
ఐక్యరాజ్యసమితి: కోవిడ్–19 ముప్పు తొలగిపోలేదని, మహమ్మారి ఇంకా మనతోనే ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ హెచ్చరించారు. వైరస్ రూపాంతరం చెందుతూ (మ్యుటేటింగ్) తనను తాను అభివృద్ధి చేసుకుంటోందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన ఒక నివేదిక విడుదల చేశారు. ఇటీవల భారత్, దక్షిణ అమెరికాతోపాటు ఇతర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయని, వైరస్ బారినపడి ఊపిరి అందక విలవిల్లాడిన ఎంతోమందిని మన కళ్లముందే చూశామని అన్నారు. అందరికీ రక్షణ కల్పించేదాకా... ఏ ఒక్కరూ క్షేమంగా ఉండలేరని తాను మొదటి నుంచే చెబుతున్నానని గుర్తుచేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్ల పంపిణీ తదితర విషయాల్లో ప్రపంచ దేశాల మధ్య అసమానత నెలకొనడం బాధారమని చెప్పారు. పేద దేశాలను వైరస్ దయకు వదిలేశామని ఆవేదన వ్యక్తం చేశారు.
నిధుల కొరత తీర్చండి
భయంకరమైన వైరస్‌తో మనం యుద్ధం సాగిస్తున్నామని ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. ఈ దశలో మనకున్న ఆయుధాలను సక్రమంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. నిధుల కొరత, పరిమిత ఉత్పత్తి సామర్థ్యం వల్ల ఆశించిన స్థాయిలో కరోనా వ్యాక్సిన్లను తయారు చేసుకోలేకపోతున్నామని చెప్పారు. ఇప్పటిదాకా 17 కోట్ల డోసులను ‘కోవాక్స్’ కార్యక్రమం కింద పేదదేశాలకు అందించాల్సి ఉండగా... 6.5 కోట్ల డోసులు మాత్రమే పంపిణీ చేయగలిగామని అన్నారు. నిధుల కొరతను తీర్చే విషయంలో జీ20 దేశాలు చొరవ చూపాలని కోరారు. వందల కోట్లు పెట్టుబడి పెడితే లక్షల కోట్లు ఆదా అవుతాయని, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు నిలుస్తాయని వ్యాఖ్యానించారు. ప్రపంచమంతటా కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని గ్యుటెరస్ సూచించారు. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా ఆపాలన్నా, మహమ్మారిని అంతం చేయాలన్నా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఉత్పత్తి చేసిన కరోనా టీకాల్లో 82శాతం టీకాలు ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, కేవలం 0.3 శాతం టీకాలు పేద దేశాలకు అందాయని వెల్లడించారు.
చదవండి: USA: ఆర్‌ఎంపీలకు ఆన్‌లైన్ శిక్షణ)
Comments
Please login to add a commentAdd a comment