ఏడాది క్రితం అదృశ్యం..ఎట్టకేలకు ఆచూకీ లభ్యం
ఓ వ్యక్తి..ఐదుగురు పిల్లలను బోయిన్‌పల్లిలో గుర్తించిన పోలీసులు
కుటుంబ తగాదాలతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిన వైనం..
ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా ఛేదించిన నాగోలు పోలీసులు
నాగోలు: ఏడాది క్రితం ఐదుగురు పిల్లలతో అదృశ్యమైన ఓ వ్యక్తిని నాగోలు పోలీస్‌లు ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా ఛేదించి పట్టుకున్నారు. నాగోలు ఇన్‌స్పెక్టర్ సూర్యనాయక్ తెలిపిన వివరాల ప్రకారం..జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా ప్రాంతానికి చెందిన బోలా ప్రసాద్, బీహార్‌కు చెందిన మాల్దీదేవి 17 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇద్దరు కలిసి తట్టిఅన్నారంలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు జన్మించారు. ఈ నేపథ్యంలో సంపాదన సరిగా లేక..పిల్లల పోషణ భారమై భార్యాభర్తలు గొడవలు పడ్డారు. దీంతో గతేడాది నవంబర్ 8న బోలా ప్రసాద్ తన పిల్లలు బాల్య(16), దీపక్ (12), సూరజ్ (10), సునీల్(8), మనీషా(7)లను తీసుకుని భార్యకు చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. భర్త, పిల్లల అదృశ్యంపై భార్య మాల్దీదేవి అదేరోజు నాగోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అయితే వీరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వివరాలు ఏవీ లేక పోలీసులకు ఎంత వెదికినా ఆచూకీ చిక్కలేదు. ఇటీవల మరోసారి బాధితురాలి ద్వారా ఆధార్ కార్డు తెప్పించుకొని స్టేషన్ ఎస్‌ఐ వి.రమేష్, క్రైమ్ పీసీలు సుభాష్, సాయిష్‌లు విచారణ ప్రారంభించారు. ఇటీవల బోలా ప్రసాద్ కొత్త మొబైల్ నెంబర్ కోసం సిమ్ తీసుకుని అక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చినట్లు తెలుసుకున్నారు. దీని ద్వారా అతను బోయిన్‌పల్లిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి పిల్లలతో సహా ప్రసాద్‌ను పట్టుకుని మాల్దీ దేవికి శనివారం అప్పగించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులను ఇన్‌స్పెక్టర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment