తుక్కు కోసం వెళ్తే ట్రాలీ కూడా దొరికింది!
జీడిమెట్ల: పాతబస్తీ ప్రాంతానికి చెందిన నలుగురు దొంగలు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఓ స్క్రాప్ గోదాంను టార్గెట్ చేశారు. అందులో ఉన్న తుక్కు చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి తాళాలు పగులకొట్టి గోదాంలోకి వెళ్లిన వారికి తుక్కుతో పాటు టాటా ఏస్ ట్రాలీ కూడా కనిపింది. దాని తాళాలు సైతం అందుబాటులో ఉండటంతో దొంగిలించిన స్క్రాప్‌ను అందులోనే వేసుకుని ఉడాయించారు. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్‌కుమార్ తెలిపారు. జీడిమెట్ల ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గోపిరెడ్డి బాలకృష్ణ అనే వ్యక్తి జీడిమెట్ల పరిధిలోని రాంరెడ్డినగర్‌లో స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గోదాం, గేటుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. రాగి వైరుతో సహా అనేక వస్తువులు ఉంటాయని ఈ గోదాంపై కన్నేసిన పాతబస్తీలోని కాలపత్తర్ వాసులు సయ్యద్ ఫెరోజ్, మహ్మద్ అలం, అస్లాం ఖాన్‌న్, రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ గఫూర్, సోహైల్ అదే రోజు రాత్రి తాళాలు పగులకొట్టి గోదాంలోకి ప్రవేశించారు. వారికి అక్కడ రాగి వైరు, సామానుతో పాటు ఓ ట్రాలీ కూడా కనిపించింది. ఆ సమీపంలోనే దాని తాళాలు సైతం ఉండటంతో చోరీ చేసిన సొత్తు అందులోనే వేసుకుని ఉడాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు వేల కేజీల రాగి వైరుతో పాటు గోదాంలో ఉన్న ఇతర లోహ వస్తువులను ట్రాలీలో వేసుకుని పరారయ్యారు. మర్నాడు ఉదయం తన గోదాంకు వచ్చిన బాలకృష్ణ చోరీ జరిగినట్లు గుర్తించి జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన గోదాం, దానికి దారి తీసే మార్గాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న 150 సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించారు. వాటిలో కనిపించిన దృశ్యాల ఆధారంగా పాత నేరగాళ్లయి సయ్యద్ ఫెరోజ్, ఆలంలను గుర్తించారు. ఫెరోజ్‌పై 2011లో పంజగుట్ట, ఆలంపై 2023లో హయత్‌నగర్ ఠాణాల్లో చోరీ కేసులు నమోదయ్యాయి. వారి కదలికలపై పోలీసులు నిఘా ఉంచిన పోలీసులు గురువారం ఉదయం గాజులరామారం చౌరస్తాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఫెరోజ్, ఆలం, అస్లాం ఖాన్, గఫూర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో రూ.7.64 లక్షల నగదు, ట్రాలీ, వెయ్యి కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సోహైల్ కోసం గాలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాజులను డీసీపీ అభినందించారు.
స్క్రాప్ చోరీ కోసం గోదాంలోకి నలుగురు దొంగలు
అక్కడ ఉన్న వాహనంతో సహా సరుకు చోరీ
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment