హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజికారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న ఖరీదైన మద్యం సీసాలతో పాటు నగదు తస్కరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో ఉంటున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ తన ఇంటి ముందు టీఎస్ 09 ఈసీ 3033 నెంబర్ బెంజి కారును పార్కింగ్ చేశాడు.
శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి కారు అద్దాలు ధ్వంసమై ఉన్నాయి. అందులో ఉండాల్సిన 11 రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు(ఒక్క బాటిల్ ధర రూ. 28 వేలు), రూ. 50 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు డయల్ 100కు ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బెంజి కారు వెనుకాల అద్దం పగలగొట్టిన ఆగంతకులు డిక్కీలో ఉన్న మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద అనుమతి లేకుండా ఆరు కంటే ఎక్కువ మద్యం సీసాలు ఉండకూడదు. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో 11 మద్యం సీసాలు ఎందుకు ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేసినప్పుడు 11 సీసాలు చోరీకి గురైనట్లు చెప్పగా ఫిర్యాదులో మాత్రం ఐదు బాటిళ్లు చోరీ అయ్యాయంటూ మాట మార్చిన విషయాన్ని పోలీసులు గమనించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment