సనత్‌నగర్: ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మెట్రోరైల్ మార్గాలను మరింతగా విస్తరిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బేగంపేటలోని మెట్రో భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఫేజ్–2లో చేపట్టే బీహెచ్‌ఈఎల్–లక్డీకాపూల్, నాగోల్–ఎల్బీనగర్ మార్గాలతో పాటు ఫేజ్–3లో 278 కిలోమీటర్ల మేర చేపట్టే మెట్రో రైల్ నిర్మాణానికి రూ.69,100 కోట్ల అంచనా వ్యయాన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు.
ఫేజ్–3 పార్ట్–ఏలో రెండుచోట్ల డబుల్ ఎలివేటెట్ ఫ్లైఓవర్లు
ఫేజ్–3 పార్ట్–ఏలో భాగంగా జూబ్లీ బస్టాండ్ నుంచి తూముకుంట వరకు సాగే మార్గం, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్ హైవేలోని కండ్లకోయ వరకు సాగే మెట్రో మార్గాల్లో డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు రానున్నాయి. ఈ ఫేజ్‌లోనే బీహెచ్‌ఈఎల్–పటాన్‌చెరు–ఓఆర్‌ఆర్ దాటుకుని ఇస్నాపూర్ వరకు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, శంషాబాద్ ఎన్‌హెచ్ మెట్రో–కొత్తూరు–షాద్‌నగర్ వరకు, ఉప్పల్–ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్–బీబీనగర్ వరకు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్–తుక్కుగూడ ఓఆర్‌ఆర్–మహేశ్వరం క్రాస్‌రోడ్డు– కందుకూర్ వరకు, తార్నాక–ఈసీఐఎల్ మార్గంలో మొత్తం 142 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ మార్గాన్ని నిర్మించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
జాతీయ రహదారులను కలుపుతూ..
ఫేజ్–3 పార్ట్–బీలో చేపట్టే కారిడార్లు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మించాలని అధికారులు కసరత్తు చేసి ఆ దిశగా ప్రణాళిక రూపొందించారు. ఎన్‌హెచ్–44లోని ఓఆర్‌ఆర్ శంషాబాద్ జంక్షన్–తుక్కుగూడ జంక్షన్–బొంగులూరు జంక్షన్ మీదుగా ఎన్‌హెచ్–65లోని పెద్ద అంబర్‌పేట జంక్షన్ వరకు, ఎన్‌హెచ్ 65లోని ఓఆర్‌ఆర్ పెద్ద అంబర్ జంక్షన్–ఘట్‌కేసర్, శామీర్‌పేట, ఎన్‌హెచ్ 44 లోని మేడ్చల్ జంక్షన్ల వరకు, ఓఆర్‌ఆర్ మేడ్చల్ జంక్షన్–దుండిగల్ జంక్షన్–ఎన్‌హెచ్ 65లోని పటాన్‌చెరు వరకు, పటాన్‌చెరు జంక్షన్ నుంచి కోకాపేట జంక్షన్ మీదుగా నార్సింగ్ జంక్షన్ వరకు మొత్తం నాలుగు కారిడార్లలో 136 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం జరగనున్నట్లు ఆయన వివరించారు.
ఓఆర్‌ఆర్ చుట్టూ ఏడు ఇంటర్‌చేంజ్ మెట్రోస్టేషన్లు..
ఓఆర్‌ఆర్ చుట్టూ ఏడు ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ల నిర్మాణం జరగనున్నాయి. పటాన్‌చెరు, నార్సింగ్, శంషాబాద్ జంక్షన్లు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, పెద్ద అంబర్‌పేట జంక్షన్ వద్ద, ఘట్‌కేసర్ మేడ్చెల్ జంక్షన్ వద్ద ఇంటర్‌చేంజ్ మెట్రోస్టేషన్లు రానున్నాయి. వీటితో పాటు బయోడైవర్సిటీ పార్కు వద్ద కూడా ఇంటర్‌చేంజ్ జంక్షన్ రానుందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment