
కష్టార్జితం.. పోతుందని..
వరంగల్ చౌరస్తా : తమ కష్టార్జితాన్ని బ్యాంక్ అధికారులు ఇతరులకు అడ్డగోలుగా విక్రయిస్తున్నారంటూ ఓ కుటుంబం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో మగ్గురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్ ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేపీఎన్ రోడ్డులో శనివారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చెల్లుపూరి హేమ్ కుమార్, ఆనంద్ కుమార్ అనే సోదరులు వ్యాపార అవసరాల నిమిత్తం జేపీఎన్ రోడ్‌లోని తమ ఇంటిని తనఖా పెట్టి యూనియన్ బ్యాంక్ కాజీపేట బ్రాంచ్ నుంచి సుమారు కోటికి పైగా రుణం తీసుకున్నారు.
వీరినుంచి బ్యాంకు లావాదేవీలు నిలిచిపోవడంతోపాటు రుణం గడువు ముగియడంతో బ్యాంక్ అధికారులు తనఖాలో ఉన్న ఇంటిని సంపత్ కుమార్ అనే వ్యక్తికి వేలంలో అమ్మకం జరిపారు. అమ్మకం జరిపిన ఆస్తిని సంపత్ కుమార్‌కు అప్పగించడం కోసం బ్యాంక్ అధికారులు శనివారం సంబంధిత భవనం వద్దకు చేరుకుకోగా, హేమ్ కుమార్, ఆనంద్ కుమార్‌ల కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నారు. తమ ఆస్తిని ఇతరులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు.
ఈ ఘటనలో ఆనంద్ కుమార్ (60), తేజశ్రీ (35) హేమ్ కుమార్ కోడలు ప్రశాంతి(32), ఆనంద్ కుమార్ అల్లుడికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. బాధితులు మాత్రం తమ కష్టార్జితం అడ్డగోలుగా అమ్మకానికి పెట్టడం వల్ల తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు యత్నించినట్లు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయమై బ్యాంకు అధికారులు మాట్లాడుతూ నిర్ణీతసమయంలో రుణం చెల్లించకపోవడంతో నిబంధనలు ప్రకారం వేలం వేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment