ఇదేమిటో గుర్తు పట్టారా? దాదాపు మూడు వారాల క్రితం ఇజ్రాయెల్‌లోని హెక్ట్ మ్యూజియంలో ఏరియల్ గెలర్ అనే నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తాకడంతో కింద పడి ముక్కలైపోయిన 3,500 ఏళ్ల నాటి అరుదైన కూజా ఇది. పట్టి చూస్తే తప్ప పగిలిన ఆనవాళ్లు కని్పంచకుండా రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ సారథ్యంలోని బృందం దాన్ని అత్యంత నైపుణ్యంతో ఇలా తిరిగి అతికించింది.
బుధవారం నుంచి కూజాను మ్యూజియంలో మళ్లీ ప్రదర్శనకు ఉంచారు. ఇంతటి అరుదైన కూజా పగిలిపోయినా మ్యూజియం సిబ్బంది హుందాగా స్పందించిన తీరు అందరి మనసులూ గెలుచుకుంది. బాలున్ని గానీ, అతని తల్లిదండ్రులను గానీ వాళ్లు ఏమాత్రమూ నిందించలేదు. పైగా ‘పిల్లలన్నాక ఇలా చేస్తుంటారు, మరేం పర్లే’దంటూ ఊరడించారు. జరిమానా చెల్లిస్తామన్నా అలాంటిదేమీ అక్కర్లేదన్నారు. మ్యూజియం చీఫ్ దగ్గరుండి మరీ వారికి మ్యూజియం అంతా తిప్పి చూపించారు.
గిల్టీ ఫీలింగ్ నడుమ సరిగా చూశారో లేదోనని పది రోజులు పోయాక మరోసారి మ్యూజియం సందర్శనకు ఆహా్వనించారు. ఆ సందర్భంగా చిన్నారి గెలర్ ఒక మట్టి కూజా తీసుకెళ్లి బహూకరించడంతో సిబ్బంది తెగ ఆనందపడిపోయారు. బాలునితో చాలాసేపు గడపడమే గాక పగిలిన కూజాలను ఎలా అతికిస్తారో ప్రత్యక్షంగా చూపించారు.
‘‘పురాతత్వ వస్తువులను తాకి చూస్తే వాటిపై అనురక్తి కలుగుతుంది. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?! అందుకే అవి సందర్శకులకు చేతికందే సమీపంలోనే ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం’’ అని మ్యూజియం చీఫ్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే అతికించిన కూజాను రక్షణ వలయం వంటివేవీ లేకుండా తాజాగా మళ్లీ సందర్శకులకు అందుబాటులోనే ఉంచడం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment