హన్మకొండ అర్బన్: జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 5,08,379 మంది ఓటర్లు ఉన్నారని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. తొలగింపులకు సంబంధించి నిర్ణీత దరఖాస్తు పూర్తి చేసి ఇస్తే పరిశీలించి తొలగిస్తారన్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు రావు అమరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్యాం, రజినీకాంత్, ప్రవీణ్ ఉన్నారు.
పలు ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ
కాజీపేట రూరల్: దక్షిణ మధ్య రైల్వే వివిధ సెక్షన్లలో అభివృద్ధి పనుల నేపథ్యంలో.. ఈనెల 13వ తేదీ నుంచి రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను యథావిధిగా ఈనెల 22వ తేదీ నుంచి నడిపిస్తున్నట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–డోర్నకల్ (67765) ప్యాసింజర్, డోర్నకల్–కాజీపేట (67766) ప్యాసింజర్, డోర్నకల్–విజయవాడ (67767) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) ప్యాసింజర్ రైళ్లు యథావిధిగా నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్‌లో
విద్యార్థుల ప్రతిభ
రామన్నపేట: సికింద్రాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్‌లో వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. గర్భిణుల ఆరోగ్యాన్ని సమగ్రంగా పర్యవేక్షించేందుకు రూపొందించిన ప్రత్యేక సెన్సార్ల సాయంతో బ్లడ్‌ప్రెజర్, బ్లడ్ షుగర్, హార్ట్ రేట్ వంటి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను నిరంతరం ట్రాక్ చేస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అలర్ట్ చేయబడే పరికరాన్ని ప్రదర్శించి (కృతిమ మేధస్సు) బహుమతిని గెలుపొందినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ప్రథమ బహుమతి సాధించిన విశాల్, రేవంత్, టి.శ్రీచరణ్, రఘువీర్, ప్రసాద షాహ్బాజ్, వర్షిత్‌రాజును ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అబినందించారు.
జిల్లాలో ఓటర్లు 5,08,379 మంది