నుజ్జునుజ్జయిన కారు
మొయినాబాద్: అసలే రాంగ్‌రూట్.. ఆపై అతివేగం.. ఒకరి మృతికి కారణమైంది. లారీని కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మీరాలం మండికి చెందిన ఎండీ ఉబేద్ (24), కార్వాన్ టప్పాచబుత్రా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా, ఎండీ ఇస్మాయిల్, ఇబ్రహీం, నహీమ్ స్నేహితులు. వీరంతా సోమవారం రాత్రి కారులో మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి శివారులో ఉన్న ఓ ఫాంహౌస్‌కు వచ్చారు.
రాత్రి అక్కడ గడిపారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు నగరానికి వెళ్లేందుకు కారులో బయలు దేరారు. మొయినాబాద్ సమీపంలోని తాజ్‌హోటల్ వద్ద రాంగ్‌రూట్లో అతివేగంగా వెళుతున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారు ఇంజిన్ ఎగిరి దూరంగా పడిపోయింది. అయిదుగురు యువకులు కారు లోనే ఇరుక్కుపోయారు. ఉబేద్ అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఔటర్‌పై రోడ్డు ప్రమాదం ఒకరి మృతి.. ఏడుగురికి గాయాలు
మణికొండ: అతివేగంతో ఓ వాహనం అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్డుపై పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడుగురికి గాయాలయ్యాయి. నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ లేబర్ క్యాంప్‌లో ఉంటున్న 8 మంది కూలీలు గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్‌లో డెకరేషన్ పనులు చేస్తున్నారు.
రోజు మాదిరిగానే అజీజ్‌నగర్ నుంచి డెకరేషన్ వస్తువులను తీసుకుని టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. వాహనం అతివేగంగా వెళుతూ ఔటర్ రింగ్ రోడ్డు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఇందులో ఉన్న వారందరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. బర్దన్ (38) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు గాయాల పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment