హైదరాబాద్: సామాజిక మాద్యమాల్లో ఈ మధ్య సోషల్ సెలబ్రిటీగా మారిన సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా చలనచిత్ర రంగంలోకి అడుగిడుతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ.. స్వయంగా సితారనే స్పందించింది. భవిష్యత్‌లో తాను సినిమాల్లో నటిస్తానని, సినిమా రంగంలో తనకూ ఆసక్తి ఉందని తెలిపింది. తాజాగా సితార నటించిన పీఎంజే జ్యువెల్స్ యాడ్ షార్ట్ ఫిల్మ్ ‘ప్రిన్సెస్’ ప్రివ్యూను శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సితార తన తల్లి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి హాజరైంది.
షార్ట్ ఫిల్మ్‌తో పాటు సితార కలెక్షన్స్‌తో రూపొందించిన లుక్ బుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ... వాణిజ్య ప్రకటనలో నటించడంతో వచ్చిన తన తొలి పారితోషికాన్ని చారిటీ కోసం ఖర్చు చేశానంది. అమ్మ– నాన్న.. తనతో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటారని, ఏ విషయమైనా వారితోనే పంచుకుంటానని సంతోషాన్ని వ్యక్తం చేసింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్ వేదికపై పీఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో సితార సిగ్నెచర్ కలెక్షన్స్ ప్రారంభించడం పట్ల తన తండ్రి మహేష్ బాబు ఎంతో సంతోషంగా ఉన్నారని, తన అమితమైన ఆనందాన్ని స్వయంగా చూశానని సితార తెలిపింది.
మహేష్ భావోద్వేగానికి గురయ్యారు..
సితార యాడ్ ఫిల్మ్ చూసినప్పుడు మహేష్‌బాబు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారని నమ్రతా శిరోద్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ‘మీ తనయుడు గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు’ అని నమ్రతను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. గౌతమ్ ప్రస్తుతం తన చదువుపై ఆసక్తిగా ఉన్నాడని, ఆరేడేళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తాడని పేర్కొన్నారు.
కేవలం కొన్ని అంశాలను పరిగణించి సినిమా రంగాన్ని కొందరు చెడుగా చూస్తారు.. కానీ సినిమా రంగం చాలా ఉన్నతమైనదని, ఎంతో మందికి గొప్ప వేదిక అని నమ్రత వివరించారు. శౌర్య పరువు దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ని పీఎంజే జ్యువెల్స్ అధికారికంగా ఈ నెల 19న విడుదల చేయనున్నామని జ్యువెల్స్ ప్రిన్సిపల్ డిజైనర్ డైరెక్టర్ దినేష్ జైన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ రక్షిత జైన్, నిమేష్, కిరణ్, సీమ, శిల్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment