ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతికి సోమవారం ఉదయం 11.15 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ప్రాణప్రతిష్ట (కలశపూజ) నిర్వహించిన అనంతరం తమిళిసైతో పాటు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతికుమారి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డిలు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేశామని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, నిమజ్జనం వరకు ఇదే తరహాలో ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుందన్నారు. కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్, ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, సందీప్‌రాజ్, లక్ష్మణ్‌యాదవ్, వీణామాధురి తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఖైరతాబాద్ మహాగణపతిని సోమవారం తొలిరోజు ఏకంగా 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
75 అడుగుల భారీ కండువా, జంధ్యం
ఖైరతాబాద్: వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ కండువా, జంధ్యం, గరిక మాలతో పాటు దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి 75 అడుగుల జంధ్యాన్ని, 75 అడుగుల కండువాను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, గరికమాలను ఐఏఎఎస్ అధికారి వెంకటేశ్, లడ్డూ, కరెన్సీ మాలను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్ సమర్పించారు.
సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి ముత్యాలాభిషేకం చేయించారు. హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ పట్టు వస్త్రాలను, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉదాన యూనివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు గుర్రం కొండయ్య పాల్గొన్నారు.
నిమజ్జానికి అన్ని ఏర్పాట్లు: మంత్రి తలసాని
ఖైరతాబాద్: అన్ని పండుగలకు ఏర్పాట్లు చేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆచార, సంప్రదాయాలను గౌరవిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, నగర కొత్వాల్ సీవీ ఆనంద్‌లతో కలిసి సమావేశం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో కంటే 25 శాతం ఎక్కువ విగ్రహాలు ప్రతిష్ఠించడంతో అందుకు తగినవిధంగా నిమజ్జన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.
అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాటు జరగకుండా విజయవంతం చేయాలన్నారు. నిమజ్జనం కోసం ఎన్ని క్రేన్లు కావాలన్నా ఏర్పాటు చేస్తామన్నారు. మంటప నిర్వాహకులకు ఏ ప్రాంతంలో నిమజ్జనం చేయాలో సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. బారికేడింగ్, లైటింగ్, జనరేటర్లు అన్నింటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈసారి నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ మీద 90 వేల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment