సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రేపు ఉదయం 8 వరకు కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం రెండు లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది.
జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వాటర్ బోర్డు, పోలీస్, మత్స్య, విద్యుత్ తదితర శాఖల ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడేళ్ల విరామానంతరం ప్రారంభం కానున్న చేప ప్రసాదానికి ఒక రోజు ముందుగానే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది గురువారమే తరలిరావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసింది. వీరికి పలు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు కల్పించాయి.
వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇందుకోసం 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. బత్తిని కుటుంబాలకు చెందిన దాదాపు 250 మందితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల వారు కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ 6 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూం ఏర్పాటు..
ప్రజల సౌకర్యార్థం పోలీసులు ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వేలాది మంది జనం రావడంతో వారికి ఇబ్బంది కలగకుండా కంట్రోల్ రూంలు పోలీస్ శాఖ అంత సమాచారాన్ని ఇవ్వనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి.
చదవండి: మృగశిర ఎఫెక్ట్.. కొర్రమీను@ 650
ట్రాఫిక్ మళ్లింపు..
పాత బస్తీ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చే వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా శుక్రవారం దారిమళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ కోటేశ్వర్‌రావు, ఇన్‌స్పెక్టర్ గురునాథ్‌లు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ దారిమళ్లింపుపై గురువారం పర్యవేక్షణ జరిపి పరిస్థితులను సమీక్షించారు. ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
స్వచ్ఛంద సంస్థల చేయూత
నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు చేయూత అందించనున్నాయి. చేప ప్రసాదానికి వచ్చే ప్రజలకు అల్పాహారాలు, భోజనాలు, తాగునీరు, మజ్జిగను పంపిణీ చేస్తున్నాయి. ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా 4 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment