హైదరాబాద్: పాతబస్తీలో ఇక మెట్రో పరుగులు తీయనుంది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సన్నాహాలు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న 5.5 కిలోమీటర్ల మెట్రో అలైన్‌మెంట్ ఇంజనీరింగ్ రిఫైన్‌మెంట్ పనులు కొనసాగుతున్నాయని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. నిజానికి జేబీఎస్ నుంచి పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకు 2012లోనే మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్ వరకు పరిమితం చేశారు.
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే నగరవాసులు జేబీఎస్ నుంచి నేరుగా ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని మెట్రో రైలులో వెళ్లి సందర్శించుకోవచ్చు.
సాలార్‌జంగ్‌మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలనూ సందర్శించవచ్చు. నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే పాతబస్తీలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు.
ఐదు స్టేషన్లు..
ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి దారుషిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్‌మెంట్ ఉంటుంది. ఈ మెట్రో రైలు మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తర్వాత సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉంటాయి. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ స్టేషన్లకు మధ్య 500 మీటర్ల దూరమే ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఆలయాలు, మసీదుల పరిరక్షణ....
ఈ మెట్రో మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్‌లలో తగిన మార్పు తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా, కేవలం 4 మినహా మిగిలిన అన్ని మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను పరిరక్షించినట్లు ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ల ఆదేశాల మేరకు ఆ నాలుగు ఆదేశాల మేరకు మిగిలిన నాలుగు మతపరమైన నిర్మాణాలను కూడా కాపాడేందుకు మెట్రో అలైన్‌మెంట్‌కు ఇంజినీరింగ్ పరిష్కారాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆ మార్గంలో రోడ్డు విస్తరణను 80 అడుగులకే పరిమితం చేయనున్నట్లు పేర్కొన్నారు.
కానీ నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. పాతబస్తీ మెట్రో విస్తరణలో నష్టపోయే సుమారు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ కూడా ప్రారంభమైందని, నెలరోజుల్లో భూ సేకరణకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఎండీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment