓట్ల తేడాతో ఓడిపోయా. నాడు టీడీపీ నాయకులు కొంత మంది తన గెలుపు కోసం పని చేయలేదు. వారు వెన్నుపోటు పొడిచారు.
నేటి రాజకీయంలో డబ్బే కీలకం..
నేడు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్థిక పరిస్థితిని ప్రధానంగా చూస్తున్నారు. ఎంత డబ్బు అయినా ఖర్చు చేసే వారికి టికెట్ ఇస్తున్నారు. దీంతో టికెట్ నుంచే డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓటర్లకు కూడా డబ్బు తీసుకోవడం అలవాటు చేశారు. అయినా ఓటర్లు తెలివిగల వారు. ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకుని ఆలోచించి ఓటు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment