ఎయిర్‌పోర్టు మెట్రోకు గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు మెట్రోకు గ్రీన్‌ సిగ్నల్‌

Aug 16 2023 6:34 AM | Updated on Aug 16 2023 7:46 AM

- - Sakshi

హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టు పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా హెచ్‌ఏఎంఎల్‌ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది. మరోవైపు రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుంది.

ఈ మేరకు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి 13 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీ పడగా చివరకు ఎల్‌అండ్‌టీతో పాటు ఎన్‌సీసీ సంస్థలో బరిలో పోటీకి నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థలు రూ.5,688 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో నిర్మాణ రంగంలో ఉన్న అపారమైన అనుభవం, మెట్రోరైల్‌ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అర్హతలు, ప్రామాణికత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, యంత్రాలు, నిర్మాణ పద్ధతులు, వివిధ రంగాల్లో ఇప్పటి వరకు పూర్తి చేసిన నిర్మాణాలు, ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంలో అనుభవాలు తదితర అంశాలను ప్రాతిపదికగా చేసుకొని అంతిమంగా ఎల్‌అండ్‌టీ సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం.

పూర్వానుభవంతో..
నగరంలో 72 కి.మీ మెట్రో రైల్‌ మార్గాన్ని నిర్మించిన అనుభవం కూడా ఉంది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టును త్వరలోనే ఆ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు సుమారు 31 కి.మీ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ కోసం ఈపీసీ (ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో నిర్మించనున్నారు. వచ్చే సెప్టెంబరులో పనులు ప్రారంభించి 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.

పూర్తి బాధ్యత నిర్మాణ సంస్థదే...
► ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌ పూర్తయింది. పెగ్‌మార్కింగ్‌ కూడా చేశారు. భూసార పరీక్షలు సైతంపూర్తయ్యాయి. త్వరలో నిర్మాణ సంస్థకు పనులను అప్పగించనున్నారు. సెప్టెంబరులోనే పనులు చేపట్టనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు 31 కి.మీ మార్గంలో 29.3 కి.మీ ఎలివేటెడ్‌ కారిడార్‌ కాగా, మరో 1.7 కి.మీ మార్గంలో భూగర్భ లైన్లు నిర్మించనున్నారు.

► మొదటి దశ మెట్రోలో డిజైన్‌,బిల్డ్‌,ఫైనాన్స్‌,ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానాన్ని పాటించారు.ఈ మేరకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌తో పాటు, ఎల్‌అండ్‌టీ సంస్థలు కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తిగా ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న ప్రాజెక్టు. అందుకే దీన్ని ఇంంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ పద్ధతిలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టును చేపట్టిన సంస్థే ఎలివేటెడ్‌ వయాడక్ట్‌తో పాటు ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ట్రాక్స్‌, రోలింగ్‌ స్టాక్‌, విద్యుత్‌, టెలీ కమ్యూనికేషన్స్‌, ఆటోమేటిక్‌ ఫేర్‌ సిస్టమ్‌ తదితర సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది

ఔటర్‌ అంచుల్లో మణిహారం...
ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంతో నగరంలో పడమటి వైపు నుంచి దక్షిణాది అభివృద్ధి మరింత పరుగులు పెట్టే అవకాశం ఉంది. నిర్మాణరంగం ఉరకలు వేయనుంది. ఔటర్‌ మార్గంలో 31 కి.మీ వరకు ఇదో అద్భుతమైన మణిహారంలా భాసిల్లనుంది. ఎయిర్‌పోర్టు మెట్రో అందుబాటులోకి వస్తే కేవలం ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులకే కాకుండా నార్సింగి, కోకాపేట్‌, మణికొండ, బుద్వేల్‌ తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్‌ వరకు సాధారణ ప్రజలకు కూడా రవాణా సేవలు లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement