రాయదుర్గం మెట్రో భూమి తాకట్టు | - | Sakshi
Sakshi News home page

రాయదుర్గం మెట్రో భూమి తాకట్టు

Published Fri, Aug 18 2023 4:00 AM | Last Updated on Fri, Aug 18 2023 6:52 AM

- - Sakshi

హైదరాబాద్​​​​​​​: రాయదుర్గం మెట్రో స్టేషన్‌ సమీపంలో ఉన్న అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో తాకట్టుపెట్టింది. ఈమేరకు రాఫర్టీ డెవలప్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు సబ్‌లైసెన్స్‌ హక్కులను కల్పించింది. ఎల్‌అండ్‌టీకి లీజు గడువు ఉన్నంత కాలం తాకట్టు కొనసాగనుంది. మరోవైపు ఈ భూమిని విక్రయించలేదని, అది ప్రభుత్వ అధీనంలోనే ఉందని, సబ్‌లైసెన్సింగ్‌ హక్కులను కల్పిస్తూ తాము తాకట్టు మాత్రమే పెట్టినట్లు ఎల్‌అండ్‌టీ వెల్లడించింది.

సబ్‌లైసెన్సింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని ఆమోదాలు పొందాల్సి ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అవసరమైన అన్ని ఆమోదాలను పొందిన తర్వాత లావాదేవీల విలువ ఖరారవుతుందని చెప్పారు. ఈ మేరకు ఈజీఎంలోని షేర్‌హోల్డర్ల ఆమోదం పొందిన తర్వాత బీఎస్‌ఈకి సైతం తెలియజేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు రాయదుర్గం మెట్రోస్టేషన్‌ పక్కనే అత్యంత విలువైన ఈ స్థలంలో ఒక వాణిజ్య భవనం కూడా ఉంది. దీనిపై సబ్‌లైసెన్సు హక్కులను కల్పిస్తూ మానిటైజ్‌ చేయడం ద్వారా ఎల్‌అండ్‌టీ మెట్రోకు పెద్ద మొత్తంలోనే ఆదాయం లభించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాఫర్టీతో పాటు బ్రూక్‌ఫీల్డ్‌, రహేజా కార్పొరేషన్లు కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. మెట్రో రైలు అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ విలువైన స్థలాన్ని ఎల్‌అండ్‌టీకి 33 ఏళ్ల లీజు రాసిచ్చిన విషయం తెలిసిందే. ఈ లీజు ఒప్పందం మేరకు రాయదుర్గంలోని పదిహేను ఎకరాల వాణిజ్య స్థలంలో 9 ఎకరాల్లో సుమారు రూ.200 కోట్లతో వాణిజ్య భవనాన్ని నిర్మించారు. ఈ భవనంతో పాటు మొత్తం స్థలాన్ని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ తాకట్టు పెట్టడం గమనార్హం.

నష్టాల నుంచి గట్టెక్కేందుకు..
► ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో ఎల్‌అండ్‌టీ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ప్రస్తుతం దాదాపు రూ.3500 కోట్ల వరకు నష్టాలు ఉన్నట్లు అంచనా. ఎలాంటి నష్టం లేకుండా మెట్రో రైళ్లు నడిపేందుకు నగరంలో ప్రతి రోజు కనీసం 16 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకోవాలి. కానీ ప్రస్తుతం 5.10 లక్షల మంది ప్రయాణికులు మెట్రోల్లో రాకపోకలు సాగిస్తున్నారు.

మరోవైపు కోవిడ్‌ ఆ సంస్థను మరింత దారుణంగా దెబ్బతీసింది. కోవిడ్‌ అనంతరం క్రమంగా కోలుకున్నప్పటికీ ప్రయాణికుల టిక్కెట్‌లపై 40 శాతం కూడా ఆదాయం లభించడం లేదని ఎల్‌అండ్‌టీ వర్గాలు పేర్కొన్నాయి. వాణిజ్య ప్రకటనలపైనా పెద్దగా ఆదాయం లభించడం లేదు. మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లపై వచ్చే ఆదాయం కూడా తక్కువే. దీంతో ప్రతిరోజు రూ.కోటికి పైగా నష్టాలతో రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఎల్‌అండ్‌టీ ఇటీవల కొంతకాలంగా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

► మెట్రోరైల్‌ అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వం ఎల్‌అండ్‌టీకి పెద్ద ఎత్తున భూములను లీజుకు ఇచ్చింది. సుమారు 104 ఎకరాల్లో మియాపూర్‌ వద్ద ఒక డిపోను, మరో 110 ఎకరాల్లో నాగోల్‌ వద్ద మరో డిపోను నిర్మించారు. ఇవి కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 69 ఎకరాల అత్యంత విలువైన (ప్రైమ్‌ల్యాండ్స్‌)కూడా ఆ సంస్థకు లీజు ద్వారా దక్కాయి.

ఈ 69 ఎకరాల్లోనే ప్రస్తుతం రాయదుర్గం మెట్రోస్టేషన్‌ వద్ద ఉన్న 15 ఎకరాలపై సబ్‌లైసెన్స్‌ హక్కులను కల్పిస్తూ సదరు సంస్థకు తాకట్టు పెట్టడం గమనార్హం. నిజానికి ప్రభుత్వం ఎల్‌అండ్‌టీకి లీజుకు ఇచ్చిన భూములను వాణిజ్యపరంగా వినియోగించుకొని ఆదాయాన్ని ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ భూములను విక్రయించేందుకు ఎలాంటి హక్కులు లేవు. కానీ లీజు గడువు ఉన్నంత వరకు ప్రాతిపదికన తాజాగా తాకట్టుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు చర్యలు చేపట్టింది.

ప్రభుత్వానికి తిరిగి దక్కేనా..
రాయదుర్గం వద్ద ఉన్న 15 ఎకరాలను తాకట్టు పెట్టగా మరో 54 ఎకరాలు మాత్రమే ఎల్‌అండ్‌టీ వద్ద ఉంది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ భూములను సైతం ఇదే పద్ధతిలో సబ్‌లైసెన్సింగ్‌ హక్కుల రూపంలో తాకట్టు పెడుతూ పోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. లీజు గడువు ముగిసిన అనంతరం ప్రభుత్వానికికే మేరకు తిరిగి దక్కుతాయా లేదా అనేది కూడా సందేహాస్పదమే. అలాగే సబ్‌లైసెన్సింగ్‌ హక్కులు కల్పించే నెపంతో తాకట్టుపెట్టడం ఏ మేరకు చట్టసమ్మతమనేది కూడా సందేహాలనే రేకెత్తిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement