సాక్షి, సిటీబ్యూరో: గతంలో నిమ్స్‌లోని ఓ రోగిపై ఎలుకల దాడి సంగతి.. తాజాగా నగరంలోని ఓ ప్రముఖ ఫుడ్ చైన్ అవుట్‌లెట్‌లో బాలుడిపై ఎలుక దాడి తెలిసిందే. ఆస్పత్రి సంగతి ఎలా ఉన్నా.. అత్యాధునికంగా, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ప్రముఖ రెస్టారెంట్‌లలోనూ ఇలాంటి సంఘటన జరగడం గమనార్హం. ఈ రకమైన ఎలుకల వీరంగానికి కరోనా లాక్‌డౌన్ కూడా కారణమంటున్నారు కొందరు నిపుణులు.
అరుదు కాదు..
ఎలుకలు కొరుకుతున్న ఘటనలు నగరంలో అరుదుగానో ఎప్పుడూ జరగని సంఘటనలుగానో తీసిపారేయడం కాదు, బహిరంగ ప్రదేశాల్లో జరిగినవి మాత్రమే బయటకు తెలుస్తున్నాయి కానీ... ఇప్పటికే నగరంలో ఎలుక కొరుకుడు పెద్ద సమస్యగా మారిన సంగతి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే 250కి పైగా ఎలుకలు కొరికిన కేసులు నమోదవడం దీనికి నిదర్శనం. గత పక్షం రోజుల్లో, ముగ్గురు ఎలుక కాటుకు గురయ్యారు. వీరిలో ఫుడ్ చైన్ అవుట్‌లెట్‌లో ఎనిమిదేళ్ల బాలుడితో పాటు కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు సైతం ఉన్నారు. ఒక పెద్ద ఎలుక బాలుడి ప్రైవేట్ భాగాలను కొరికితే, హాస్టల్‌లో నిద్రిస్తున్న మహిళల కాళ్లూ చేతుల్ని కొరికేశాయి.
లాక్ డౌన్.. ర్యాట్స్ అప్..
బహిరంగ చెత్త డంప్‌లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు ఆస్పత్రుల్లో పరిశుభ్రత లేకపోవడం ఎలుకల సంఖ్య భారీగా పెరగడానికి దోహదపడుతోంది. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాల్లో ఎలుకల వ్యాప్తికి లాక్‌డౌన్ దోహదం చేసింది. ఎలుకల విజృంభణకు సంబంధించి 80% కాల్స్ లాక్‌డౌన్ తర్వాతే పెరిగాయని క్రిట్టర్ డిఫెన్స్ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు రిత్విక్ కిషోర్ అన్నారు. మరోవైపు ఇతర మెట్రో నగరాల మాదిరిగా కాకుండా, హైదరాబాద్‌లో ఎలుకలు పందికొక్కులకు ప్రత్యేక నియంత్రణ విభాగం లేకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు.
ఓల్డ్ సిటీలో ఎక్కువగా..
● ఓల్డ్ సిటీలో కూడా ఎలుకల సమస్య బాగా పెరిగిందని నగరానికి చెందిన ఒక పెస్ట్ కంట్రోల్‌కు చెందిన కృష్ణ్ణ వరప్రసాద్ అంటున్నారు. ‘ఎలుకలు పెద్ద సంఖ్యలో నివసించే ప్రాంతాలలో మురుగు కాల్వలు చెత్త డంప్‌లు ప్రధానమైనవని, ముఖ్యంగా పాతబస్తీలో ఇలాంటి పరిస్థితులు బాగా ఎక్కువని అంటున్నారాయన. మూసీ సమీపంలోని అఫ్జల్‌గంజ్, ఆసిఫ్ నగర్, గోషామహల్ ఇతర పరిసర ప్రాంతాల నుంచి ఎలుకల గురించి ఫిర్యాదులు బాగా వస్తున్నాయి అని వరప్రసాద్ చెప్పారు.
తక్షణమే వైద్య సహాయం పొందాలి..
● ‘ఎవరికై నా ఎలుక కొరికిన తర్వాత జ్వరం వచ్చినట్లయితే తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. లేదంటే అది ప్రాణాంతకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌గా మారవచ్చు. టెటానస్ ఇంజెక్షన్ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి‘ అని జనరల్ సర్జన్ డాక్టర్ సాగర్ ప్రతాప్ చెప్పారు. ఎలుక కాటు అనేది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తప్ప మిగిలిన వారికి అంత ప్రమాదకరం ఏమీ కాదని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ చెప్పారు. రక్తం వచ్చే స్థాయిలో గాయం ఉన్నప్పుడు వెంటనే తగిన ప్రాథమిక చికిత్స, అవసరాన్ని బట్టి టీటీ ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment