హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అర్హులైన ఓటర్లు తమ పేరును జాబితాలో ఉందో లేదో చూసుకోవాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. తప్పులు, పొరపాట్లకు తావు లేకుండా ఓటరు జాబితా సరిగా ఉండేందుకు నగరవాసులు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని పనులూ చేస్తున్నప్పటికీ, ఓటర్ల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకోవాలని, పేరు ఉన్నప్పటికీ ఏవైనా పొరపాట్లుంటే వాటిని సవరించుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్ ద్వారా వెసులుబాటు కల్పించిందని తెలిపారు. సంబంధిత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రోనాల్డ్ రాస్ కోరారు.
దేని కోసం.. ఏ ఫారం
ఓటరు పేరులోని అక్షరాల్లో (స్పెల్లింగ్స్) ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే.. పేరు తప్పుగా ఉన్నా, కుటుంబ సభ్యుల పేర్లు, రిలేషన్, జెండర్‌లకు సంబంధించి పొరపాట్లు ఉన్నా.. పుట్టిన తేదీ, చిరునామా తప్పుగా ఉంటే.. ఒకే కుటుంబంలోని వారి పేర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉంటే.. ఫోన్‌నంబర్ మార్చుకోవాలనుకుంటే.. ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇదివరకు ఓటరు జాబితాలో పేరు ఉండి గతంలో ఓటేసి ఉన్నప్పటికీ, ఇప్పుడు జాబితాలో పేరు లేకపోయినా, తమ ఫొటో బదులు వేరే ఫొటో ఉన్నా, ఇప్పటి వరకు అసలు నమోదు చేసుకోకపోయినా ఫారం– 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పాత ఎపిక్ (ఓటరు గుర్తింపు కార్డు) ఉన్నప్పటికీ ఇప్పుడు జాబితాలో పేరు లేనివారు ఓటు వేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అలాంటి వారు సైతం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
www.voters.eci.gov.in లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా సంబంధిత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నమోదు సందర్భంగా అవసరమైన సహాయం కోసం ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950ను కార్యాలయ పని వేళల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంప్రదించవచ్చని రోనాల్డ్ రాస్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment