సాక్షి, సిటీబ్యూరో: నిన్న వరకు పచ్చని పంట పొలాలు.. మామిడి, సపోటా.. జామ, గులాబీ, బంతి, చేమంతి ఇతర పూలు, పండ్ల తోటలతో కనువిందు చేసిన ఆ ప్రాంతంలో.. 111 జీఓ ఎత్తివేసి ఆంక్షలు తొలగించడం ద్వారా రాబోయే రోజుల్లో గెటెడ్ కమ్యూనిటీలు.. విల్లాలు.. విశాలమైన రోడ్లు, ఎత్తైన భవనాలతో రద్దీగా మారనుంది. ఇప్పటి వరకు పక్షుల కిలకిలారావాలకు.. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన ఆ పరిసరాలు ఇకపై వాహనాలు, పారిశ్రామిక రణఘొణ ధ్వనులతో మార్మోగనుంది.
స్వచ్ఛమైన గాలిని పంచిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ అలలు ఇకపై మురుగునీటి దుర్వాసనను వెదజల్లుతూ ముక్కుపుటాలను అదరగొట్టనున్నాయి. వాయు కాలుష్యంతో పగటి ఉష్ణోగ్రతల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లకపోయినా.. ఈ ప్రాంతాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వచ్ఛమైన గాలి, నీటి కోసమే..
జంటనగరాలకు తాగునీరు అందించేందుకు అప్పటి నిజాం ప్రభుత్వం నగరానికి పశ్చిమాన ఆరు టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను నిర్మించారు. నగరవాసులకు ఏళ్ల తరబడి ఈ నీళ్లే జీవనాధారంగా మారాయి. జనాభాతో పాటు నగర విసీ్త్రర్ణం, తాగునీటి అవసరాలు కూడా అనూహ్యంగా పెరగడంతో ప్రభుత్వం సింగూరు, ప్రాణహిత నదుల నుంచి తాగునీటిని తరలించారు.
ఆ తర్వాత ఇటు కృష్ణా, అటు గోదావరి నదుల నుంచి నీటిని తరలిస్తున్నారు. జంట జలాశయాల పరిరక్షణ కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో 111 జీఓను తీసుకొచ్చింది. జంట జలాశయాల చుట్టూ పది కిలోమీటర్లు.. 7 మండలాలు.. 84 గ్రామాల పరిధిలో సుమారు 1.32 లక్షల ఎకరాల భూమిని ఈ జీఓ పరిధిలోకి తీసుకొచ్చింది. పంటల సాగు మినహా ఇక్కడ ఎలాంటి వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించింది.
ఫలితంగా నీరు కలుషితం కాకుండా సమస్త ప్రాణి కోటికి జీవనాధారంగా మారింది. అంతేకాదు నగరానికి పై భాగంలో నిర్మించిన ఈ నదుల్లోని నీటి అలలపై వీచే స్వచ్ఛమైన, చల్లని గాలి ఆ పరిసర ప్రాంతాలను అహ్లాదంగా మార్చింది.
పండ్లు, పూల తోటలకు నెలవు..
జంట జలాశయాల చుట్టూ సారవంతమైన భూములు ఉండటంతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఇక్కడ భారీగా భూములు కొనుగోలు చేశారు. వీటి చుట్టూ ఫెన్సినింగ్‌లు, ప్రహరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఫాంహౌస్‌లు నిర్మించి వీకెండ్‌లో కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి సేదతీరే వారు. మిగిలిన ఖాళీ భూముల్లో పండ్లు, పూల తోటలు సాగు చేయించారు.
ఎటూ చూసినా ఎత్తైన చెట్లు కన్పించేవి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ. వర్షాలు సమృద్ధిగా కురిసేవి. వాతావరణ కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం 111 జీఓ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో పండ్లు, పూలు, కాయకూరల సాగుతో ఇప్పటి వరకు సిటిజన్ల అవసరాలు తీర్చిన ఈ ప్రాంతం.. భవిష్యత్తులో ఆ అవసరాలు తీర్చలేకపోచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమాన మరో కొత్త నగరం..
నగరానికి పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతం ఇటు బెంగళూరు హైవేకు.. అటు ముంబై హైవేలకు మధ్యలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఓఆర్‌ఆర్ ఉండటం పెట్టుబడిదారులకు కలిసి వచ్చే వచ్చే అంశం. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది.
వ్యాపార, వాణిజ్య సముదాయాలు, స్టార్ హోటళ్లు వెలవనున్నాయి. మొత్తంగా ఇక్కడ మరో కొత్త నగరం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. జీఓ కారణంగా ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయిన ఆయా గ్రామాలు ఇకపై మరో కొత్త నగరంలో అంతర్భాగమై అభివృద్ధిలో దూసుకుపోనున్నాయి.
వీరికి ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు
ప్రభుత్వం ఎత్తివేసిన జీఓ 111 ప్రాంతవాసులకు ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు లభించనున్నాయి. ఔటర్ అంచున ఉన్న మంచిరేవుల, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ, హిమాయత్‌సాగర్, కిస్మత్‌పురా, బుద్వేల్, రాజేంద్రనగర్, కొత్వాల్‌గూడ, రాళ్లగూడ, తొండుపల్లి, శంషాబాద్, చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ, తదితర ప్రాంతాలకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మెట్రో సదుపాయంతో జీఓ 111 ప్రాంతానికి చెందిన ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి రాయదుర్గం, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్‌లు.. ఇలా ఎక్కడికై నా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉన్నట్లుగానే శంషాబాద్ నుంచి రాయదుర్గం వరకు ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment