పదేళ్లయినా ఆచరణకు నోచుకోని ‘లాస్ట్‌మైల్‌’ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పదేళ్లయినా ఆచరణకు నోచుకోని ‘లాస్ట్‌మైల్‌’ లక్ష్యం

Published Mon, Aug 21 2023 5:20 AM | Last Updated on Mon, Aug 21 2023 8:08 AM

- - Sakshi

హైదరాబాద్: ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి యూసుఫ్‌గూడకు వెళ్లేందుకు చార్జీ రూ.45. బోడుప్పల్‌లోని వెంకటేశ్వర టెంపుల్‌ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌ వరకు ఆటోచార్జీ రూ.120. అంటే బోడుప్పల్‌ నుంచి ఒక ప్రయాణికుడు యూసుఫ్‌గూడకు వెళ్లేందుకు కనీసం రూ.165 ఖర్చు చేయాలి. కేవలం రూ.100 పెట్రోల్‌తో సొంత వాహనంలో యూసుఫ్‌గూడ వరకు వెళ్లి రావచ్చు. మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేకపోవడంతో చాలా మంది ప్రయాణికులు సొంత వాహనాలనే ఆశ్రయిస్తున్నారు.

ఇంటి నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్రోస్టేషన్‌కు చేరుకోవాలంటే కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆటో చార్జీలు, మెట్రో చార్జీలు కలిపి సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి. దీంతో చాలా మంది వ్యక్తిగత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు 10 సంవత్సరాలు దాటినా పూర్తిస్థాయిలో లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ అందుబాటులోకి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో టికెట్లపై ఆదాయం లేక మెట్రో రైళ్లు సైతం నష్టాల్లో నడుస్తున్నాయి. ప్రపంచంలోని అనేక నగరాల్లో మెట్రో రైళ్లు నష్టాల్లోనే నడుస్తున్నట్లు సరిపెట్టుకున్నా.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మరిన్ని నష్టాలను చవిచూడాల్సివస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అటకెక్కిన లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ..
మెట్రో రైలు సేవలను వినియోగించుకొనే ప్రతి ప్రయాణికుడు ఇంటి నుంచి బయలుదేరి చివరకు ఇంటికి చేరుకొనేందుకు అనుగుణంగా లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ ఉండాలని 2011లోనే ప్రతిపాదించారు. ఈ మేరకు నగరంలోని వివిధ మార్గాల్లో మెర్రీ గో బస్సులను నడిపేందుకు అప్పట్లో మెట్రో రైల్‌ ప్రణాళికలను రూపొందించింది. ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా అందుబాటులోకి రాలేదు.

ఆ తర్వాత మెట్రో స్టేషన్లకు రెండు వైపులా ఉన్న కాలనీల నుంచి మినీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీని రంగంలోకి దించారు. కానీ అది ప్రతిపాదన దశలోనే ఉంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఓలా, ఉబెర్‌ వంటి క్యాబ్‌ సంస్థలు మినహా ఇప్పుడు ఎలాంటి లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేదు. పైగా ప్రయాణికులు సొంత వాహనాల్లో మెట్రో వరకు చేరుకొని అక్కడి నుంచి వెళ్లేందుకు పార్కింగ్‌ సదుపాయం లేదు.

ఉన్న స్టేషన్లలో భారీగా పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో ఆ విధంగా కూడా మెట్రో ప్రయాణం భారంగానే మారింది. నాగోల్‌– రాయదుర్గం, ఎల్‌బీనగర్‌–మియాపూర్‌, జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ కారిడార్‌లకు ఇరువైపులా వందల కొద్దీ కాలనీ, నివాస ప్రాంతాలు ఉన్నాయి. కానీ లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేకపోవడం వల్లనే ప్రయాణికులు సిటీ బస్సులను, ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు సొంత వాహనాల వినియోగం కూడా భారీగా పెరిగింది.

కనీసం 16 లక్షల మంది ఉండాలి..
ఎలాంటి లాభనష్టాలు లేకుండా మెట్రో రైళ్లు నడవాలంటే ఇప్పుడున్న చార్జీలపై ప్రతిరోజు కనీసం 16 లక్షల మంది ప్రయాణం చేయాలి. కానీ.. 5 లక్షల ప్రయాణికుల మార్క్‌ను దాటేందుకే 10 సంవత్సరాలు పట్టింది. ఈ లెక్కన మరో పదేళ్లు దాటినా లాభనష్టాలు లేని దశకు చేరుకోవడం కష్టమే. ప్రస్తుతం టికెట్లపై 45 శాతం మాత్రమే ఆదాయం వస్తోంది. మెట్రో టికెట్‌ కనిష్ట ధర రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు ఉంది. ఈ చార్జీలను గరిష్టంగా రూ.100కు పెంచితే ఆదాయం పెరగవచ్చు. చార్జీలు పెంచితే జనం మెట్రోకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది.

చార్జీలు పెంచకుండా, నష్టాలు రాకుండా రైలు నడవాలంటే ప్రయాణికుల సంఖ్య పెరగాలి. అందుకు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీని పెంచడం ద్వారా ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడం, దీనికి తగిన విధంగా రైళ్లు, బోగీలను సంఖ్యను పెంచడమే ఏకై క పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రైళ్లకు 3 బోగీలే ఉన్నాయి. ఒక్కో బోగీలో 330 మంది చొప్పున ఒక ట్రైన్‌లో 1000 మంది వరకు మాత్రమే ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ సంఖ్యను పెంచాలంటే అదనపు బోగీలను ఏర్పాటు చేయాలి. వీలైనన్ని మెట్రోస్టేషన్‌లకు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీని అందుబాటులోకి తేవడం ద్వారా, ప్రయాణికుల సంఖ్యకు తగినవిధంగా అదనపు రైళ్లను, బోగీలను ఏర్పాటు చేస్తే నష్టాలను అధిగమించవచ్చని అంచనా.

నాగపూర్‌ రైళ్లపై ఆశలు..
వివిధ మార్గాల్లో రైళ్ల సంఖ్యను పెంచేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఇటీవల నాలుగు మెట్రో రైళ్లను నాగపూర్‌ నుంచి లీజుకు తెచ్చేందుకు సన్నాహాలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకి తగినవిధంగా రైళ్లను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ సూచించిన నేపథ్యంలో అధికారులు అందుకు తగిన చర్యలను చేపట్టారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ఎల్‌బీనగర్‌–మియాపూర్‌, నాగోల్‌– రాయదుర్గం రూట్లలో ట్రిప్పుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement