హైదరాబాద్: పోలీసు విభాగంలో మరోసారి బదిలీల సీజన్ వచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో ట్రాన్స్‌ఫర్లు జరిగాయి. ప్రభుత్వం మారడంతో ‘పాత వారి’ జాబితాలు సిద్ధం చేస్తున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఇన్‌స్పెక్టర్, ఎస్సై స్థాయిలో భారీ బదిలీలు చోటుచేసుకోనున్నాయి. మరోపక్క ఏసీపీల వ్యవహారాన్ని డీజీపీ కార్యాలయం ఆరా తీస్తోంది. ఈ పోస్టులతో పాటు అదనపు డీసీపీ స్థాయి అధికారులకూ స్థానచలనం తప్పదని తెలుస్తోంది.
కమిషనర్ల పోస్టింగులతో సందేశం..
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మూడు రోజుల్లోనే ముగ్గురు పోలీసు కమిషనర్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ స్థాయి అధికారులకు బదిలీపై పోలింగ్ ముగిసిన నాటి నుంచి చర్చ జరుగుతోంది. పలువురి పేర్లు వినిపించినా.. సర్కారు మాత్రం ఎవరి ఊహకు అందని రీతిలో పోస్టింగ్స్ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన వివిధ స్థాయిలకు చెందిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లోనే ఇదే సీన్. వీటి ద్వారా పోలీసింగ్‌లో రాజకీయ జోక్యం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం ముగ్గురు పోలీసు కమిషనర్లు తమ పరిధిలోని ఠాణాలకు సంస్కరించే పనిలో పడ్డారు. ప్రతిభ, అనుభవాలను పక్కన పెట్టి స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్‌హెచ్‌ఓ), కీలక విభాగాల్లో పోస్టింగ్స్ పొందిన వారి వివరాలను సేకరించారు.
వాటిని పరిగణనలోకి తీసుకుంటూ..
గడచిన కొన్నేళ్లలో రాజధాని వ్యాప్తంగా ఉన్న పోలీసుల బదిలీల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. కేవలం ఎస్‌హెచ్‌ఓలుగా ఉండే ఇన్‌స్పెక్టర్ స్థాయితో పాటు ఇతర విభాగాలు, ఎస్సై పోస్టుల్లోనే ఇదే పరిస్థితి కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ లేదా మినిస్టర్ నుంచి సిఫార్సు లేఖలు తెచ్చుకుంటేనే పోస్టింగ్స్ దక్కేవి. కొందరు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని నేరుగా ఆయా అధికారులకు చెప్పేవాళ్లు. తమ అనుమతి లేకుండా పోస్టింగ్ పొందిన అధికారులు చేరకుండా నేతలు అడ్డుపడిన సందర్భాలూ అనేకం. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రస్తుత కమిషనర్లు భారీ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. పరిధి, ప్రాధాన్యం, నేరాల నమోదు ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఠాణాల్లోని పరిస్థితులు అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా అనువైన అధికారులను నియమించాలని నిర్ణయించారు.
మూస ధోరణితో వెళ్లకుండా..
ప్రభుత్వం మారిన ప్రతిసారీ పోలీసు బదిలీలు తప్పనిసరి. ప్రతి సందర్భంలోనూ దాదాపు 90 శాతం అధికారులు మారిపోతుంటారు. ఫోకల్‌లో ఉన్న వాళ్ళు నాన్–ఫోకల్‌కు, అక్కడి వారు బయటకు వస్తుంటారు. ఠాణాల్లో పని చేస్తున్న ప్రతి అధికారీ పాత నేతలకో, అధికారులతో తొత్తులు కాదు. బదిలీల నేపథ్యంలో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సిఫారస్‌లకు చెక్ చెబుతూ పనితీరు, అనుభవనం, నిజాయతీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా స్థాయిలకు చెందిన అధికారుల జాబితా సిద్ధం చేసిన పోలీసు కమిషనర్లు నిఘా విభాగాల ద్వారా వారికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేవలం సర్వీసు రికార్డుల ఆధారంగా కాకుండా కొందరికి సంబంధించి బాహ్య ప్రపంచానికి తెలియని అంశాలను ఆరా తీయిస్తున్నారు.
ఏసీపీ స్థాయిలో ‘ప్రయత్నాలు’..
రాజధానిలో ఉన్న మూడు కమిషనరేట్లలో డీఎస్పీ స్థాయి అధికారులు ఏసీపీలుగా, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు అదనపు డీసీపీగా పని చేస్తుంటారు. ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో అనేక చోట్ల ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి, ఆ నేతల సిఫార్సులతోనే పోస్టింగ్ వచ్చింది. ప్రస్తుతం ఈ అధికారులు తమ ‘జెండా’ మార్చేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. తమను తామున్న స్థానాల్లోనే కొనసాగించాలని, గతానికి భిన్నంగా తాము మీ మాట వింటామని, ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు వస్తే వాళ్లు మీకు అనుకూలంగా ఉండరంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం ఆ స్థాయిల్లోనూ ప్రక్షాళనకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment